వెనుకబడ్డ జాతని పేరు పెట్టి
ఏండ్లకనంగ తొక్కిండ్రు
ఇప్పుడుద్ధరిస్తామంటూ ఆశ పెట్టి
ఆకాశానికి లేపిండ్రు..
అక్కడి సూర్యుడిక్కడ మొలిచినా
ఆరు నూరైనా, నూరు ఆరైనా
మీరు ఎంతుంటే మీకంతనే
డొల్ల హామీలు దొంగ మాటలకు
పాలాభిషేకాలు పూలాభిషేకాలు
చెల్లని చట్టాలు, జీవం లేని జీవోలు
నిమిషానికో మాట
గంటకో విధానం
పూటకో ఆర్డినెన్స్
రోజుకో బిల్లు
నెలకో తీర్మానం..
తూతూ మంత్రపు ధర్నాలు
మా రాజుకు పట్టాభిషేకం
అయితేనే సాధ్యమంటూ
ఊకదంపుడు ప్రసంగాలు
దింపుడు కళ్ళం ఆశలన్నీ..
అడియాశలు చేసి
సావు కబురు సల్లగా శెప్పిరి
ఈడ కాకపోతే ఆడ తేల్చుకుంటమన్నరు
అక్కడ తరిమితే
ఇక్కడికచ్చి పడ్డరు
ఈడి నుంచి ఆడికి
ఆడి నుంచి ఈడికి
దోని సప్పుడే గాని దొయ్య పారలే..
దొంగతనం చేసినోడే
దొంగా, దొంగని మొత్తుకుంట
మందిల కలిసిపోయి
మంచోడైంది నిన్నటి కథ..
ట్రెండ్ మారింది..
టెక్నాలజీ పెరిగింది
సర్వనాశనం చేయాలంటే..
వాడితోనే స్నేహం నటించాలన్న
శకున నీతిని కనిపెట్టు
నువ్వెక్కుపెట్టిన బాణాన్ని చూసి
గుండెలు గుబేలుమన్నయ్
కార్జాలు జల్లుమన్నయ్..
నీతో యుద్ధం చేసుడు చేతగాక
సంఘంల జొచ్చి…
సంఘీభావం అంటున్నరు..
సాటుంగ నిన్ను చంపి
శవం మీద పూలు చల్లిండ్రు
మొసలి కన్నీళ్లు పెడుతుండ్రు
క్వింటాళ్ల కొద్ది ప్రేమ
టన్నులకొద్ది సానుభూతి..
సంపినోడే సంతాప సభ పెట్టిండు
ఓ… బీసీ తస్మాత్ జాగ్రత్త!
-ఉప్పుల శ్రీనివాస్
91002 57358