Taapsee Pannu | బాలీవుడ్ స్టార్ నటి తాప్సీ పన్నూ తన సినీ ప్రయాణంతో పాటు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ‘డంకీ’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘అస్సీ’ (Assi) ఈ
చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా.. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గోన్న తాప్సీ మాట్లాడుతూ.. తన 10 ఏండ్ల కష్టానికి దక్కిన అరుదైన బహుమతిగా ‘డంకీ’ చిత్రాన్ని అభివర్ణించింది. పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ, మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ హీరోయిన్గా తనను అంగీకరించడానికి మేకర్స్ ఇంకా కొంత సమయం తీసుకుంటున్నారని ఆమె అభిప్రాయపడింది. ‘అస్సీ’, తప్పడ్ వంటి వైవిధ్యమైన, కంటెంట్ ఉన్న సినిమాలు చేయడం వల్లే తనకు ‘డంకీ’లో అవకాశం వచ్చిందని, ఆ చిత్రాలలో తన నటనను చూసి దర్శకుడు హిరానీ గారు తనను ఎంచుకున్నారని తాప్సీ తెలిపింది.
నిజానికి తన కెరీర్ దక్షిణాదిలో పూర్తి మాస్ సినిమాలతోనే మొదలైందని, హిందీలో కూడా డేవిడ్ ధావన్ వంటి కమర్షియల్ దర్శకుడి చిత్రంతోనే ఎంట్రీ ఇచ్చానని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. అయినప్పటికీ, తనను కేవలం గ్లామరస్ పాత్రలకు పరిమితం చేయకుండా పరిశ్రమ కొత్త కోణంలో చూడటానికి కొంత సమయం పట్టిందని తెలిపింది. షారుఖ్ ఖాన్ మరియు రాజ్‌కుమార్ హిరానీ కాంబినేషన్లో వచ్చిన ‘డంకీ’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా, తాప్సీ నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు కూడా అందాయి.