Venki Atluri | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ చేసిన 8 గంటల షిఫ్ట్ వ్యాఖ్యలు గత కొన్ని నెలలుగా సినీ పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. రోజుకు ఎనిమిది గంటలకు మించి షూటింగ్ చేయనని ఆమె పెట్టిన షరతులు, అనంతరం కొన్ని భారీ ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడం వంటి పరిణామాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వివాదంపై తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరి స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూర్య హీరోగా నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో ప్రముఖ జర్నలిస్ట్ అనుపమ చోప్రా, తెలుగు చిత్ర పరిశ్రమ వర్కింగ్ స్టైల్ గురించి వెంకీ అట్లూరిని ప్రశ్నించారు.
హిందీ చిత్రసీమతో పోలిస్తే తెలుగు ఇండస్ట్రీలో పని చేసే విధానం ఎలా ఉంటుందనే ప్రశ్నకు వెంకీ అట్లూరి ఎంతో హుందాగా సమాధానం ఇచ్చారు. అయితే ఆయన మాటల్లో దీపికా పదుకోన్ 8 గంటల షిఫ్ట్ వివాదానికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు చిత్రసీమలో పని చేసే విధానానికి ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఉదయం ఎనిమిది గంటలకు షూటింగ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. టెక్నీషియన్లు ముందుగానే సెట్స్‌కు చేరుకుంటారు. సాధారణంగా రోజుకు 11 నుంచి 12 గంటల వరకు షూటింగ్ జరుగుతుంది. నటీనటులు కూడా దాదాపు పది గంటల పాటు సెట్స్‌లో ఉంటారు. ఇదే మా స్టాండర్డ్ అని తెలిపారు.
తాను ఒకవేళ హిందీ సినిమా చేయాల్సి వస్తే అక్కడి వర్కింగ్ కల్చర్‌ను ముందుగా అర్థం చేసుకుని దానికి అనుగుణంగా పని చేస్తానని చెప్పారు. నేను వేరే ఇండస్ట్రీకి వెళ్తే అక్కడి నిబంధనలు పాటిస్తాను. అలాగే తెలుగు చిత్రసీమకు వచ్చే ఇతర భాషల నటీనటులు, టెక్నీషియన్లు కూడా ఇక్కడి వర్కింగ్ కల్చర్‌కు అనుగుణంగా ఉండాలి. తమిళం, మలయాళం, హిందీ నుంచి ఎవరైనా వచ్చినా తెలుగు సినిమా పని చేసే విధానాన్ని గౌరవించి అడాప్ట్ కావాల్సిందే అని పేర్కొన్నారు. దీపికా పదుకోన్ రోజుకు ఎనిమిది గంటలకే పరిమితమయ్యే షిఫ్ట్‌ను కోరడం అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు నటీనటుల పని-వ్యక్తిగత జీవిత సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని ఆమె నిర్ణయాన్ని సమర్థించగా, మరికొందరు సినిమా నిర్మాణ ప్రక్రియలో ఇలాంటి షరతులు ప్రాజెక్టులపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు వెంకీ అట్లూరి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో సోషల్ మీడియాలో చర్చ మళ్లీ వేడెక్కింది. తెలుగు చిత్రసీమలో ఉన్న వర్కింగ్ కల్చర్, ఇతర పరిశ్రమలతో ఉన్న తేడాలపై సినీ వర్గాల్లో మరోసారి ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.