ఎర్రుపాలెం, జూలై 30 : అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం ఎర్రుపాలెం మండలంలోని కేజీబీవీ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 8వ, 9వ తరగతి విద్యార్థినులకు మానవ అక్రమ రవాణా ప్రమాదాలు, వాటి నివారణ చర్యలపై సూపర్వైజర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తుల మాటలను నమ్మవద్దని, ఎవరైనా మోసపూరితంగా లేదా బలవంతంగా తమను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వెంటనే గట్టిగా అరుస్తూ చుట్టుపక్కల వారి సహాయం కోరాలని సూచించారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో మహిళల హెల్ప్‌లైన్ 181, అత్యవసర సేవల నంబర్ 112, చిన్నారుల సహాయ హెల్ప్‌లైన్ 1098, పోలీసు అత్యవసర నంబర్ 100, సైబర్ నేరాల హెల్ప్‌లైన్ 1930 కు వెంటనే సమాచారం అందించాలని వివరించారు. ఈ హెల్ప్‌లైన్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ సరిత, ఐసీడీఎస్ సూపర్వైజర్లు బి.ఎస్.మధులత, టి.సరిత, ఎం.లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయునులు పాల్గొన్నారు.