Sumanth | ‘న్యూటన్స్ థర్డ్ లా’ (Newton’s 3rd Law) సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో టాలీవుడ్ నటుడు సుమంత్ (Sumanth) ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చి బ్లాక్‌బస్టర్ అయిన ‘దేశముదురు’ కథను మొదట పూరి గారు తనకే చెప్పారని, కానీ కొన్ని కారణాల వల్ల తాను ఆ సినిమాకు నో చెప్పానని ఆయన వెల్లడించారు. అయితే, ఆ సినిమాను అల్లు అర్జున్ చేసిన విధానం చూశాక.. నిజాయితీగా చెప్పాలంటే ఆ పాత్రను బన్నీ తప్ప మరొకరు అంత బాగా చేయలేరని సుమంత్ ప్రశంసించారు. ప్రస్తుతం సుమంత్, జగపతి బాబు, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘న్యూటన్స్ థర్డ్ లా’ (Newton’s 3rd Law). రాజేష్ కర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు (జూలై 31) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర ప్రమోషనల్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
ఈ చిత్రంలో రవి వర్మ, అభినయన తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాజేష్ కర్ణ రచన, దర్శకత్వం వహించగా.. హరీష్ కొహిర్కర్ నిర్మించారు. సింజిత్ ఎర్రమిల్లి సంగీతం అందించగా, వేద వ్యాస్ గొట్టిపాటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. ఏ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌గా వస్తున్న ఈ చిత్రం ‘థ్రిల్లర్ ఆఫ్ ది ఇయర్’గా నిలుస్తుందనే అంచనాలతో జూలై 31న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.