ముషీరాబాద్, సెప్టెంబర్ 23: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పాత విధానంలోనే పథకాన్ని కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ. 8,500 కోట్ల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. బుధవారం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఫీజు బకాయిలు చెల్లించాలని కోరుతూ హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా సీఎం రేవంత్‌రెడ్డి పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో కోర్సులు పూర్తి అయిన 6 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో అవకతవకలు జరిగాయని, విచారణ పూర్తి అయిన వెంటనే బడ్జెట్ ఇస్తామని ముఖ్యమంత్రి ఇటీవల అసెంబ్లీలో చెప్పారని, అవకతవకలు లేని కాలేజీ, యూనివర్సిటీ కాలేజీ, ప్రభుత్వ కాలేజీలకు బడ్జెట్ ఇవ్వడానికి ఇబ్బంది ఏందని ప్రశ్నించారు. నిరసనలో బీసీ సంఘాల నాయకులు నీల వెంకటేశ్, రాజేందర్, నరేశ్‌గౌడ్, నిఖిల్‌పటేల్, కాడరి శివకుమార్, రమేశ్, రాహుల్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.