హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): వరద నీళ్లన్నీ అయిపోయాక కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) అక్టోబర్ 1న సమావేశం కానున్నది. జలసౌధలో జరిగే ఈ భేటీలో ప్రస్తావించాల్సిన ఎజెండా అంశాలను తెలంగాణ అధికారులు సిద్ధం చేశారు. ప్రధానంగా 2026-27 నీటిసంవత్సరంలో 50ః50 నిష్పత్తిలో నీటి వాటా ఇవ్వాలని, తాగునీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేయడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఏపీ చేపడుతున్న నీటిమళ్లింపులపై నిలదీయాలని, ఆర్డీఎస్ ఆధునీకీకరణ, టెలిమెట్రీలు అంశాలను సైతం ప్రస్తావించాలని భావిస్తున్నారు. కేఆర్ఎంబీ చైర్మన్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో బోర్డు సభ్యులు, ఇరు రాష్ర్టాల సెక్రటరీలు పాల్గొనున్నారు.