e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home ఎడిట్‌ పేజీ సద్ది తిన్న రేవును తలువాలె

సద్ది తిన్న రేవును తలువాలె

‘సద్ది తిన్న రేవును తలువాలె’ అన్నది.. సాధారణ జనం నుంచి మొదలుకొని, ఎంతటివారికైనా వర్తించే నైతికతను బోధించే గొప్ప సామెత.తెలంగాణ ప్రజల మనస్తత్వాన్ని ప్రతిఫలించే సామెత. తెలంగాణ ప్రజలు నియ్యత్‌దార్లు. రేషమున్నోళ్లు. ఒక్కసారి ఎవరితోనైనా చిన్న సాయం
పొందినా జిందగీ అంతా యాజ్జేసుకుంటరు. ఒక్కసారి దోస్తానా జేస్తే పానాపానంగా, పాయిరంగా చూసుకుంటరు. పానంబోయినా పజీత పోవద్దని నిక్కచ్చిగా నిలబడుతరు. కానీ ఈటల రాజేందర్‌, అధినేత విశ్వాసాన్ని విరిచేసి, ప్రజల నమ్మకాన్ని పాతరేసి, తిన్నింటి వాసాలు లెక్కవెట్టి
తన వ్యక్తిత్వాన్ని అమ్మకానికి పెట్టాడు. రాజకీయాల్లో పార్టీలు మారడం సహజం. కానీ, రాజకీయ విశ్వాసాలను తాకట్టు పెట్టడం అత్యంత హేయమైనది.

ఉద్యమపార్టీగా, రాజకీయపార్టీగా టీఆర్‌ఎస్‌ తెలంగాణ ఆత్మను ఆవాహన చేసుకున్నది. తెలంగాణ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, చారిత్రక మూలాల పునాదులపై పురుడుపోసుకున్న పార్టీ, తరతరాల బానిసత్వాన్ని బద్దలుకొట్టి, స్వీయ రాజకీయ అస్తిత్వంతో, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్న పార్టీ, ఆత్మగౌరవం ఒకవైపు, అభివృద్ధి మరోవైపు అన్న రెండు స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు వెళ్తూ తెలంగాణ భవితవ్యాన్ని భారత దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థాయిలో నిలిపేందుకు కేసీఆర్‌ అహర్నిశలు కృషిచేస్తున్నారు.

- Advertisement -

టీఆర్‌ఎస్‌ అనే విత్తును నాటి, మహావృక్షంగా విస్తరింపజేసింది కేసీఆర్‌. దాని నీడలో ఎందరో రాజకీయాశ్రయం పొంది, ఎంత ఎత్తుకు ఎదిగిందీ ప్రపంచానికి తెలిసిన సత్యం. ఆ చెట్టు నీడలో చేరిన నాటినుంచి అందరికంటే ఎక్కువ లబ్ధి పొందిందీ, అందరికంటే ఎక్కువ అధినేత ఆదరణను పొందిందీ ఈటలనే! ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, అంతకుముందు ప్రతిపక్ష పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించడంలో కేసీఆర్‌ ఆశీర్వాదమే లేకుంటే అడుగు ముందుకు సాగేది కాదని అందరికీ తెలుసు. కానీ, అహంకారమంటూ మొదలైతే ఎంతటి గొప్ప వ్యక్తులనైనా కాలం అధఃపాతాళానికి తొక్కేస్తుందన్న సత్యానికి సజీవ సాక్ష్యం ఈటల. మొద్దుకు దిగేసిన మేకు ప్రవాహంలో కొట్టుకుపోతూ, మొద్దును తానే మోసుకుపోతున్నాననుకుంటుందట. అట్లాగే ఈటల కూడా, తన స్థాయిని మరిచి, అధినేతతో సమానుడినని స్వైర కల్పనల్లో తేలిపోతూ ప్రవర్తించడం ఆయన చేసిన మొదటి తప్పు.

పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా ఈటల వ్యవహరిస్తున్న తీరు ఆయన మాటలు తన సంకుచితత్వాన్ని తెలియజేస్తున్నాయి. 2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భవిస్తే, 2003లో ఈటల పార్టీలో జాయినయ్యాడు. 2004లోనే కేసీఆర్‌ ఎన్నికల్లో అవకాశం ఇచ్చారు. నాటినుంచి ఇటీవల రాజీనామా చేసేవరకు పదవిలో లేకుండా ఏనాడూ లేడు. ఉద్యమ సందర్భం నుంచి తెలంగాణ సాధించిన తర్వాత ఇప్పటి పాలన సందర్భం వరకు ఈటలను తన కుడి భుజంగా, సొంత తమ్ముడిగా చెప్పుకొంటూ వచ్చారు కేసీఆర్‌. తన పక్కనే స్థానమిచ్చారు. ప్రజల్లో గొప్ప స్థానాన్ని కల్పించారు. ముఖ్యమంత్రికి అందరికంటే సన్నిహితుడు ఈటల అన్న ప్రచారం ఆయన ఇమేజ్‌ను ఎంతగానో పెంచింది. కానీ, ఆ తర్వాత ఈటలలో వచ్చిన మార్పు అటు అధినేత, ఇటు పార్టీ శ్రేణులతో పాటు ప్రజలను విస్మయానికి గురిచేసింది. పార్టీ విషయాలు, ప్రభుత్వ పథకాలు, మంత్రివర్గ నిర్ణయాల పట్ల, బహిరంగ వేదికలపై కామెంట్‌ చేయడం, ఆంతరంగికులతో చర్చించడం ఆయన లాంటి సీనియర్‌ మంత్రికి తగని అనైతిక చర్య.

ఇప్పుడు పార్టీని వీడిన తర్వాత కేసీఆర్‌పై చేస్తున్న కామెంట్లు ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయి. ఉద్యమ సందర్భం నుంచి తెలంగాణ సాధించిన తర్వాత ఇప్పటివరకు ఎప్పుడూ ఆయనను తక్కు వ చేసింది లేదు. అయినా తనకు అన్యాయం జరిగిందని, తన ఆత్మగౌరవం దెబ్బతిన్నదని మాట్లాడుతున్నా డు. ఏ విధమైన అన్యాయం జరిగింది. ఆత్మగౌరవం ఎట్లా దెబ్బతిన్నదన్న విషయాలను ఆయా సంఘటనలు, అంశాలకు సంబంధించి చెప్పమంటే ఇంతవరకు చెప్పడు. గంపగుత్తగా విమర్శించే విమర్శలకు ప్రజల్లో విశ్వసనీయత ఎక్కడుంటుంది? తనను విశ్వసించిన, తన ఎదుగుదలకు వీలు కల్పించిన కేసీఆర్‌ను ధిక్కరించాడు. పార్టీని వీడి, టీఆర్‌ఎస్‌పై గల విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేశాడు. ఇంతచేసి తాను పదేపదే చెప్తున్న ఆత్మగౌరవం అన్న మాటకు అర్థం ఏం చెప్తాడు? తెలంగాణ ఉద్యమమే కదా ఆయన ఆత్మగౌరవాన్ని పెంచింది. ఆ ఉద్యమానికి ఆద్యుడైన కేసీఆర్‌ కదా ఆయనకు గౌరవం దక్కే అవకాశం ఇచ్చింది. ఇప్పుడు కేసీఆర్‌ అవలంబిస్తున్న విధానాల ద్వారా జరుగుతున్న అభివృద్ధిని మెచ్చి ప్రజలు ఇస్తున్న గౌరవమే కదా, మనందరం పొందుతున్న ఆత్మగౌరవం. తనకు, తన నియోజకవర్గానికి జరిగిన అన్యాయం ఏమిటో ప్రజల ముందు బహిర్గతపరచాల్సిన అవసరం ఉన్నది.

తెచ్చుకున్న తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని అనేక కుట్రలు జరుగుతున్నవి. అధికారమొక్కటే లక్ష్యంగా, అన్ని రాజకీయపార్టీలు మిడతలదండు వలె పచ్చగా ఉన్న తెలంగాణపై వచ్చి వాలుతున్నాయి. తెలంగాణ ప్రజలైనా, ఈ ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలైనా నిజానిజాలుగుర్తించలేనంత గుడ్డివాళ్లు కాదు.

ఇప్పుడు మాట్లాడిన చోటల్లా.. నా గడ్డ, నా ప్రజలు అంటూ ఎమోషనల్‌గా మాట్లాడుతున్నాడు. ఆ గడ్డ కేసీఆర్‌ టికెట్‌ ఇవ్వడం ద్వారా, మంత్రిని చెయ్యడం ద్వారా ఆయనదైంది. నా ఎంపీపీ, నా జడ్పీటీసీలు, నా ఎంపీటీసీలు, నా సర్పంచ్‌లను డబ్బులిచ్చి నాకు దూరం చేసి, టీఆర్‌ఎస్‌ కొంటుందని మాట్లాడుతుంటే ముక్కుమీద వేలేసుకోవాల్సి వస్తున్నది. కేసీఆర్‌ నాయకత్వం మీద విశ్వాసంతో టీఆర్‌ఎస్‌ పార్టీ మీద నమ్మకంతో, కేసీఆర్‌ ఇచ్చిన బీఫాంతో ప్రజల విశ్వాసం పొంది గెలిచినవారు వాళ్ళంతా. అటువంటివాళ్లు టీఆర్‌ఎస్‌ శ్రేణులుగా పరిగణింపబడతారా? లేక ఈటల ప్రతినిధులుగా చెప్పబడతారా.. తన పార్టీ శ్రేణులకు తానే డబ్బులిచ్చి కొనుగోలు చేసే దౌర్భాగ్యం పార్టీకి ఎందుకుంటుంది? నేను, నా అనే అహం ఈటలలో అణువణువునా నిండి ఉంది. అందుకే వాస్తవాలను గ్రహించలేకపోతున్నాడు. పార్టీతోనే ఉన్న క్యాడర్‌ను అమ్ముడుపోయారనంటున్నాడు. తనపై వచ్చిన ఆరోపణను నిరూపించుకోకుండానే, తన ఆస్తులను కాపాడుకోవడానికి, తన తప్పులకు రక్షణగా ఉంటుందని పోయి బీజేపీలో చేరిన ఈటల కదా అమ్ముడుపోయింది. ఇప్పుడు ఈయన బీజేపీలోకి వెళ్తే, ఆయనవెంట వెళ్లని వారందరూ అమ్ముడు పోయారనడం ఎంత దుర్మార్గం.

అన్నింటికంటే ముఖ్యమైన విషయం, ఆయన బీజేపీలో చేరిండంటేనే ఆయన సైద్ధాంతిక నిబద్ధతకు గోరీ కట్టుకున్నట్లు. తన నియోజకవర్గ ప్రజల విశ్వాసాలను బీజేపీకి కుదువ పెట్టినట్లు. ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు. భరత మాత ఏడుస్తుంది’ అని మాట్లాడిన మోదీ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, స్వావలంబనను పెరటికుప్పలో పడేసినట్లు కదా! ఆ మాటలే నచ్చి ఆయన సంకలో సొచ్చిండా ఈటల. దశాబ్దాలుగా గంగా జమునా తెహజీబ్‌గా కలిసిపోయి జీవిస్తున్న తెలంగాణ సమాజాన్ని మత విద్వేషాలతో విడగొట్టే ఎజెండా నచ్చి బీజేపీలో చేరిండా? లేక కార్పొరేట్లకు అనుకూలంగా, రైతులు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ విధానాలు నచ్చి చేరిండా అన్నింటికీ మించి, రాష్ర్టాలు బలహీనంగా ఉండి, కేంద్రం బలంగా ఉండాలన్న నియంతృత్వ విధానాలు నచ్చి చేరిండా ఈటల ప్రజలకు జవాబు చెప్పాలి. నేడు దేశానికి అవసరం ఉన్నది ప్రాంతీయ పార్టీలు స్వావలంబనతో, స్వీయ రాజకీయ అస్తిత్వంతో తమకు తాము నిర్ణయాత్మకశక్తిగా తమ ప్రాంతాభివృద్ధిని నిర్దేశించుకోవచ్చు. అంతేకాకుండా ఉత్తరాది సంస్కృతికి పెద్ద పీట వేస్తూ, దక్షిణాది సంస్కృతిని చిన్నచూపు చూసే బీజేపీలో చేరి ఈటల తన ఆత్మగౌరవాన్ని తానే తాకట్టు పెట్టి సెల్ఫ్‌గోల్‌ చేసుకోలేదా? ఉద్యమ సందర్భంలో కేసీఆర్‌తో నడుస్తూ, ఉద్యమ ప్రగతిశీల శక్తులతో మమేకమైనందున, కేసీఆర్‌ అడుగడుగునా అందించిన మద్దతు వల్లనే ఆయనకు దక్కిన కీర్తి అంతా!

వ్యవస్థాగతంగా, టీఆర్‌ఎస్‌ పార్టీ అంతర్గత నిర్మాణాన్ని పరిశీలించినపుడు కేసీఆర్‌ ఒక్కడే స్వయం ప్రకాశకంగా వెలుగుతున్న సూర్యుడు. మిగతావాళ్లంతా ఆ కాంతి పరావర్తనంలో మెరుస్తూ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాల వంటివాళ్లే. ఈ సోయి ఉంటేనే, నాయకుడు, సైనికుల మధ్య ఉండే సమన్వయం సరిగా ఉంటుంది. రాజకీయాల్లో విమర్శలుండవచ్చు, కానీ అవి సహేతుకంగా ఉండాలి. కానీ ఈటల ప్రవర్తన చూస్తుంటే, ఎనకటికెవరో తిన్న పల్లెంలనే ఇంకేమో జేసిండన్నట్ల్లున్నది ఈయన లెక్క. ఈటల బీజేపీలో ఉండి ఏం సాధించగలడు. ఇంతవరకు గెలిచిన ఎంపీలు, మంత్రులే తెలంగాణ కోసం మోదీ, షాల ముందు ధైర్యంగా మాట్లాడి కావల్సిన నిధులు మంజూరు చేయించలేకపోతున్నారు. ఉత్సవ విగ్రహాల్లా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణకు టీఆర్‌ఎస్‌ ఒక్కటే శ్రీరామరక్ష. మైకులు పగులగొట్టే అరుపులతో, జాతరగా వచ్చే జాతీయ నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలతో ఒరిగేదేమీ ఉండదు. ఐదేండ్ల నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో గ్యాప్‌ వచ్చిందని ఈటల చెప్తున్నాడు. అంటే 2016 నుంచే గ్యాప్‌ ఉందని అంగీకరించినట్టే కదా! అయినా ఈటలను కేసీఆర్‌ మళ్లీ మంత్రిని చేశారు. కానీ ఈటల మాత్రం కడుపులో కత్తులు పెట్టుకొని కదులుతున్నట్లు అనిపిస్తుంది.

నేడు దేశానికి అవసరం ఉన్నది ప్రాంతీయపార్టీలు స్వావలంబనతో, స్వీయ రాజకీయ అస్తిత్వంతో తమకు తాము నిర్ణయాత్మకశక్తిగా తమ ప్రాంతాభివృద్ధిని నిర్దేశించుకోవచ్చు. అంతేకాకుండా ఉత్తరాది సంస్కృతికి పెద్ద పీట వేస్తూ, దక్షిణాది సంస్కృతిని చిన్నచూపు చూసే బీజేపీలో చేరి ఈటల తన ఆత్మగౌరవాన్ని తానే తాకట్టు పెట్టి సెల్ఫ్‌గోల్‌ చేసుకోలేదా?

తెచ్చుకున్న తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని అనేక కుట్రలు జరుగుతున్నవి. అధికారమొక్కటే లక్ష్యంగా, అన్ని రాజకీయపార్టీలు మిడతలదండు వలె పచ్చగా ఉన్న తెలంగాణపై వచ్చి వాలుతున్నాయి. తెలంగాణ ప్రజలైనా, ఈ ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలైనా నిజానిజాలు గుర్తించలేనంత గుడ్డివాళ్లు కాదు. తమ ప్రతినిధి టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు దక్కిన గుర్తింపు, జరిగిన అభివృద్ధి ఎలాంటిదో, బీజేపీలోకి వెళ్లాక జరగబోయే పరిణామాలెలా ఉంటాయో చాలా సులువుగా ఊహించగలరు. తమ ఆకలి తెలిసిన నాయకుడు, ఆశలు ఎరిగిన నాయకుడు, అభివృద్ధికి అండగా ఉండే నాయకుడు కేసీఆర్‌ అని వీళ్ల పరిపూర్ణ విశ్వాసం. గతంలో ఈటల ఉన్నా, ఇప్పుడు గెల్లు శ్రీనివాస్‌ ఉండబోతున్నా.. వీరు కేసీఆర్‌కు ప్రతినిధులు మాత్రమే. పథకాలెన్నున్నా ప్రయోజనాలేవైనా అవి కేసీఆర్‌ మేధోమథనంలోంచి ఉద్భవించినవేనన్న విషయం మరువరాదు.

తన మట్టి మీద, మనుషుల మీద ప్రాణప్రదమైన ప్రేమ ఉండాలి. సర్వశక్తులూ ఒడ్డి అభివృద్ధిని సాధించే సామర్థ్యం ఉండాలి. రానున్న ప్రతి సవాళ్లను పసిగట్టి సరైన నిర్ణయాలు తీసుకొనే సత్తా ఉండాలి. అన్నింటి కంటే మించి ప్రజల గుండెల్లో గూడుకట్టుకొనే తిరుగులేని నాయకునిగా స్థానాన్ని పదిలపరచుకోవాలి. అతడే అసలైన నాయకుడు. ఆ నాయకుడే కేసీఆర్‌. ఆయన నాయకత్వం ఒక్కటే తెలంగాణ భవిష్యత్తును మార్చే విజన్‌ కలిగి ఉన్నది. ఆ నాయకత్వాన్ని పదిలపరచుకోవడం ప్రజలందరి బాధ్యత!
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు)

నారదాసు లక్ష్మణ్‌రావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement