చిన్నరాష్ట్రం అనేకరంగాల్లో సమస్యల పరిష్కారానికి ఉపయోగకారిగా ఉంటుంది. దార్శనికుడైన నాయ కుడు ఆ రాష్ర్టానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో లభిస్తుంది. ఇప్పుడు తెలంగాణరాష్ట్రం సాధిస్తున్న విజయాల పరంపర అందులో భాగమే. ప్రభుత్వ రంగంలో ఒకేసారి 9 వైద్య కళాశాలలు ప్రారంభం కావడం, పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి రావడం ఇందుకు ఒక నిదర్శనం.
ఉద్యమనాయకుడు, తెలంగాణరాష్ట్ర ముఖ్యమంతి కల్వకుంట్ల చందశేఖర్రావు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి ఫలాలు సాధారణ ప్రజానీకానికి చేరువయ్యేందుకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా వైద్యారోగ్య రంగంలో రాష్ట్రం వినూత్న ఒరవడిలో సాధిస్తున్న విజయాలు దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని వైద్యారోగ్య సూచీలో అగ్రస్థానంలో నిలుపుతున్నది. వైద్యోత్సవ్ పేరిట సెప్టెంబర్ 15న రాష్ట్ర వ్యాప్తంగా 9 వైద్య కళాశాలలు ఒకేసారి ప్రారంభమైన వేళ దేశవ్యాప్తంగా వైద్యవిద్య గురించి అవలోక నం చేయడం సముచితంగా ఉంటుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 50 కొత్త వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఆరంభమవుతున్నాయి. ఇందులో అత్యధికంగా తెలంగాణలో 11 వైద్య కళాశాలలు ఉన్నాయి.
దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇంతకు మునుపు ఇన్ని కళాశాలలు ఒకేసారి ప్రారంభం కాలేదు. రాజస్థాన్, ఏపీలలో అయిదేసి వైద్య కళాశాలలు ప్రారంభం కా నుండగా, మహారాష్ట్రలో నాలుగు; అసోం,గుజరాత్, హర్యా నా, కర్ణాటక, తమిళనాడులలో మూ డేసి కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. పశ్చిమబెంగాల్, ఒడిశా, జమ్ము కశ్మీర్‌లలో రెండేసి కళాశాలలు; యూపీ, మధ్యప్రదేశ్, నాగాలాండ్‌లలో ఒక్కొక్క కళాశాల అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తు తం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో 695, ప్రైవేటు రంగం లో 383 కళాశాలల్లో మొత్తం 1,07,658 మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్క 2023-24 విద్యా సంవత్సరంలోనే కొత్తగా 8,195 కొత్త సీట్లు అందుబాటులోకి వచ్చా యి. వైద్య విద్య దక్షిణాది రాష్ర్టాల్లో వేగంగా విస్తరిస్తున్నది.కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలు విద్యార్థులసంఖ్య, కళాశాలల సంఖ్య విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. కర్ణాటకలో 38 ప్రభుత్వ,168 ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 10, 945 సీట్లున్నాయి. తమిళనాడులో 10,725 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 9,053 సీట్లు, మహారాష్ట్రలో 9,895 సీట్లు ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో వైద్య ఆరోగ్య రంగంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ఆరోగ్య సేవల విస్తరణ, జిల్లాకొక ప్రభుత్వరంగ వైద్యకళాశాల ఏర్పాటు వీటిలో ప్రధానమైనవి. ఆరోగ్య సేవలు ప్రజలందరికీ చేరువ కావాలనే ఏకైక లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం హెల్త్ ప్రొఫైలింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యవిద్యను విస్తరిస్తూ తనదైన శైలిలో ప్రణాళికలు అమలు పరుస్తున్నారు. రాష్ట్రంలో మారుమూల పాంతాల్లోని విద్యార్థులకు కూడా వైద్యవిద్యను అందుబాటులోకి తెస్తున్న దార్శనిక నాయకుడి నేతృత్వంలో జిల్లాకో ప్రభుత్వ మెడికల్‌కళాశాల త్వరలోనే ఆచరణాత్మకమవుతుందని ఇవాళ్టి విజయం ధృవపరుస్తున్నది.
వైద్యవిద్య కోసం తమ పిల్లలను విదేశాలకు పంపి ఆర్థికపరమైన అవస్థల పాలవుతున్న తల్లిదండ్రులకు మన ముఖ్య మంత్రి చూపిన దార్శనికత భరోసా కల్పిస్తున్నది. చైనా, రష్యా, ఫిలిప్పీన్స్ దేశాల్లో మెడిసిన్ చదువుకోసం తమ పిల్లలను పంపిన తల్లిదండ్రులు కరోనా సందర్భంలో చవిచూసిన మానసికక్షోభ మనందరికీ తెలుసు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అక్కడి మెడిసిన్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనుభవించిన బాధ వర్ణనాతీతం.ఈ దశలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలలు పేద విద్యార్థులకు ఉపయుక్తంగా నిలుస్తాయి. ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌తో పేద విద్యార్థులు తమ చదువును పూర్తి చేయవచ్చు.
తెలంగాణరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర సమగ్రాభివృద్ధే పరమావధిగా చేపడుతున్న కార్యక్రమాలు ఒకెత్తయితే, వైద్య ఆరోగ్యరంగంలో చేపడుతున్న కార్యాచరణ మరొక ఎత్తు. పేదరోగులకు, నిరుపేద కుటుంబాలకు ఆలంబనగా ప్రభుత్వ కార్యాచరణ ఉంటున్నది.
ప్రభుత్వ రంగ దవాఖానల ఆధునీకరణతో పాటు వరంగల్‌లో నిర్మిస్తున్న అంతర్జాతీయస్థాయి దవాఖాన వైద్యరంగంలో కలికితురాయిగా నిలుస్తు న్నది. ఇదే క్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు వేల సంఖ్యలో కొత్త డాక్టర్లను తయారు చేస్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ హబ్‌గా రూపాంతరం చెందనున్నది!