దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రైవేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు వారి ఆదాయాన్ని బట్టి విద్యా వ్యయాన్ని సర్కారే భరించే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వచ్చింది. వృత్తివిద్యా కోర్సులు చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఒక వరంగా పరిణమించింది. ఆర్థికంగా భారమైనా తర్వాతి ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని కొనసాగించాయి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని మళ్లీ చదువులు ఆగమయ్యే పరిస్థితి దాపురించింది.
22 నెలల క్రితం అలవికాని హామీలతో అధికారం హస్తగతం చేసుకున్న , ప్రభుత్వం అనేక నిరుపయోగమైన పథకాలకు ప్రాధాన్యతనిస్తూ వాటికి బడ్జెట్ కేటాయిస్తూ నిధులు విడుదల చేస్తున్నది. కానీ రాష్ట్రంలో లక్షలాదిమంది విద్యార్థినీ విద్యార్థులకు విద్యావకాశాలు కల్పిస్తున్న పథకాన్ని కుట్రపూరితంగా నీరు కారుస్తున్నది. గత రెండేండ్లుగా ప్రైవేట్ కళాశాలలకు నిధులు ఇవ్వడం లేదు. దాంతో ఆయా కళాశాలల యాజమాన్యాలు గత కొంతకాలంగా ప్రభుత్వానికి పదేపదే మహజర్లు సమర్పించి, చివరగా నిరవధిక బంద్ అస్ర్తాన్ని ప్రయోగించారు. మొత్తం పదివేల కోట్ల రూపాయలు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు ప్రభుత్వం బాకీ పడింది. విసుగు చెందిన యాజమాన్యాలు నెల క్రితం సెమిస్టర్ పరీక్షలు బహిష్కరిస్తామని బెదిరిస్తే ప్రభుత్వం చర్చలకు దిగివచ్చి వారిని బుజ్జగించే ప్రయత్నం చేసింది. చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వం రూ.1200 కోట్లకు టోకె న్లు ఇచ్చింది. కానీ దీపావళి నాటికి రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేసి తన అలవాటుగా వాగ్దాన భంగానికి పాల్పడింది. కొన్ని ప్రైవేట్ యాజమాన్యాల వారు లోపల్లోపల కొంత మొత్తాన్ని విడుదల చేయించుకున్నట్టు తెలిసింది. ఇది మరీ దారుణం. ఇప్పుడు మళ్లీ నవంబర్ మూడో తేదీ నుండి భంగపడ్డ ఈ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నిరవధిక బందుకు పిలుపునిచ్చాయి. నవంబర్ ఆరవ తేదీన లక్ష మంది సిబ్బందితో హైదరాబాదులో సభ జరపడానికి నిర్ణయించాయి. అదేవిధంగా 10వ తేదీ లేదా 11వ తేదీలలో 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాదులో ధర్నా చేపడతామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ప్రభుత్వ వృత్తి విద్య కళాశాలలో సరిపోను బోధనా సిబ్బంది లేక ప్రైవేటు కళాశాలలో ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు చెల్లించక మొత్తం మీద వృత్తివిద్యా కోర్సులు అభ్యసించే వారికి విద్యాభంగం జరుగుతున్నది. ఇట్టి బంద్ కార్యక్రమానికి విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు కూడా తమవంతు మద్దతును తెలియజేశాయి.
ప్రైవేట్ యాజమాన్యాల కింద వివిధ కళాశాలల్లో ఇంజినీరింగ్, న్యాయవిద్య, ఎంబీఏ, బీబీఏ, నర్సింగ్, పాలిటెక్నిక్, బి.ఎడ్, ఎం.ఎడ్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు నడుస్తున్నాయి. వీటిలో లక్షలాదిమంది విద్యార్థులు చదువుకుంటుండగా వీటికి సంబంధించిన ట్యూషన్ ఫీజు గత మూడు సంవత్సరాలుగా దాదాపు పదివేల కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వం యాజమాన్యాలకు చెల్లించవలసి ఉన్నది. నిర్వహణ ఖర్చులు భరించలేక, సిబ్బంది జీతభత్యాలు చెల్లించలేక విధి లేని పరిస్థితుల్లో ప్రైవేటు మేనేజ్మెంట్లు ప్రభుత్వంపై ప్రత్యక్ష చర్యకు తలపడుతున్నాయి. బకాయిల చెల్లింపు విషయంలో మాట తప్పిన ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల మీదకు విజిలెన్స్ దాడులకు సిద్ధపడుతున్నది. దీనిని కూడా యాజమాన్యాలు ఖండిస్తున్నాయి. ఒకరకంగా యాజమాన్యాలపై ప్రభుత్వం విజిలెన్స్ దాడుల పేరు మీద బెదిరింపులకు దిగజారుతున్నదని విద్యార్థులు, సిబ్బంది, యాజమాన్యాలు కూడా ఆరోపిస్తున్నారు. ఇది ఒకరకంగా బ్లాక్మెయిలింగ్గానే పరిగణించాలి.
ఒకపక్క ఒక్కొక్క విద్యార్థికి రూ.35000 చెల్లించవలసి ఉండగా గత రెండేళ్లుగా కొన్ని కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోవడంతో బెస్ట్ అవైలబుల్ స్కీం కింద అడ్మిషన్ పొందిన విద్యార్థుల భవిష్యత్తు ప్రైవేటు పాఠశాలల్లో ప్రశ్నార్థకంగా మారుతున్నది. యాజమాన్యాలు ఆ పథకంలో తమ దగ్గర చదువుతున్న విద్యార్థినీ విద్యార్థుల చదువు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నాయి. కొంతకాలంగా ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల యాజమాన్యాలు కూడా ప్రత్యక్ష చర్యలకు దిగుతామని హెచ్చరించినా ప్రభుత్వంలో పెద్దగా చలనం లేదు. మొత్తంగా పాఠశాల విద్య, జూనియర్ కళాశాలవిద్య, వృత్తి విద్యలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది. వాటిలో చదువుతున్న విద్యార్థులకు దినమొక పరీక్ష లాగా సాగుతున్నది. వారు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారు. 2023 వరకు విజయవంతంగా సాగిన ఈ పథకం కాంగ్రెస్ చేతిలో అభాసు పాలవుతున్నది. ప్రభుత్వం తక్షణమే మేల్కొని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నట్టుగా కనీసం సగం డబ్బు, అంటే రూ.5000 కోట్లయినా విడుదల చేసి ఈ అనిశ్చిత పరిస్థితిని తొలగించాల్సిందిగా విద్యాభిమానులకు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.