2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మోసం చేసింది. కనిపించని 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ఇచ్చిన హామీలు రాజకీయ మాయాజాలం మాత్రమే. రేవంత్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సుమారు రెండేండ్లు గడుస్తున్నా హామీలను అమలుచేయడం లేదు. దీంతో పేదలు, బీసీలు, దళితులు, రైతులు, నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలు అందరూ అసంతృప్తిలో మునిగారు.
ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఈ హామీల ఊహాజనితత్వం మరింత స్పష్టమవుతున్నది. కేవలం ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించడమే కాదు, ప్రజల్లోనూ కాంగ్రెస్‌పై అసంతృప్తి అంతకంతకూ పెరుగుతున్నది. ఈ ఉప ఎన్నిక ఒక స్థానిక ఎన్నిక మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఇచ్చిన ‘ప్రమాణ పత్రం’ని ఉప సంహరించుకునే అవకాశంగా భావించాలి. 2023లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, ముఖ్యంగా బీసీల రిజర్వేషన్లో మోసం, విద్యార్థులు-రైతులు-మహిళల సమస్యలు రోజురోజుకు ఎలా పెరిగాయో విమర్శనాత్మకంగా ఆలోచన చేయడం అవసరం. 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ‘మహాజ్యోతి’ పేరుతో ప్రకటించిన హామీలు-రైతులకు రుణమాఫీ, నిరుద్యోగ యువతకు భృతి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్.. వెరసి తీరని హామీలుగా మిగిలిపోయాయి. ఉదాహరణకు ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలు మరిచిపోగా, వారి జీవనోపాధిని సైతం ధ్వంసం చేయడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది.
బీసీల కులగణనలో జనాభా తగ్గడం మరొక మోసపూరితం. కాంగ్రెస్ హామీ ప్రకారం… స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు. కానీ, సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 56 శాతంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 42 శాతానికి పరిమితం చేసి జనాభా లెక్కలు తగ్గించి చూపించడం ఘోరం. ఇది విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీల అభివృద్ధికి అడ్డుకట్ట వేయడమే. సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు ‘మా హామీలకు మేము కట్టుబడి ఉన్నాం’ అని చెప్పుకొంటున్నారు. కానీ , న్యాయ వివాదాల్లో కాటగలిపి 42 శాతం అమలు చేయకపోవడం బీసీలను మోసగించడమే.
విద్యార్థుల విషయంలో కాంగ్రెస్ మరింత క్రూరంగా వ్యవహరిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా వారిని విద్యకు దూరం చేయాలని చూస్తున్నది. ఖజానాలో డబ్బులు లేవని బుకాయిస్తున్నది. మూడు లక్షల ఆదాయం ఉన్నవారికి ఫీజు రీ యింబర్స్‌మెంట్ చేస్తామని ఇచ్చిన హామీ కూడా ఒట్టి బూటకమేనా? ఈ విషయంలో గప్‌చుప్‌గా ఉండిపోతున్నారు కాంగ్రెస్ పాలకులు. 13 లక్షల మంది విద్యార్థుల ఫీజు డ్యూస్ పెండింగ్‌లో ఉండటం వల్ల వారి భవిష్యత్తు ప్రమాదంలో పడింది. డబ్బు లేదని డిప్యూటీ సీఎం చెప్పడం హాస్యాస్పదం. ఉద్యోగస్థులకు ఇచ్చిన అనేక హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాల హామీ ఇచ్చినా, నిరుద్యోగ భృతి ఇప్పటికీ అందలేదు. అందుకే జూబ్లీహిల్స్‌లో నిరుద్యోగ యువత నిరసనగా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీలోకి దిగారు.
వ్యవసాయ రంగానికి చేతివృత్తులను అనుసంధానం చేసి, మౌలిక సమస్యలు పరిష్కరించకపోవడం రైతులను మరింత కష్టాల్లోకి నెట్టింది. రుణమాఫీ పూర్తి కాలేదు. రూ.2 లక్షల వరకు వేయాలన్న హామీ అలాగే ఉండిపోయింది. లక్ష మంది రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా బాకీగానే ఉండిపోయింది. వృద్ధులకు పింఛన్లు పెంచకపోవడం మరొక దగా. వృద్ధులకు ఇచ్చిన హామీలు మరిచిపోయారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రకటించినా, బస్సులు తగ్గించి, టీజీఎస్ఆర్టీసీ గ్రీన్ ట్యాక్స్ పేరుతో పురుషుల నుంచి డబుల్ ఛార్జీ వసూలు చేస్తున్నారు. స్త్రీలకు ఉచిత బస్సు వల్లనే తమకు చార్జీలు పెరిగాయని పురుషులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్ని సమస్యలకు చెక్ పెట్టాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడించడమే పరిష్కారం. మీ ఓటు ద్వారా 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కచ్చితంగా అమలవుతుంది. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, దళితులు, గిరిజనులు, మైనారిటీల సమస్యలు కొలిక్కి వస్తాయి. కాంగ్రెస్ ఊహాజనిత హామీలకు జూబ్లీహిల్స్ ‘ఓటు’ ఒక గట్టి చెంపదెబ్బ కావాలి. ప్రజలు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఇది సామాజిక న్యాయసాధన పోరాటంలో ఓ ముందడుగు.