నీలగిరి, నవంబర్ 5: నల్లగొండ పట్టణాన్ని మహానగరంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీలో ఎలాంటి మార్పు లు చేయకుండానే కార్పొరేషన్ (మహానగరం)గా మార్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లా ఇన్చార్జి మంత్రి, జిల్లాకు చెం దిన ఇతర మంత్రుల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. 2018 ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం నల్లగొండను కార్పొరేషన్ చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ జనాభా తగినంతలేకపోవడంతో పది కిలోమీటర్ల దూరాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రజాభిప్రాయాన్ని సేకరించింది.
అయితే అంతకుముందు ఎన్నికల్లో ఏడు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో వీలిన గ్రామాల్లో ఉపాధి పనులు రద్దుతో పాటు, పన్నుల భారం ప్రజలపై పడటంతో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. శివారు ప్రాం తాలు శరవేగంగా అభివృద్ధి చెందుతూ పట్టణీకరణ పెరగడంతో ఇటీవల నిర్వహించిన సర్వే (2022) లో 2.25 లక్షల జనాభా ఉన్నట్లు రికార్డుల్లో నమోదైంది. పెరిగిన పట్టణీకరణతో పాటు ఈ రెండేండ్లలో మరో పాతిక వేల జనాభా పెరగడంతో సుమారు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిధిని తీసుకొని మహానగరంగా ఏర్పాటు చేయనున్నారు. 2011లో విలీన గ్రామాలను కలిపి 48 వార్డులను 50 డివిజన్లుగా విభజించనున్నారు.
నల్లగొండ త్వరలో మహానగరం
మున్సిపల్ కేంద్రమైన నల్లగొండ త్వరలో మహానగరంగా రూపుదిద్దుకోనుంది. అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపింది. 1951లో నల్లగొండను మున్సిపాలిటీగా 12 వార్డులతో గ్రేడ్-3 ము న్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జనాభా పెరగడం, పట్టణం క్రమంగా విస్తరించడంతో 1987లో 24 వార్డులతో గ్రేడ్-2 మున్సిపాలిటీగా, 2005లో 36 వార్డులతో గ్రేడ్-1 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది.
2011లో నల్లగొండ మండలంలోని ఆరు గ్రామ పంచాయతీలైన ఆర్జాలబావి, మర్రిగూడ, చర్లపల్లి, శేషమ్మగూడెం, అక్కలాయిగూడెం, మామిళ్లగూడెం, తిప్పర్తి మండలంలోని కేశరాజుపల్లి గ్రామ పంచాయతీలు, వీటి పరిధిలోని మరో పది అవాస గ్రామాలను వీలీనం చేసి 48 వార్డులుగా విస్తరించారు. 2018 ఫిబ్రవరి 3న గ్రేడ్-1 మున్సిపాలిటీగా ఉన్న నల్లగొండ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. ప్రస్తుతం నల్లగొండ మున్సిపాలిటీలో 2.50లక్షల మేర జనా భా ఉండడంతో నాలుగు నుంచి ఐదువేల జనాభా తో మరో రెండు డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ఏటా రూ.20 కోట్ల ఆదాయం ఉన్న మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం నల్లగొండ మున్సిపాలిటీ అదాయం ఏటా రూ.40 కోట్లకు పైగానే ఉంది. దీంతో మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ ప్రభుత్వం త్వరలో గెజిట్ విడుదల చేయనుంది.
రూ.40 కోట్లకు పెరిగిన రెవెన్యూ..
నల్లగొండ మున్సిపాలిటీగా ఏర్పడనప్పుడు వార్షిక బడ్జెట్ కేవలం రూ.10వేలు మాత్రమే. పెరిగిన జనాభా కారణంగా ప్రస్తుతం మున్సిపాలిటీ రోజు రోజుకూ విస్తరిస్తూ వచ్చింది. అంతేకాకుండా పరిశ్రమలు, కాలనీలు, రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా పెరిగిం ది. 107 చదరపు కిలోమీటర్ల ఉన్న ము న్సిపాలిటీ ప్రస్తుతం 200 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది. రూ. 10వేలు ఉన్న వార్షికాదాయం 74 ఏండ్లలో రూ.40 కోట్లకు పైగా పెరిగింది. కార్పొరేషన్‌గా అప్ గ్రేడ్ చేసేందుకు రూ.20 కోట్ల వార్షికాదాయంతోపాటు 2 లక్షల జనాభా ఉంటే సరిపోతుంది. అయితే నల్లగొండ కు రూ.40 కోట్ల ఆదాయంతో పాటు 2.5 లక్షల జనాభా ఉండటంతో కార్పొరేషన్‌గా మార్చేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి.
మంత్రి ద్వారానే ప్రతిపాదనలు..
మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చే విషయంలో నల్లగొండ మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేదు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేసి మంత్రికి అందజేశారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారమే మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారుతుంది. మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేదు.
-సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ నల్లగొండ
48 వార్డుల నుంచి 50 డివిజన్లకు పెంపు..
1951 సంవత్సరంలో 12 వార్డులతో ఏర్పడిన నల్లగొండ మున్సిపాలిటీ ప్రస్తుతం 48 వార్డులతో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉంది. రాష్ట్రంలో కార్పొరేషన్ లేని ఏకైక జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లానే. దీంతో ప్రభుత్వం నల్లగొండను మహానగరంగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. ముందుగా జనాభా తగినంత లేకపోవడంతో గతంలో నల్లగొండ మండలంలోని కొత్తపల్లి, అన్నేపర్తి, చందనపల్లి, దండెంపల్లి, దుప్పలపల్లి, కంచనపల్లి గ్రామాలు, తిప్పర్తి మండలంలోని దుప్పలపల్లి గ్రామాలను తీసుకుని కార్పొరేషన్‌గా మార్చాలని ప్రతిపాదనలు చేశారు. కానీ ఇటీవల (2022) నిర్వహించిన సర్వేలో నల్లగొండ మున్సిపాలిటీలో 2 లక్షల 25వేల జనాభా ఉన్నట్లు తేలింది.
గడిచిన మూడేళ్లలో పట్టణ జనాభా మరో పాతిక వేలు పెరిగి 2.5 లక్షలకు చేరినట్లు ఓ అంచనా. దీంతో ఇతర గ్రామాలను వీలీనం చేయకుండా ప్రస్తుతం ఉన్న వాటితోనే కార్పొరేషన్‌గా మార్చాలని ప్రతిపాదనలు చేశారు. కాగా ప్రస్తుతం ఉన్న 48 వార్డులను 50 డివిజన్లు గా పునర్విభజన చేయనున్నారు. ముందు 1 నుంచి 24 వార్డుల్లో ఒక డివిజన్ 25 నుంచి 48 వార్డుల్లో మరో డివిజన్‌ను కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు చేశారు. దీంతో ప్రస్తు తం పట్టణంలో ఉన్న కొన్ని వార్డుల్లో ఓటర్లు తక్కువగా ఉండటంతో ఎక్కువగా ఉన్న వార్డులో తగ్గించి ఇతర వార్డుల్లో చేర్చనున్నారు. ఇలా ఒకో డివిజన్లో 3,100 నుంచి 3,500 ఓటర్లు మాత్రమే ఉండేలా చూస్తున్నారు. డివిజన్లలో ఓటర్ల సంఖ్య తగ్గడంతోపాటు వాటి హద్దులు కూడా మారనున్నాయి.