బుద్ధుడు పుట్టిన నేలలో
బీసీలు కూడా పుట్టారు
అంబేద్కర్ రాజ్యాంగంలో
బీసీలు కూడా ఉన్నారు
స్వాతంత్య్ర పోరాటంలో
బీసీల త్యాగాలూ ఉన్నాయి
ఇండియాలో బీసీలు స్వదేశీయులే
నాయకుల పన్నాగాలను గమనిస్తున్నాం
తగునా మీకీ మోసాలు
వానరసైన్యం లా
సేవలు త్యాగాలు నిష్ప్రయోజనాలేనా
బీసీలు కులగణన లెక్కల్లోనే లేరా
గజానికో మోసంతో
గాంధారి పుత్రుల నాటకాలు
బెత్తెడుకో జీవోలు
మొలిచినట్టే మొలిసి
తలెత్తుకోకముందే
వాడిపోతున్నాయి
అవే ఫిర్యాదులు , అవే వాదనలు
రావల్సిన వానలు గమనం తప్పినట్టు
పొలాల ఉసురు తీసినట్టు
శ్రమజీవుల స్వప్నాలపై పిడుగు పాట్లు
జెండాలన్నింటికీ ఎజెండా బీసీలే
రంగులరాట్నంలా మాట్లాడుతూనే
అంతర్గతంగా ఆశయాలపై శూలాలు
గుమికూడిన గుంపులజూసి
దడలు పుడుతున్నై
ఇవ్వాలిటి గుంపు రేపటి గమ్యానికి సాలే
తెరలు తెరలుగా ఎవరెన్ని ఆడినా
సూర్యుడు కూడా బీసీ పాటతోనే
ఉదయిస్తున్నాడు
కాలాన్ని మోసాలు చేయలేరు.
యాభై శాతం పరిమితి పేరున
అపర చాణుక్యులదే పైచేయిగా..
అవకాశాలను అణచివేస్తున్నారు
సీలింగ్ కొరడాల పేరున
ఆత్మగౌరవాలను దెబ్బతీసే కుట్రలు
శతాబ్దాలుగా అగౌరవాలే దక్కాయి
ఆత్మాభిమానాలు బూడిదలయ్యాయి
మోసాలు చేస్తూ వెలుగుల్నీ తుంచేస్తున్నారు
ఎన్నాళ్లీ అవమానాలు పంటికింద బిగపట్టాలి?
వేటాడుతాం
వెంటాడే కలాలై పదునెక్కే పాటలతో
మన వాటా మనకు దక్కేంతవరకు
సాంస్కృతిక కళల నగారాలు మోగించాలి
ఉద్యమాలేవి కొత్తవిగావు
ఓడిపోయిన ప్రతిసారి గెలుపునకు
సిద్ధం కావాలి
స్థానిక పంచాయతీ చీకట్లను
తొలగించేందుకు వెలుగులై
ప్రసరిద్దాం.. పయనిద్దాం..