మనదేశం ‘యువ భారత్’గా వెలిగిపోతున్నది. గణాంకాలను పరిశీలిస్తే.. యువతే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నది. అదే సమయంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్యా.. ఇక్కడ అధికంగానే ఉన్నది. దాదాపు 14 కోట్ల మంది వృద్ధులకు భారత్ నీడనిస్తున్నది. 2050 నాటికి.. ఆ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉన్నది. కానీ, పెద్దవాళ్ల ఆరోగ్యం మాత్రం అధిక నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఈ క్రమంలో వారి ఆరోగ్యానికి మందులతో కాకుండా.. ఆహారంతోనే భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.
వృద్ధాప్యం అంటే అనారోగ్యం కాదు. అదో శారీరక మార్పు మాత్రమే! వయసు పెరిగే కొద్దీ.. కండరాల ద్రవ్యరాశి తగ్గుతుంది. రక్తంలో చక్కెరశాతం పెరుగుతుంది. ఫలితంగా, ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో అనేక శారీరక మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులను అర్థం చేసుకుంటూ, అందుకు అనుగుణంగా ఆహారాన్ని అందిస్తే.. వృద్ధుల ఆరోగ్యానికి భరోసా దక్కుతుంది.
వయసు పెరిగేకొద్దీ శరీరానికి పోషకాల అవసరం పెరుగుతుంది. కానీ, జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. కడుపులోని ఆమ్లం, ఎంజైమ్‌ల స్థాయులూ తగ్గుతాయి. ఫలితంగా, ప్రొటీన్ శోషణపై ప్రతికూల ప్రభావితం పడుతుంది. ఇలాంటి సమయంలో పెద్దవాళ్లకు గంజి, పులియబెట్టిన ఆహారాలు, తేలికైన సుగంధ ద్రవ్యాలు, అప్పుడే వండిన భోజనం అందించాలి. ఇవన్నీ జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. పోషకాల శోషణను మెరుగుపరుస్తాయి. పెద్దల ఆహారంలో కూరగాయలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టాలి. ఇక ఒక్కపూట కూడా భోజనం మానేయడం మంచిదికాదు. పోషకాహారంతోపాటు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటే.. మెరుగైన ఆరోగ్యం సొంతమవుతుంది. ఇక వృద్ధాప్యంలో పలకరించే బ్రెయిన్ ఫాగ్ కూడా ఆమడదూరం పారిపోతుంది. ఎందుకంటే.. న్యూరోట్రాన్స్మిటర్ కార్యకలాపాలు తగ్గడానికీ, శరీరంలో ఆరోగ్యకరమైన కొవ్వులు లేకపోవడానికీ సంబంధం ఉంటుందని పలు సర్వేలు తేల్చాయి కూడా.