రాజధాని నగరం హైదరాబాద్ రోజురోజుకూ అరాచకంలో కూరుకుపోతున్నది. నేరాలు, ఘోరాలు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. గంగా జమునా తెహజీబ్కు పేరుగాంచిన ‘చార్సౌ సాల్ షహర్’లో యథేచ్ఛగా జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు పోలీసుల అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గత వారం, పది రోజుల్లో జరిగిన ఘటనలను పరిశీలిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. చిన్నారులపై లైంగికదాడులు, అపహరణల వార్తలు నిత్యం మీడియాలో కనిపిస్తున్నాయి. నిర్దోషులను కాపాడి, నేరస్థులను శిక్షించడంలో పోలీసుల అలసత్వం, కొన్ని సందర్భాల్లో మిలాఖత్ కావడం చూస్తుంటే ఆందోళన కలిగిస్తున్నది.
మరోవైపు పోలీసు జులుం రెచ్చిపోవడం చూస్తుంటే అసలు ప్రభుత్వమనేది ఉన్నదా? అనే సందేహం కలుగుతున్నది. జూలైలో మహిళలపై ఒక్కరోజే మూడు అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. అందులో ఒకటి నిర్భయ తరహా నేరం కావడం సురక్షిత నగరంగా పేరొందిన నగరం ఎంతగా దిగజారిపోతున్నదో తెలుస్తున్నది. గ్రేటర్లో గత ఏడు నెలల్లో అత్యాచార ఘటనలు వందల సంఖ్యలో జరిగాయి. ఇందులో పోక్సో కేసులు 850 వరకు నమోదయ్యాయి. చిన్నారులు, మైనర్లపై కూడా లైంగికదాడులు పెరిగాయి. ఇదే 7 నెలల వ్యవధిలో 160కు పైగా హత్యలు జరిగాయి. రౌడీషీటర్ల గ్యాంగ్వార్లు, ప్రతీకార హత్యలతో నగరం అట్టుడుకుతున్నది.
సుమారు దశాబ్దకాలం పాటు సుస్థిరమైన శాంతిభద్రతలు నెలకొన్న హైదరాబాద్లో 8 నెలల్లో పరిస్థితి తారుమారైంది. సొంత రాష్ట్రం ఏర్పాటు కాగానే అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటగా దృష్టి కేంద్రీకరించింది పోలీసు వ్యవస్థను మెరుగుపరచడంపైనే. ముఖ్యంగా మహిళల భద్రతకు హాక్ ఐ, షీ టీమ్స్ వంటి వినూత్న వ్యవస్థలను అమల్లోకి తెచ్చింది. నేరాల అదుపునకు కేంద్రీకృత నిఘా వ్యవస్థను ప్రవేశపెట్టింది. శాంతిభద్రతలు సవ్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమనే ఆలోచన దీనంతటికీ కారణం. కానీ, ఇప్పుడు అంతా మొదటికొచ్చింది. ‘ఫ్రెండ్లీ’ పోలీసులు పౌరులను శత్రువులుగా చూస్తున్నారు. లాఠీ ఝళిపించి ప్రతాపం చూపిస్తున్నారు.
షాద్నగర్లో ఓ దొంగతనం కేసులో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, కొడుకు ముందే వివస్త్రను చేసి చిత్రహింసలు పెట్టడం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఈ కేసులో పోలీసుల పాత్రపైనే అనుమానాలు తలెత్తడం గమనార్హం. చోరీ సొత్తులో వాటా కోసమే పోలీసులు అత్యుత్సాహం చూపినట్టు ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ ఉదంతం పోలీసుల బరితెగింపునకు అద్దం పడుతున్నది. ఓవైపు ఇలా నిర్దోషులు వేధింపులకు గురవుతుంటే మరోవైపు ఓ పోలీసు స్టేషన్ నుంచి ఒక దొంగ వారంలో రెండుసార్లు తప్పించుకోవడం పోలీసుల అసమర్థతకు నిదర్శనం.
పోలీసులంటే వృత్తిపరమైన నైపుణ్యంతో దర్యాప్తు జరిపి న్యాయం చేస్తారనే భరోసా తగ్గిపోతున్నది. ఈ తరహా ఘటనలన్నీ కూడా ప్రభుత్వ పర్యవేక్షణలోని లోపాలను వేలెత్తి చూపుతున్నాయి. ప్రజలకు భద్రత విషయంలో భరోసా కల్పించేందుకు ప్రభుత్వం తన ప్రాధాన్యాలను సమీక్షించుకోవాల్సి ఉన్నది. పోలీసు యంత్రాంగాన్ని కట్టుదిట్టం చేసి భద్రతకు మళ్లీ భరోసా కల్పించాలి.