ఇటీవలి కాలంలో ఓటు చోరీ అనే మాట తెగ వినపడుతున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ దీనిపై పేటెంట్ పుచ్చుకున్నట్టు కనపడుతున్నది. ప్రత్యేక ప్రగాఢ సమీక్ష (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ క్లుప్తంగా సర్) పేరిట ఎన్నికల సంఘం బీహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా దిద్దుబాట్లపై ఆయన అభ్యంతరం చెప్తున్నారు. సర్ పేరిట అర్హులైన ఓటర్లను జాబితా నుంచి ఏరిపారేస్తున్నారని, ప్రత్యర్థి పార్టీల విజయావకాశాలను దెబ్బతీసేందుకే ఈసీని అడ్డుపెట్టుకుని కేంద్రంలోని బీజేపీ సర్కారు ఓటు చోరీ చేస్తున్నదనేది ఆయన వాదన. పదేపదే మీడియా ముందుకువచ్చి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇస్తున్నారు. తన దగ్గర ‘ఆటంబాంబు’ లాంటి ఆధారాలున్నాయని కూడా ఆయన అంటున్నారు. అంతవరకు బాగానే ఉన్నది. ఈ ఓటుచోరీ అనేది ఎవరు చేసినా తప్పే.
బీజేపీ చేస్తే తప్పు, కాంగ్రెస్ చేస్తే ఒప్పు అయిపోదు కదా! కేంద్రంలోని బీజేపీ అర్హులైన ఓటర్లను జాబితాలోంచి తొలగిస్తుంటే, ఇక్కడ కాంగ్రెస్ సర్కారు అనర్హులను జాబితాలోకి దూరుస్తున్నది. రెండూ కూడా ఓటమి భయంతో పన్నిన పన్నాగాలే అనేది నూటికి నూరుపాళ్లు నిజం. రాష్ట్రంలో ఉపఎన్నికలు జరుగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో ఓటరు జాబితాలో గోల్మాల్ జరుగుతున్నట్టుగా గత కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. దివంగత మాగంటి గోపీనాథ్ స్థానంలో ఆయన సతీమణిని బీఆర్ఎస్ నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఆమె విజయం ఖాయమనే మాట మొదటినుంచీ వినబడుతున్నది. అయితే ఓటరు తీర్పును హుందాగా ఆమోదించే సత్సంప్రదాయం లేని కాంగ్రెస్ నయానో, భయానో గెలవాలని ఎత్తులు వేస్తున్నది. అందుకు ఓటరు జాబితా తారుమారు చేసే పనికి పూనుకున్నది. ఒక ఇంట్లో అనేక ఓట్లు, నిర్మాణమే కాని అపార్ట్మెంట్లో డజన్ల కొద్దీ ఓట్లు, స్థానికేతరులకు జూబ్లీహిల్స్‌లో ఓట్లు, ఒక్కొక్కరి పేరుమీద మూడేసి ఓట్లు ఇలా చెప్పుకొంటూపోతే కాంగ్రెస్ లీలలెన్నో!
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 28 వేల దొంగ ఓట్లు తమ దృష్టికి వచ్చినట్టు బీఆర్ఎస్ ఆధారాలతో సహా బయటపెట్టింది. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఉంచిన సమాచారం ఆధారంగానే వారు ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. బీహార్‌లో ఒకే ఇంటి నెంబరు మీద ఎక్కువమంది ఓటర్లు నమోదై ఉండటం గురించి హంగామా చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఇక్కడ 80 గజాల ఇంటిలో 24 మంది ఓటర్లు నమోదు కావడం గురించి మాట్లాడకపోవడం విచిత్రం. ఓ అపార్టుమెంట్ చిరునామాతో 44 మంది పేర్లుంటే, అందులో ఇద్దరు మాత్ర మే దొరికారు. మిగతా 42 మంది ఎక్కడున్నారు? అసలు అపార్ట్మెంట్ లేనిచోట కూడా ఆ అడ్రస్‌లో ఓటర్లున్నారు. ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు. నిజానికి జూబ్లీహిల్స్ ఓటర్ల అవకతవకలు ఇన్నీఅన్నీ కావు. తవ్వేకొద్దీ బయటపడుతుండటం విశేషం. మొత్తం 400 బూత్‌లలో ఓట్ల గోల్మాల్ జరిగినట్టు బీఆర్ఎస్ జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఓటుచోరీ యథేచ్ఛగా జరిగిపోతున్నది. ఢిల్లీ బడేభాయ్ అడుగుజాడల్లో గల్లీ చోటేభాయ్ నడుస్తున్నట్టు కనిపిస్తున్నది. కాకపోతే రివర్స్ గేర్‌లో పోతున్నారు. బీజేపీపై ఎగిరిపడుతున్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం తెలంగాణలో జరుగుతున్న ఈ దారుణాన్ని చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నది. ఎదుటివాళ్లకు చెప్పేందుకే నీతులు అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ ధోరణి. బహుళ అంతస్థుల భవనాల్లో ఎక్కువ ఓట్లు ఉండటం సహజమేనని ఎన్నికల యంత్రాంగం సమర్థించుకుంటున్నది.
అయినా విచారణ జరుపుతామని అంటున్నది. మోదీ పంజరంలో చిక్కుకున్న ఈసీ చిలక ఇంకా నోరు తెరవలేదు. ప్రజాస్వామ్యమనేది ఓటు అనే ఇరుసు మీద తిరిగే చక్రం లాంటిది. ఓటు వీగిపోతే మొత్తంగా ప్రజాస్వామ్యమే అర్థరహితం అవుతుంది. అందుకే ఓటింగ్ ప్రక్రియపై, ముఖ్యంగా ఓటరు జాబితాపై చెక్కుచెదరని విశ్వసనీయత, అంతకుమించి పారదర్శకత అవసరం. ఇందులో ఏ మాత్రం తేడా జరిగినా అంతిమ ఫలితం అనుమానాస్పదం అవుతుంది. అర్హుల ఓట్లు తొలగించడం ఎంత నేరమో బోగస్ ఓట్లతో గెలవాలనుకోవడం కూడా అంతే నేరం. ఈ రెండు ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కావు.