సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రా జ్యం నేడు జాతుల విముక్తి పోరాటాల పుణ్యమా అని పిడికెడు ప్రభావ ప్రాంతాలకు పరిమితమైపోయింది. నవ స్వతంత్ర దేశాలతో బ్రిటిష్ కామన్వెల్త్ ఏర్పాటు చేసి ఏదో రకంగా సంబంధ, బాంధవ్యాలు నెరపుతున్నది. ఫలితంగా ఆయా దేశాల నుంచి ప్రజల రాకలూ నిరంతరంగా పెరిగిపోయాయి. వలస పాలన కింద మగ్గిన దేశాల పేదరికం, అవకాశాల లేమి బ్రిటన్ వైపు చూసేలా చేశాయి. అటు బ్రిటన్ వైపు నుంచి చూస్తే అపరాధ భావన, జనాల కొరత ఈ వలసలకు ఆజ్యం పోశాయి. దీనివల్ల ఇప్పుడు యూకే పేరుతో వ్యవహరిస్తున్న నాటి బ్రిటన్‌లో జనాభా తీరుతెన్నులే మారిపోయాయి. భిన్నజాతుల సంగమంతో ఏర్పడిన మిశ్రమం వల్ల సంస్కృతి, సంప్రదాయాల్లోనూ గణనీయమైన మార్పులే వచ్చాయి. అక్కడి ప్రజాజీవితంలో మాజీ వలస దేశాల సంతతివారు ప్రముఖ పాత్ర వహించే స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. దీనికి పరాకాష్ఠగా ఓ పాక్ సంతతి వ్యక్తి లండన్ మేయర్ కావడం, భారత సంతతి వ్యక్తి ఏకంగా దేశానికి ప్రధాని కావడం గురించి చెప్పుకోవచ్చు. కానీ, ఇటీవలి కాలంలో ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి వలస వచ్చేవారి పట్ల బ్రిటన్‌లో ఎదురుగాలి వీస్తున్నది. ‘ఈ సంతను మేమెందుకు భరించాలి?’ అనే ధోరణి అక్కడి మూలవాసుల్లో వ్యక్తమవుతున్నది. ఫలితమే ‘మా దేశాన్ని మాకివ్వండి’ అనే ఉద్యమం. ఒకప్పుడు బ్రిటన్ పాలిత దేశాల్లో వినిపించిన ఈ నినాదం ఇప్పుడు బ్రిటన్‌లో ప్రతిధ్వ నించడం కాల వైచిత్రి.
చిన్నచిన్న పడవల్లో ఇంగ్లిష్ చానల్ దాటివస్తున్న వలసదారుల వార్తలతో బ్రిటన్‌లో వలస వ్యతిరేక చర్చ వేడెక్కుతున్నది. గత శనివారం రాజధాని లండన్ నగరం నడిబొడ్డున సుమారు లక్షన్నర మందితో జరిగిన ప్రదర్శన ఈ ధోరణికి బలమైన నిదర్శనం. బ్రిటన్‌లో ఆశ్రయం కోరి వచ్చేవారు బసచేసిన హోటళ్ల దగ్గర చిన్నచిన్న ప్రదర్శనలతో మొదలైన నిరసనలు మహాప్రదర్శనతో తారస్థాయికి చేరుకున్నాయి. శాంతియుతంగా మొదలైన లండన్ నిరసన చివరికి హింసాత్మకమైంది.
బ్రిటన్ జాత్యహంకార సామాజిక కార్యకర్త టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. లండన్ ప్రదర్శనలో పాల్గొన్న నిరసనకారులు ‘ఇప్పటివరకు జరిగింది చాలు’, ‘మా పిల్లల భవితను కాపాడండి’, ‘వలసదారులను వెనక్కి పం పండి’ వంటి నినాదాలు రాసిన ప్లకార్డులు పట్టుకున్నారు. రాబిన్సన్ సహా వక్తలు యురోపియన్ సమాజంలో మహా జనాభా మార్పిడి గురించి ఆవేశాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. అడ్డూఅదుపూ లేని వలసలతో బ్రిటన్‌లో విధ్వంసం జరుగుతున్నదని గగ్గోలు పెట్టారు. దేశదేశాల్లో వాణిజ్య సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్న పారిశ్రామిక దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వీడియో ప్రసంగం ద్వారా వారితో గొంతు కలుపడం విశేషం. ‘హింస మీ దగ్గరకు వస్తున్నది.. తిరగబడటమో, చావడమో రెండే మీ ముందున్నాయి’ అంటూ రెచ్చగొట్టడమే కాకుండా కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ సర్కారును గద్దెదించాలని ఆయన పిలుపునివ్వడం విస్మయం కలిగిస్తున్నది.
నిజానికి వలస వ్యతిరేక ధోరణి బ్రిటన్‌కు మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదు. మాజీ వలస సామ్రాజ్యాలైన ఇతర యూరప్ దేశాల్లోనూ వలస వచ్చిన వారి పట్ల వ్యతిరేకత క్రమంగా పెరుగుతుండటం చూస్తున్నాం. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీల్లో ఇదే ఎజెండాతో పార్టీలు పుట్టుకువచ్చాయి. ఫ్రాన్స్‌లో ఇదే ఎజెండాతో పోటీచేసిన మేరీ లెపెన్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో, యురోపియన్ యూనియన్ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలు రావడం గమనార్హం. 2018లో ‘యూ-గవ్’ జరిపిన సర్వేలో జర్మనీలో 72%, డెన్మార్క్‌లో 65%, ఫిన్లాండ్లో 64%, స్వీడన్లో 60%, యూకేలో 58%, ఫ్రాన్స్‌లో 58%, నార్వేలో 52% మంది వలసలకు వ్యతిరేకత తెలిపారు. కాగా, అదే సంస్థ ఈ ఏడాది గత పదేండ్లలో వలసలు పెరిగాయా? వాటివల్ల మూలవాసులకు నష్టం జరిగిందా? అనే ప్రశ్నలతో జరిపిన సర్వేలో అత్యధికులు, అంటే జర్మనీలో 81%, స్పెయిన్‌లో 80%, స్వీడన్లో 73%, బ్రిటన్, ఇటలీలో 71%, ఫ్రాన్స్‌లో 69% మంది ‘ఔననే’ సమాధానమిచ్చారు. ఈ దేశాలు అన్నిటిలో ఇప్పుడు వలసల నిలిపివేతే కీలక అంశంగా ఉంటున్నది. ఒకప్పుడు యూరోపియన్ దేశాల పడవలు విదేశీ తీరాలకు చేరుకుని వలస దోపిడీతో వణికిస్తే, ఇప్పుడు అవే దేశాలవారిని మోసుకొస్తున్న పడవలు యూరప్ దేశాల్లో దడ పుట్టించడం గొప్ప చారిత్రక విరోధాభాస.