భారత విదేశాంగ విధానం తీవ్రమైన ఆటుపోట్లకు గురవుతున్నది. ప్రపంచ దేశాలతో మన సంబంధాలు కీలకమైన, అనుకోని మలుపులు తిరుగుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. షాంఘై సహకార సంఘం (ఎస్సీవో) శిఖరాగ్ర సభకు ప్రధాని మోదీ హాజరుకావడాన్ని మనం ఈ దృష్టికోణంలో నుంచే చూడాలి. భారత్, చైనా, రష్యా దేశాల మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్నట్టు విశ్లేషణాత్మక కథనాలు వెలువడుతుండటం గమనార్హం. ఎస్సీవో అనేది పశ్చిమ దేశాల వ్యతిరేక కూటమిగా పేరుపొందింది. కొన్నేండ్ల కిందట ఇలాంటి కూటమి వైపు ఇండియా పూర్తిగా మొగ్గుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రధాని మోదీ తన పదేండ్ల పైచిలుకు పాలనలో అమెరికా వైపు మొగ్గుచూపడమే అందుకు కారణం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఆయన సాన్నిహిత్యం జగమెరిగినదే. ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ అని ఆయన ఎన్నికల సభ కూడా నిర్వహించారు. ట్రంప్ రెండో విడత పదవీ బాధ్యతలను స్వీకరించా స్వయంగా వైట్‌హౌస్‌కి వెళ్లి అధ్యక్షుడిని కలిసి వచ్చారు కూడా. ఇవేవీ అమెరికాతో సానుకూల వాణిజ్య సంబంధాలకు దోహదపడలేదు. పైగా ఇటీవల ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌ల యుద్ధంతో రెండు దేశాల సంబంధాలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి.
వాణిజ్య ప్రయోజనాలు, రక్షణ అవసరాలే దేశాలను కలుపుతాయి, విడదీస్తాయనేది దౌత్యనీతిలో ప్రధాన సూత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇది మరోసారి రూఢీ అయ్యింది. నిజానికి మోదీ హయాంలో మన చిరకాల విదేశాంగ విధానాల్లోని తటస్థత, సిద్ధాంతపరమైన సమర్థన అనేవి కనిపించకుండా పోయాయి. ప్రపంచ పరిణామాలపై, ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గాజాలో ఇజ్రాయెల్ దురాక్రమణ వంటి అంశాలపై మన విధానాలను స్పష్టంగా వ్యక్తం చేయలేని నిస్సహాయతలో భారత్ పడిపోయింది. ఇది పరోక్షంగా ఇజ్రాయెల్, పశ్చిమ దేశాల సమర్థనగానే కనిపించింది. చివరికి ట్రంప్ సుంకాల బాదుడుతో అమెరికాకు అయినవారెవరో, కానివారెవరో తేలిపోయింది. దీంతో చైనా, రష్యాలతో వ్యూహాత్మక సంబంధాల వైపు చూపుతిప్పక తప్పలేదు. ఈ ముప్పేట మైత్రి ఇంకా ఒక కొలిక్కి రానప్పటికీ ఇండియా మొగ్గు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. దీనిపై అమెరికా నాయకత్వం తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతుండటం ఆసక్తి కలిగిస్తున్నది.
ఎస్సీవో శిఖరాగ్ర సభ సందర్భంగా చైనా నేతలతో భారత ప్రధాని ద్వైపాక్షిక చర్చలూ జరపడం విశేషం. 2017లో సరిహద్దు వివాదం తలెత్తిన తర్వాత ఏడేండ్లకు చైనా గడ్డ మీద మోదీ కాలుమోపారు. అయితే, ఈ వివాదాన్ని సత్వరమే పరిష్కరించుకోవాలని ఉభయ నేతలు నిర్ణయించడం శుభపరిణామం. నేరుగా విమాన సర్వీసులు, వీసా నిబంధనల సడలింపు వంటి చొరవలకు పచ్చజెండా ఊపడం ఆహ్వానించదగినది. అదే విధంగా ‘ప్రపంచ వాణిజ్యాన్ని సుస్థిరపరిచే ఆర్థిక సంబంధాలు నెలకొల్పుకోవాల’ని తీర్మానించడం మరో విశేషం. ‘డ్రాగన్ (చైనా), ఏనుగు (ఇండియా) దగ్గరవ్వాలని’ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ సందర్భంగా భావస్ఫోరకంగా పిలుపునివ్వడం రెండుదేశాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి సూచనగా భావించాలి. ఇందుకు అమెరికాకు, విశేషించి ట్రంప్ టారిఫ్‌లకు కృతజ్ఞతలు తెలపాలి.