అమీన్పూర్(జిన్నారం) ఫిబ్రవరి 27: అక్కడ గజం స్థలం రూ.లక్షల్లో ఉంటుంది. రింగ్‌రోడ్డు లోపల ఉండటంతో ఇక్కడి భూములకు డిమాండ్ ఎక్కువ. ఇదే అదునుగా చూసుకొని కొంతమంది అక్రమార్కులు విలువైన ప్రభ త్వ భూములను కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుని చేతులు దులుపుకొంటున్నారు. తాత్కాలికంగా కూల్చివేస్తున్నారనే తప్ప భూముల రక్షణకు శాశ్వత చర్యలు తీసుకోవడం లేదు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. రాత్రికి రాత్రే ప్రభుత్వ భూముల్లో ఇండ్లు నిర్మిస్తున్నారు. నిత్యం ఈ తతంగం నడుస్తున్నా రెవెన్యూ అధికారులు ఇటువైపు చూడడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా కూల్చివేతలు జరిపి చేతులు దులుపుకొంటున్నారు. కబ్జాల విషయమై అధికారులకు ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తున్నారే తప్ప, వారికి వారుగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు, నాయకులు ఆరోపిస్తున్నారు.
అమీన్పూర్ పరిధిలోని 991, 992, 993, 994, 107,1056 తదితర ప్రభుత్వ సర్వేనంబర్లలో సుమారు 300 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు కొంత భూమిని గతంలో అధికారులు కేటాయించారు. సుమారు 100 ఎకరాల భూమికి సంబంధించి కోర్టు పరిధిలో కేసులు ఉన్నాయి. 50 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి కబ్జా అయ్యింది. ప్రస్తుతం సుమారు 50 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. ఉన్న ఈ భూమిని కూడా రక్షించటంలో అక్కడి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ప్రభుత్వ భూముల్లో తరుచూ ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆక్రమణల నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. నెల రోజుల్లో నాలుగు సార్లు అధికారులు కూల్చివేతలు జరిపారంటే ఇక్కడ ఆక్రమణలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఊహించవచ్చు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల రక్షణకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.