తిరుమలగిరి, ఫిబ్రవరి 27 : కాంగ్రెస్ దద్దమ్మ పాలనతో అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని, కేరళ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి డబ్బులు పంపాలని చూస్తున్నదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో దేశంలోనే ఎక్కువ పంట పండించి నల్లగొండ జిల్లా రికార్డు సృష్టించిందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయకుండా దళారులకు కొమ్ముకాస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలం కావడంతో ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. యూరియా, కరెంట్, నీళ్లు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ..అవినీతి అరాచక పాలన సాగిస్తున్నదని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో లంచాలు ఇవ్వలేదని రైస్ మిల్లర్లపైన పడి అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నాని పేర్కొన్నారు.