శుక్రవారం 22 జనవరి 2021
Editorial - Jan 14, 2021 , 01:15:07

సంక్రమణం జీవన సందేశం

సంక్రమణం జీవన సందేశం

ఇతరులతో పంచుకోవడం మన పండుగలలో ఉండే విశిష్టమైన అంశం. ఈ పంచుకోవడం కూడా విజ్ఞతతో చేసిన చరిత్ర మనది. ప్రతీ పండుగ దైవిక అంశాలను గుర్తించి గౌరవించడానికి ఉపయోగపడుతుంది. దీనికి ఉదాహరణగా సంక్రాంతి పండుగ సమయంలో ఉన్న ఒక ఆచారాన్ని చెప్పుకోవచ్చు. సంక్రాంతి పంట కోతల సమయంలో వస్తుంది. చేతికివచ్చిన మొదటి పంటను అందరితో పంచుకోవడం మన సంప్రదాయం. ఈ విధంగా మన కష్టఫలాన్ని అందరితో పంచుకుంటాం. దీపావళి మనలో అంతర్లీనంగా ఉన్న జ్ఞానజ్యోతిని గుర్తించడానికి జరుపుకునే పండుగ. అలాగే సంక్రాంతి పండుగ ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం అనే మన బాధ్యతను గుర్తుచేస్తుంది.

గ్రామీణ ప్రాంతాల్లో మొదటి చెరకు గడను లేదా మొదటి ధాన్యపు బస్తాను దేవుడికి సమర్పించి అందరితో పంచుకుంటారు. ఆ తర్వాతనే రైతులు మిగిలిన పంటను తమ అవసరాలకు వాడుకుంటారు. ఇతరులతో పంచుకోవడం సంక్రాంతి మనకిచ్చే సందేశం. ఇది పంటకు మాత్రమే పరిమితం కాకూడదు. మనకు కలిగిన భాగ్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. సంక్రాంతి సమయంలో ఉండే మరొక ఆచారం నువ్వులు, బెల్లం ఇతరులకు ఇవ్వడం. దీనివెనుక ఒక ఆధ్యాత్మిక సందే శం ఉంది. ఈ చరాచర జగత్తులో మానవ జీవనం ఎంత అల్పమైనదో నువ్వులు చాటి చెబుతాయి. అలాగే మానవ జీవనంలోని మాధుర్యాన్ని బెల్లం సూచిస్తుంది. మధురమైన పలుకులతో కూడిన అణకువైన జీవితం గడపాలని ఈ ఆచారం సూచిస్తుంది.

నువ్వులు బయట నలుపుతో ఉండి లోపల తెల్లగా ఉంటాయి. మనం స్వచ్ఛమైన అంతరంగంతో ఉండాలనే సందేశం ఇందులో ఉంది. నువ్వులను కొద్దిగా ఉద్దితే నలుపును వదిలేసి లోపల ఉండే తెలుపు కనిపిస్తుంది. బాహ్యమైన విషయాలను వదిలేస్తే అంతర్లీనంగా అందరూ స్వచ్ఛమైనవారే.ఎవరైనా తమని తాము గొప్పగా ఊహించుకుంటే అక్కడినుంచే వారి పతనం మొదలవుతుంది. ఎప్పుడైతే దురహంకారంతో నేను గొప్ప అనే భావం బలపడుతుందో అప్పుడే వారి పతనం ప్రారంభమవుతుంది. ‘నేను చాలా బలవంతుడిని’ అనే భావన వచ్చిన క్షణం నుంచే ఆ బలం కోల్పోవడం మొదలవుతుంది. ఈ విషయాన్ని గుర్తించి వ్యవహరించడం ఉన్నతికి చాలా ముఖ్యమైన సూత్రం.

ఏడాదికి పన్నెండు సంక్రాంతులు వస్తాయి. వాటిలో మకర సంక్రాంతి చాలా ముఖ్యమైనది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి శీతకాల పరిసమాప్తిని సూచించడంతో మకర సంక్రాంతి ప్రారంభమవుతుంది. వణికించే శీతకాలం ముగిసి వేసవి ఆగమనాన్ని సంక్రాంతి సూచిస్తుంది. మకర సంక్రాంతికి గల మరో విశేషం ఉత్తరాయణం అనగా సూర్యుడు ఉత్తరం వైపు పరిభ్రమించడం జరుగుతుంది. దైవికమైన పనులకు ముఖ్యమైన ఉత్తరాయణ కాలం మకర సంక్రాంతి నాటినుంచి మొదలవుతుంది. మకర సంక్రాంతి, గురు పూర్ణిమ ఆధ్యాత్మిక జీవనానికి మైలురాళ్ళ వంటివి. మన ఆధ్యాత్మిక అభివృద్ధి బాగుండాలనే సంకల్పంతో ఈ సంక్రాంతి పండుగను జరుపుకుందాం. 

గురుదేవ్‌ 

శ్రీ శ్రీ రవిశంకర్‌


logo