ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Aug 08, 2020 , 22:48:50

గూడెంలో కథల చప్పుడు

గూడెంలో కథల చప్పుడు

ఒక తరం నుంచి మరొక తరానికి వాగ్రూపంగా ప్రవాహ సదృశ్యంగా సాగిపోతూ, మౌఖిక సాహిత్యానికి విస్తృత ప్రాచుర్యం కల్పిస్తారు వృత్తి కళాకారులు. వారిలో ఆశ్రిత కళాకారులది ఓ అరుదైన అధ్యాయం. వంశపారంపర్యంగా వస్తున్న కథా ప్రదర్శనలే వృత్తిగా చేసుకొని అనేక గిరిజన ఆశ్రిత ఉప తెగలు జీవనం సాగిస్తున్నాయి. అలా రాజ్‌గోండులకు తోటీ, పరదాన్‌ ఉప తెగలుగా ఉన్నాయి. ఈ ఉపతెగలు ధాతృ గిరిజన తెగల చరిత్ర, వంశావళి, గోత్రాలు, సృష్టి రహస్యం, పురాణ, ఇతిహాసాలేకాకుండా ఆయా తెగల్లోని ఉన్నత వ్యక్తులు లేదా పాలకుల చరిత్ర నేపథ్యాల ఇతివృత్తంగా కథాగాన ప్రదర్శనలు ఇస్తారు. అందుకు దక్కే ప్రతిఫలంతో వనయానాన్ని సాగిస్తారు. బిరుదు గోండుగా కూడా పిలువబడే తోటీలలో ఏ ఇంటి పేరు ఉంటే, అదే ఇంటి పేరు ఉన్న రాజ్‌గోండు వారికి ఆశ్రితులుగా ఉండటం సహజం.

రాజ్‌గోండులకు ఉపతెగగా ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా తోటీల్లోని మగవారు కథకులుగా కథాగాన ప్రదర్శన చేస్తూ ఉపాధి పొందుతుండగా, మహిళలు పచ్చబొట్లు పొడుస్తూ కుటుంబ పోషణలో భాగస్వామ్యం అవుతున్నారు. మరికొందరు వ్యవసాయం, కూలీ పనులతో పాటు అటవీ ఉత్పత్తులను సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడొక చారిత్రక సత్యాన్ని గుర్తుచేసుకుంటే తోటీ తెగ ఔన్నత్యం తెలుస్తుంది. నిజాం జమానాలో జల్‌, జంగల్‌, జమీన్‌ నినాదంతో  పోరాడిన  కొమురం భీంకు వెన్నుదన్నుగా ఉండి, తన కళా ప్రదర్శనలతో గిరిజన చైతన్యం కల్పించిన వెడమ రాము తోటీ తెగ వాడే!

తోటీ కళాకారులు ప్రదర్శించే కథలు వైవిధ్య భరితమైనవి. గోండి భాషలోనే సాగే ఈ ప్రదర్శనలు ఆద్యంతం ఉల్లాస భరితంగా, రక్తి కట్టిస్తాయి. కథకులు రాగయుక్తంగా గానం చేస్తూ, వీనుల విందైన వాద్య సంగీతంతో, ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తారు. తోటీలు ప్రదర్శించే ‘సదర్‌భేడి’ కథలో గిరిజనులకు చెందిన వివిధ ‘సగా’ల చరిత్రను, తెగలు పాటించాల్సిన నియమ నిబంధనలు, ‘వంశభేడి’ కథలో గోండుల చరిత్ర, వంశావళి, గొప్పతనం, ‘అన్నోలక్ష్మీ’ కథలో ఆహార ధాన్యాల పుట్టుక వంటి అనేక అంశాలు సమ్మిళితంగా వివరణాత్మకంగా ఉంటాయి. ఇక దేవతల కొలువులకు సంబంధించి ‘పెర్సాపేన్‌' కథ... తోటీ, గోండుల సంబంధాన్ని తెలిపే ‘దండారి పాట’ కథతోపాటు మహాభారత ఇతివృత్త కథలను సందర్భోచితంగా ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలకు ప్రతిఫలంగా గోండుల నుంచి ధాన్యం, ధనం, పశువులను, వెండి ఆభరణాలను బహుమతిగా పొందటం తోటీ తెగ ఆనవాయితీ.

కథాగమనంలో  కథనానికి తగిన  వాద్యాలు మరింత రక్తికట్టిస్తాయి. తమ కులదేవత హీరాదేవికి ప్రతిరూపంగా చెప్పుకునే ప్రధాన వాద్యం ‘కికిరీ’కి గుర్రపు వెంట్రుకలతో తయారు చేసిన సీడ్‌, మధురి, డోలీ తంత్రీలతో వీనుల విందుగా వైవిధ్యమైన స్వరాలను అలవోకగా పలికిస్తారు. మరోవైపు  ప్రేపేరే, డహకీ, డోలు, బొంగా, కాలికోం, ట్రప్‌లింగ్‌ వంటి సహ వాద్యాలను కథా గమనానికి అనుగుణంగా వంతకులు వాయిస్తూ ప్రేక్షకుల్ని రంజింపచేస్తారు. ఆదివాసీ ఉద్యమంలో భాగంగా వెడమ రాము తన కాలికోం వాద్యాన్ని వాయిస్తే కొన్ని వందల గూడేలకు వినిపించేదని ఇప్పటికీ చెప్పుకుంటారు.

తోటీ కథకులు ఊరూరు తిరుగుతూ కథలు చెపుతున్న క్రమంలో వారి  స్త్రీలు చుక్కబొట్లు (పచ్చబొట్లు) పొడిచే ఉపాధితో కుటుంబ పోషణలో భాగస్వాములవుతారు. పచ్చబొట్లు వేసుకుంటే మంచి జరుగుతుందని, చనిపోయినప్పుడు ఏది వెంట రాకున్నా ఈ పచ్చబొట్లే వెంట వస్తాయనే నమ్మకం ఇప్పటికీ ఉంది. పచ్చబొట్లతో శరీరానికి రక్షణ, భౌతిక శక్తి కలిగిస్తాయనే విశ్వాసంతో పాటు... తెగల ప్రత్యేక గుర్తింపునకు, అంతస్తుకు చిహ్నంగా కూడా గిరిజనులు భావిస్తారు. తోటీ గిరిజన యువతులకు సూర్యచంద్రుల ఆకారంతో కూడిన పచ్చబొట్లు ఉన్నవారే  వివాహానికి అర్హులుగా భావిస్తారు. పచ్చబొట్లు వేయడానికి ఉపయోగించే సూదులను ఒకరికి వేశాక మరొకరికి ఉపయోగించేటపుడు, అంటువ్యాధులు రాకుండా వాటిని ఉల్లిగడ్డలో అనేక సార్లు గుచ్చి శుభ్రపరచడం, వేసుకున్న వ్యక్తులకు ఇన్‌ఫెక్షన్‌ రాకుండా పసుపు, నూనె రాసి జాగ్రత్త  తీసుకునే ఆదిమ సంప్రదాయం ఆధునిక యుగంలోనూ ఆచరణీయం కావడం విశేషం. 

ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను అనుసరించి ప్రభుత్వం సంప్రదాయ పద్ధతిలో వేసే పచ్చబొట్లను నిషేధించిన నేపథ్యంలో తోటీ మహిళలు ఉపాధిని కోల్పోయారు. పోలీసు తదితర ఉద్యోగాల ఎంపికలో కూడా పచ్చబొట్లు ఆటంకంగా మారినందున  ఈ తరం యువకుల్లో కూడా పచ్చబొట్లపై ఆసక్తి తగ్గుతున్నది.

ఇటువంటి అనేక పరిస్థితుల నేపథ్యంలో తోటీ కళారూపాలను పరిరక్షించుకోవడం, ఆ కళాకారులను ఆదుకొని  వారి జీవన విధానంలో భాగమైన సంస్కృతిని రికార్డు చేయడం చాలా అవసరం.

(నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం)

- భట్టు రమేష్‌ నాయక్‌

రిజిస్ట్రార్‌, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌

9440356336


logo