శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - Apr 24, 2020 , 23:54:00

నగరమా నమస్తే...

నగరమా నమస్తే...

నమస్తే నగరమా..

ఎప్పుడూ చూడని నీ సౌందర్యాన్ని

నేనిప్పుడు చూస్తున్నా..

తొలిసారి

తల్లి మోమును చూసిన శిశువులా..

ఆకురాలు శబ్దం కూడా

ఎంతో హాయిగా వినిపిస్తోంది

ఆకుల మీద కాలుపడినా

అందెలు మోగిన చప్పుడు..

ఎక్కడో దాక్కున్న చిన్నిచిన్ని పిట్టలు

తనిఖీ చేసి వెళుతున్నయి

ఇంకా మనుషులున్నారా అని..

నెమలి రోడ్డుపైకి వచ్చి

పచార్లు చేస్తున్నది!

ఉరుకులు పరుగుల ఉడుత ఒకటి 

ఆగి ఆగి దిక్కులు చూస్తున్నది!

నల్లని రాత్రి

చుక్కల ఓణీని నేలకు పంపింది

కనిపించని దేవతలెవరో

వింజామరలు వీస్తున్నట్టు

ఏ మునో మంత్రించినట్టు

మనిషి..

ప్రకృతి ముందు మోకరిల్లాడు..

-సుంకర రమేశ్‌, 94921 80764 


logo