అవును, కాలం అద్భుతం! రెప్పపాటు కాలంలోనే ఈ సృష్టిలో అంతులేని అద్భుతాలు జరిగిపోతుంటాయి! చుక్కలను బట్టి, లెక్కలెన్నో కట్టి కాలం ఆనుపానులు తెలుసుకునే ప్రయత్నం చేశారు మన రుషులు. గ్రహగతుల ఆధారంగా ప్రకృతి స్థితిగతులను విశ్లేషించారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈఐదు ప్రధాన విషయాలను వివరిస్తూ పంచాంగం అందించారు. బుధవారం ఉగాది పర్వదినం సందర్భంగా కాలమహిమను, పంచాంగం వైచిత్రిని తెలుసుకుందాం..
ఉగాది నాడు మనం కాలాన్ని అర్చిస్తాం. మహావిష్ణువు ఆజ్ఞతో కాలం నడుస్తున్నది కనుక విష్ణుమూర్తిని, మహాకాలుడు కాబట్టి శివుడిని, మహాకాళి అయిన మహేశ్వరిని కాలానికి అధిపతులుగా పూజిస్తాం. సృష్టి స్థితి లయాలలో పాలుపంచుకునే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతోపాటు గణపతి, స్కంధ, ఆదిత్య, లక్ష్మి, కాళి, సరస్వతులలో ఏ ఒక్కరినైనా త్రికరణశుద్ధిగా శాంతిని, దాంతిని, క్షాంతిని ప్రసాదించమని ఉగాది పర్వం నాడు ప్రార్థించాలి. కాలార్చనలో భాగంగా పంచాంగ శ్రవణం చేయడం సంప్రదాయం. జీవిత అనుభవాన్ని సాకారం చేసుకొనేందుకు వేపపువ్వు పచ్చడి తింటాం. అర్చన వైయక్తికం. వేపపువ్వు పచ్చడి తినడం కౌటుంబికం. పంచాంగ శ్రవణం సామాజికం.
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. కానీ, ఏడాదంతా ఒకేచోటు నుంచి స్థిరంగా ఉదయించడు. జాగ్రత్తగా పరిశీలిస్తే సూర్యుడు ఈశాన్య దిశ నుంచి ఆగ్నేయ దిశకు, ఆగ్నేయం నుంచి ఈశాన్యానికి పయనిస్తున్నట్లు తెలుస్తుంది. సూర్యుడు ఆగ్నేయం నుంచి ఈశాన్యానికి పయనించే ఆరు నెలల కాలం ఉత్తరాయణం. ఈశాన్యం నుంచి ఆగ్నేయానికి పయనించే ఆరు నెలల కాలం దక్షిణాయనం. ఉత్తర, దక్షిణాయనాలు కలిస్తే సంవత్సరం.
భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుండటం వల్ల రుతువులు ఏర్పడుతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించి అగస్త్య మహర్షి ‘రుతుకర్తా ప్రభాకరః’ అని కీర్తించాడు. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర అని ఆరు రుతువుల పేర్లు. ఇవన్నీ కలిస్తే ఒక సంవత్సరం. ఒక్కో రుతువులో రెండు నెలలు ఉంటాయి. చైత్ర, వైశాఖ మాసాలు వసంతం. ఈ రుతువులో చెట్లు చిగురిస్తాయి. ఎండలు ప్రచండంగా మండే జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు గ్రీష్మ రుతువు. వర్షాలు విపరీతంగా కురిసే శ్రావణభాద్రపదాలు వర్ష రుతువు. ఎండావానల హడావుడి తగ్గి ప్రకృతి సమతౌల్యతను పాటించే ఆశ్వయుజ, కార్తిక మాసాలు శరదృతువు. వణికించే చలిని ప్రసాదించే మార్గశిర, పుష్య మాసాలు కలిసి హేమంత రుతువు. వసంతంలో చెట్లకు మొలుచుకొచ్చిన చివురాకులు పండుటాకులుగా మారి రాలిపోయే శిశిర రుతువు మాఘ, ఫాల్గుణ మాసాల్లో వస్తుంది.
తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణాలు, వాటి ఫలితాలను తెలిపేది పంచాంగం. చంద్రుడు మనకు ఆకాశంలో పదహారు రూపాలతో కనిపిస్తాడు. వాటిని కళలుగా అభివర్ణిస్తారు. ఏ రోజు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు చంద్రుడు ఏ కళతో మనకు ఆకాశంలో దర్శనమిస్తాడో తెలియజెప్పడాన్ని తిథి అంటారు. చంద్రుడు దినదినాభివృద్ధి చెందే పదిహేను రోజుల కాలాన్ని శుక్లపక్షం అంటారు. పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు క్షీణించే కాలాన్ని కృష్ణ పక్షం అంటారు. శుక్లపక్ష అష్టమి నాడు సూర్యాస్తమయంలో ఉదయించిన చంద్రుడు ఎనిమిది ముహూర్తాలపాటు ఆకాశంలో ఉండి అస్తమిస్తాడు. ముహూర్తం అంటే 48 నిమిషాల కాలం. 48X8=384 నిమిషాలు అంటే ఆరుగంటల ఇరవైనాలుగు నిమిషాల పాటు ఆ రోజు చంద్రుడు ఆకాశంలో ఉంటాడు. కృష్ణపక్ష అష్టమి చంద్రుడు సూర్యాస్తమయం తర్వాత ఎనిమిది ముహూర్తాలకు ఉదయిస్తాడు. సూర్యోదయం వరకు ఉంటాడు. ఖగోళ విజ్ఞానాన్ని నిత్యజీవితానికి అన్వయించి మనకు అందించే గ్రంథం పేరే పంచాంగం.
వారం అంటే మళ్లీ వచ్చేది అని అర్థం. ఆదివారం నుంచి శనివారం వరకు ఏడు గ్రహాలకు ఏడు రోజులు కేటాయించారు మన పూర్వికులు. రాహు, కేతువులు ఛాయాగ్రహాలు కావడంతో వాటికి వారాధిపత్యం ఇవ్వలేదు. రెండున్నర ఘడియల కాలానికి హోర అని పేరు. ఘడియకు ఇరవైనాలుగు నిమిషాలు. అంటే రెండున్నర ఘడియలకు 60 నిమిషాలు. సంస్కృత భాషలోని హోరను ఆంగ్లేయులు అవర్ (hour) అన్నారు. మనం గంట అంటాం. రోజుకు 24 హోరలు. ప్రతిహోరకు అధిపతిగా ఒక గ్రహం ఉంటుంది. సూర్యోదయ హోరాధిపతి ఆ రోజుకు అధిపతి అవుతాడు. ఆదివారం సూర్యోదయ సమయాధిపతి రవి, తరువాతి హోరాధిపతి శుక్రుడు. రవి, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, శని, గురువు, కుజుడు ఈ వరుసలో ప్రతి హోరకు ఒక అధిపతి ఉంటాడు. ఈ క్రమంలో ఆదివారం నాడు 25వ హోరాధిపతి చంద్రుడు మరుసటి రోజు సోమవారానికి అధిపతి అవుతాడు. ఇలా ఏడు రోజులకు వారాధిపతులు ఏర్పడ్డారు.
భూమి తనచుట్టూ తాను తిరుగుతున్నందున సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఏర్పడి, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్న భ్రాంతి కలుగుతున్నది. చంద్రుడు సహజంగానే భూమి చుట్టూ తిరుగుతున్నాడు. సూర్యచంద్రులు పయనించే మార్గానికి నేపథ్యంగా నిలిచిన 27 నక్షత్ర మండలాలను మన రుషులు గుర్తించారు. వాటికి అశ్విని నుంచి రేవతి వరకు పేర్లు పెట్టారు. ఆయా నక్షత్రాల కాంతి సూర్య, చంద్రుల మీదుగా మనకు చేరుతున్నది. ఏ రోజు ఏ నక్షత్రం కాంతి చంద్రుడి మీదుగా మనకు చేరుతున్నదో ఆనాడు చంద్రుడు ఆ నక్షత్రంలో ఉన్నట్లుగా పంచాంగం సూచిస్తుంది. దీనిని నిత్య నక్షత్రం అంటారు.
360 డిగ్రీల గగన చక్రంలో సూర్యుడు పుష్యమి నక్షత్రం నుంచి, చంద్రుడు శ్రవణ నక్షత్రం నుంచి ఎంత దూరం పయనించి నిత్య నక్షత్రాన్ని చేరుకున్నారో లెక్కకట్టి చెప్పేది యోగం. 27 నక్షత్రాలకు 27 యోగాలు ఉన్నాయి. తలపెట్టిన పని ఫలిస్తుందో లేదో యోగం చెబుతుంది. తిథిలో సగభాగం కరణం. రెండు కరణాలకు ఒక తిథి. ఏ పని ఏ సమయంలో చేయవచ్చో, చేయకూడదో కరణం చెబుతుంది. కరణాలు 11. అందులో నాలుగు స్థిర కరణాలు, ఏడు చర కరణాలు.
27 నక్షత్ర మండలాలను మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశులుగా విభజించారు. సూర్య భగవానుడి లాగే పన్నెండు రాశులు ప్రతిరోజూ తూర్పు దిక్చక్రంపైన క్రమంగా ఉదయిస్తుంటాయి. రాశి ఉదయించడానికి పట్టే కాలాన్ని లగ్నం అంటారు. మనం జన్మించినప్పుడు ఉన్న తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, లగ్నాలపై మన జాతక చక్రం, జీవన విధానం ఆధారపడి ఉంటాయని జ్యోతిశ్శాస్త్రం చెబుతుంది.
సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టు కనబడే ఆభాస మార్గాన్ని కాంతివలయం అంటారు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏర్పడే వలయం మరొకటి ఉంటుంది. భూమి నుంచి చూసినప్పుడు ఈ వలయాలు రెండూ, రెండుచోట్ల ఒకదాన్ని మరొకటి ఖండించుకున్నట్లు కనిపిస్తాయి. ఊర్ధ (ఉత్తర) భాగంలో ఏర్పడిన ఖండన బిందువును రాహువుగా, అథో (దక్షిణ) భాగంలో ఏర్పడ్డ ఖండన బిందువును కేతువుగా చెప్పారు. సూర్య చంద్రులు సహా ఏడు గ్రహాలు ఏదో ఒక సమయంలో ఈ బిందువుల గుండా ప్రయాణిస్తాయి. అప్పుడు ఆ గ్రహాలు మనకు కనిపించవు. ఇలా కనిపించకపోవడమే గ్రహణం. ఈ కనిపించకపోవడం ఉత్తర ఖండన బిందువులో ఏర్పడితే అది రాహుగ్రస్త గ్రహణం. దక్షిణ ఖండన బిందువులో ఏర్పడితే కేతుగ్రస్త గ్రహణం.
రవి నుంచి శని వరకు ఉన్న ఏడు గ్రహాలు అంతరిక్షం నుంచి నవనాయకుల రూపంలో మనల్ని నిరంతరం పాలిస్తూ ఉంటారని పంచాంగం చెబుతున్నది. ఉగాది వచ్చిన వారాధిపతి రాజుగా ఉంటాడు. మేష సంక్రమణం జరిగిన రోజుకు అధిపతి మంత్రి. ఇలా తొమ్మిది హోదాలను నిర్ణయిస్తారు. ఈ ఉగాది బుధవారం రావడంతో శోభకృత్ నామ సంవత్సరానికి రాజు బుధుడు అయ్యాడు. రానున్న సంవత్సర కాలంలో జరిగే అంతరిక్ష ఘటనల ప్రభావం భూమి మీద, మానవులపైన ఎలా ఉండనున్నదో తెలుసుకోవడమే పంచాంగ శ్రవణం ప్రయోజనం. ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు ఎంతెంత వర్షపాతం ఉంటుంది. ఏ రంగాలు పురోగమిస్తాయి, దేశాల మధ్య యుద్ధాలు, సమాజంలో శాంతి తదితర సూచనలన్నీ ముందుగానే అంచనా వేసి చెప్పే పంచాంగం కాలం మహిమను వివరిస్తుంది.
కొత్త చింతపండు, కొత్త బెల్లం, మామిడిపిందెలు, వేపపువ్వు ఈ నాలుగు మాత్రమే ఉగాది పచ్చడి దినుసులు. కామ క్రోధాలను ప్రకోపింపజేసే అనారోగ్య హేతువులైన ఉప్పుకారాలు పూర్వం ఉగాది పచ్చడిలో లేవు. షడ్రుచులకు ఉగాదికి సంబంధం లేదు. చింతకాయలు చింతపండుగా మారే కాలంలో ఉగాది వస్తుంది. సంక్రాంతితో మొదలైన బెల్లం వండటమనే ప్రక్రియ ఉగాది నాటికి పూర్తికావస్తుంది. పుల్లని మామిడికాయలు ఉగాది పచ్చడికి పనికిరావు. వగరుగా ఉండే మామిడి పిందెలతో పచ్చడి చేసుకోవాలి. వేపపువ్వు ఉగాది వేళలో మాత్రమే లభించే అపూర్వమైన వస్తువు. చిక్కటి చింతపండు పులుసులో తరిగిన మామిడి ముక్కలను, తురిమిన బెల్లాన్ని, నలిచిన వేపపువ్వును వేసి కలుపుకొన్న పచ్చడిని ఉదయాన్నే స్నానం చేసి, తేనీటి కన్నా ముందుగా సేవించాలి. మన జీవితంలోని సంఘటనలు పుల్లగా, తియ్యగా, వగరుగా, చేదుగా ఉంటాయి. వీటిని సమన్వయం చేసుకొంటూ హాయిగా బతికేయాలన్న సూచనను ఉగాది పచ్చడి ఇస్తుంది.
…? వరిగొండ కాంతారావు 94418 86824