Margashirsha Amavasya | హిందూసంప్రదాయంలో మార్గశిర మాసానికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ మాసం శ్రీకృష్ణుడికి ప్రీతికరమైంది. పూర్వీకుల సంతృప్తికి, దానధర్మాలకు అమావాస్య శుభప్రదమని పండితులు పేర్కొంటారు. ఈ రోజున పవిత్రమైన నదిలో స్నానం చేసి దానధర్మాలు చేయడం, పూజలు చేయడం వల్ల సంపద, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు సైతం తొలగిపోతాయి.
పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం నవంబర్ 20 గురువారం రోజున అమావాస్య వస్తుంది. అమావాస్య తిథి నవంబర్ 19న ఉదయం 9.43 గంటలకు ప్రారంభమవుతుంది. నవంబర్ 20న మధ్యాహ్నం 12.16 గంటలకు ముగుస్తుంది. నదీస్నానం, దానధర్మాలకు శుభ సమయం (సూర్యోదయం) నవంబర్ 20న ఉదయం 6.48 గంటలకు.
అమావాస్య రోజున వేకువ జామునే నిద్ర నుంచి లేవాలి. ఆ తర్వాత ప్రవహించే నది, లేదంటే ఇంట్లోనే ఏవైనా పవిత్ర నదీలాలను కలుపుకొని స్నానం చేయాలి. అనంతరం ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడిని పూజించాలి. సూర్య నమస్కారం చేసిన అనంతరం ఆయనకు ఆర్ఘ్యం సమర్పించాలి. ఈ సమయంలో “ఓం నమో నారాయణాయ” అనే మంత్రాన్ని జపించండి. ఆ తర్వాత పూర్వీకుల ఆత్మలను శాంతిప చేసేందుకు తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధకర్మలు చేయాలి. సాయంత్రం రావిచెట్టు కింద ఆవాల నూనె దీపాన్ని వెలిగించాలి. ఐదు వీలైతే ఏడుసార్లు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం వల్ల పాపాలు తొలగిపోయి.. పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి.
అమావాస్య రోజును విష్ణువును ప్రత్యేకంగా ఆరాధించాలి. పూజ గదిలో ఓ ప్రత్యేకంగా పీఠం వేసి దానిపై పసుపు రంగు వస్త్రం పరచాలి. దానిపై విష్ణుమూర్తి విగ్రహం లేకపోతే.. చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి. విగ్రహం పెడితే పంచామృతాలు, పవిత్ర నదీజలాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత విష్ణువు ఎదుట నెయ్యితో అఖండ దీపాన్ని వెలిగించాలి. తులసి, పువ్వులు, పండ్లు, స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి. చివరలో హారతి ఇచ్చి పూజను ముగించాలి. పూజ సమయంలో “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని లేదంటే విష్ణువు 108 నామాలను జపించాలి. పూజ సమయంలో గజేంద్ర మోక్ష కథను చదవడం మంచిది. విష్ణువు ఆరాధనతో మీ జీవితంలో సానుకూలంగా ఉంటుంది. మీలో నూతనోత్తేజయంతో పాటు శ్రేయస్సును తీసుకువస్తుంది.
మార్గశిర అమావాస్యకు ప్రత్యేకత ఉంది. పూర్వీకులకు శాంతికి, కుటుంబంలో ఆనందం, శ్రేయస్సుకు అత్యంత శుభప్రదంగా పేర్కొంటారు. అమావాస్య రోజున విష్ణువును భక్తితో పూజించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆర్థిక పురోగతి, అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
Read Also :
Mahalakshmi Rajayogam | త్వరలో మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశులవారుల వారి చేతికి డబ్బే డబ్బు..!