మంగళవారం 27 అక్టోబర్ 2020
Devotional - Sep 28, 2020 , 18:56:56

శ్రీ‌వారి ఆల‌యంలో ‘భాగ్‌ సవారి’ ఉత్సవం

శ్రీ‌వారి ఆల‌యంలో ‘భాగ్‌ సవారి’ ఉత్సవం

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో సోమవారం సాయంత్రం ‘భాగ్‌ సవారి’ ఉత్సవం ఏకాంతంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటి రోజు ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నేపథంలో స్వామివారి భక్తుడైన అనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బందిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రేవేశించి మాయమైపోతారు. అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తు స్వామివారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపపడుతాడు. వెంటనే అమ్మవారిని బందీ నుంచి విముక్తురాలుని చేసి, పూలబుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు తీసుకువస్తాడు.

భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరుసటి రోజు అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడని, ఈ క్రమంలో ఉత్సవం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఉత్సవంలో భాగంగా సాయంత్రం 4.00 గంట‌ల‌కు శ్రీ‌దేవి, భూదేవి, స‌మేత మలయప్పస్వామి వారిని ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేంచేపు చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో కార్యక్రమాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. అంత‌కుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు ఉత్సవం సందర్భంగా నాళాయరా దివ్య ప్రబంధం, శాత్తుమొర నిర్వహించారు. కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్రనాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo