మంచిర్యాల, మే 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక కోసం ఉమ్మడి జిల్లా ప్రజలు, శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఆ సమయం వచ్చేసింది. నేడు మంచిర్యాలలో బాస్ రోడ్ షో నిర్వహించనుండగా, విజయవంతం చేసేందుకు గులాబీ సైన్యం అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా ఏప్రిల్ 24న కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించిన విషయం విదితమే.
మిర్యాలగూడ నుంచి మొదలైన కేసీఆర్ సమర శంఖారావం.. ప్రధాన నగరాలను తాకుతూ పెద్దపల్లి పార్లమెంట్‌కు చేరుకున్నది. గోదావరిఖనిలో శుక్రవారం రాత్రి 8 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్‌షో నిర్వహించగా, శనివారం సాయంత్రం మంచిర్యాల జిల్లాకు రానున్నది. స్థానిక ఐబీ చౌరస్తాలో భారీ ఎత్తున కేసీఆర్ రోడ్ షో నిర్వహించనుండగా, విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ సైన్యం సన్నద్ధమైంది. అధినేత బస్సుయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది.
ఈ క్రమంలో ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటూ వచ్చిన మంచిర్యాల జిల్లా వాసులు కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభలో ఏం మాట్లాడుతారా.. అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. పదేళ్ల పాలనలో తమకు అండగా నిలిచిన రైతుబాంధవుడి కోసం అటు అన్నదాతలు, సింగరేణిని లాభాల బాట పట్టించి తమ జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడి కోసం సింగరేణి కార్మికులు, నెలనెలా పింఛన్లు ఇచ్చి ఆదుకున్న పెద్దకొడుకు కోసం పింఛన్‌దారులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ రాక కోసం వేయికండ్లతో ఎదురుచూస్తున్నారు.
పోరుబాట పేరుతో గులాబీ దళపతి కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రకు అడుగడుగునా నీరా‘జనం’ పడుతున్నారు. ఎనిమిది రోజుల పాటు నిరంతరాయంగా సాగిన రోడ్‌షోలు విజయవంతమయ్యాయి. కేసీఆర్ బయటికి వచ్చి పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ సాధించిన విజయాలను జనాలకు వివరిస్తూనే, గడిచిన నాలుగు నెలల్లో కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఆయన బయట ప్రచారం చేస్తే తమకు నష్టమని గ్రహించిన ప్రత్యర్థి పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేసి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై ఆంక్షలు విధించింది.
ప్రచారంపై నిషేదం అనంతరం శుక్రవారం రాత్రి 8 గంటలకు గోదావరిఖనిలో రోడ్‌షో సాగునున్నది. దీంతో కేసీఆర్ ఏం మాట్లాడుతారనే ఉత్సుకత మరింత పెరిగింది. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ దూకుడు మరింత పెరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరవు ఛాయలు రాష్ర్టాన్ని ముంచెత్తడం, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న కాంగ్రెస్‌పై జనం విసుగెత్తిపోయారు.
నాటికీ.. నేటికీ పరిస్థితులను పోల్చి చూసుకుంటూ బీఆర్ఎస్కు జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే ఇటు పెద్దపల్లి, అటు ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు ఎక్కడికి వెళ్లినా జనం ఆదరిస్తున్నారు. మండలాల్లో నిర్వహిం చే సమావేశాలకు భారీగా జనాలు హాజరవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ రోడ్‌షో బీఆర్ఎస్కు మరింత బలం చేకూర్చనున్నది. ఒక్కసారి సార్ వస్తే ఫలితాలు మొత్తం మారిపోతాయంటూ ప్రజలే చర్చించుకుంటున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడే బాగుండేనంటూ కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకుంటున్నారు.
కాంగ్రెస్ నాలుగు నెలల పాలనపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. ఆరుగ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప.. మిగిలినవి అమయలు చేయడంలో విఫలమయ్యింది. నెలకు రూ.2500 వస్తాయని ఆశపడితే.. ఉచిత బస్సు ఒకటి ఇచ్చి.. మోసం చేశారంటూ మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఉచిత కరంట్ ఒక నెల ఇచ్చి ఆపేశారనే ఆరోపణలు వస్తున్నాయి. రైతులకు ఇచ్చిన హామీలు రైతుబంధు, రుణమాఫీ, వరి ధాన్యానికి రూ.500 బోనస్ అమలును పాలకులు మరచిపోయారని అన్నదాతలు మండిపడుతున్నారు.
ధాన్యం కొనుగోళ్లలోనూ ఇబ్బందులు ఎదురవుతుండడంతో అధికార పార్టీ అంటేనే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దీంతో ప్రజల్లో మద్దతు కూడగట్టుకునేందుకు ‘హస్తం’ పార్టీ నానా అవస్థలు పడుతున్నది. మరోవైపు తెలంగాణ అంటేనే ఇష్టపడని మోదీకీ.. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా, నవోదయ కాలేజీలు ఇవ్వకుండా అన్యాయం చేసిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలనే ఆలోచన ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ బస్సు యాత్రతో ప్రత్యర్థి పార్టీలు మరింత ఢీలాపడిపోతున్నాయి. ఫలితాలపై ఈ బస్సుయాత్ర ప్రభావం చూపడం ఖాయమని, భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారనే అభిప్రాయాలు అటు ప్రజలతో పాటు ఇటు పార్టీ కార్యకర్తలు, నాయకులు వ్యక్తం చేస్తున్నారు.