Rashmika Mandanna | ‘ఛలో’ అంటూ టాలీవుడ్లో అడుగుపెట్టిన రష్మిక.. ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ అంటూ ‘గీతగోవిందం’లో తన నటనతో ఫిదా చేసింది. ‘నువ్వు అమ్మీ అమ్మీ అంటుంటే నీ పెళ్లాన్నై పోయినట్టుందిరా సామీ’ అంటూ సీమ యాసలో ఆడిపాడి తెలుగు కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకుంది. తన అందం, అభినయంతో టాలీవుడ్లో అగ్ర స్థానం దక్కించుకుంది.‘పుష్ప- ది రూల్’తో మరోసారి వెండితెరను ఏలేందుకు వస్తున్న కన్నడ మల్లి రష్మిక మందన్న కార్వాన్ ముచ్చట్లు..
కర్ణాటక, కొడగు జిల్లా విరాజ్పేట్ మాది. కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదివా. ఎంఎస్ రామయ్య కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నా. ‘కిరాక్ పారీ’్ట అనే కన్నడ సినిమాతో తొలి పరిచయం. గుర్తింపు వచ్చింది ‘ఛలో’తోనే. తెలుగువారికి థ్యాంక్స్ చెప్పాల్సిందే.
2014లో.. బెంగళూర్ టైమ్స్ మ్యాగజైన్ ప్రచురించిన ‘25 మోస్ట్ డిజైరబుల్ వుమెన్’ జాబితాలో నా పేరు కనిపించింది. చాలా గర్వంగా అనిపించింది. కష్టపడితే ఏ రంగంలో అయినా నంబర్ వన్ కావొచ్చని నమ్ముతాన్నేను. కెరీర్ ఆరంభంలో మాడలింగ్ చేశాను. ‘క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా’ టైటిల్ కూడా వచ్చింది.
ఆచార్య, మాస్టర్ సినిమాల్లో అవకాశం మిస్సయ్యా. అంత పెద్ద స్టార్స్‌తో నటించే ఛాన్స్ రావడం అదృష్టమైతే.. ఆ అవకాశం కోల్పోవడం బాధాకరం. అప్పుడు నేనున్న పరిస్థితి అలాంటిది. డేట్స్ ఖాళీ లేకపోవడంతో మరో దారి లేకపోయింది. గుర్తొచ్చినప్పుడు బాధగా అనిపిస్తుంది. ఏమో.. అంతకంటే గొప్ప అవకాశం రానుందేమో.
ప్రేమ, పెళ్లి అనేవి కొన్నిసార్లు విడదీయలేని బంధంగా ముడిపడతాయి. ఒక్కోసారి ముడి వేయలేనంత బలహీనంగానూ ఉంటాయి. అందుకే ఆ విషయాల్లో ఎవరికైనా దూరమైతే పెద్దగా బాధపడకూడదు. లక్ష్యం మీద దృష్టి పెట్టి.. ముందుకు సాగాలి.
మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, నాగశౌర్య, అల్లు అర్జున్ తెలుగు సినిమాకు దొరికిన డైమండ్స్. మహేశ్ సైలెంట్‌గా కనిపిస్తారు కానీ.. మాటలు తూటాలే. విజయ్ దేవరకొండ.. పెద్ద ట్రాన్స్ఫార్మర్. బన్నీ.. ఏ విషయం లోనూ ‘తగ్గేదే లే’ అంటాడు.
పీరియాడిక్ సినిమాల్లో చేయాలని నా కల. అమాయకంగా కనిపించే పాత్ర కోసం ఎదురుచూస్తున్నా. ఈ రెండు పాత్రలూ వస్తే.. కళ్లు మూసుకొని సైన్ చేస్తా. చిన్నప్పటి నుంచీ ఏ విషయాన్ని అయినా అన్ని కోణాల్లో ఆలోచించడం నాకు అలవాటు. అందుకే.. ఏం మాట్లాడినా ఒకటికి పదిసార్లు బేరీజు వేసుకున్నాకే నోరు విప్పుతాను. ఒకవేళ మాట్లాడేస్తే మాత్రం.. నేరుగా నా మనసులోంచి వచ్చిందని అర్థం. పైకి ఒకటి, లోపల ఒకటి.. నాకు నచ్చదు.
‘డియర్ కామ్రేడ్’ సినిమా చూసి చాలామంది నేను క్రికెట్లో తోపు అనుకుంటారు. అసలు ఆ సినిమా వల్లే నాకు క్రికెట్లో బేసిక్స్ తెలిశాయి. సినిమాలో కొట్టినట్టు సిక్స్‌లు ఎప్పుడూ కొట్టలేదు కానీ.. చాలాసార్లు ఫోర్లు బాదాను.
“Baby | రష్మిక మందన్నా సీక్రెట్‌గా బేబి సినిమా చూసిందా..?”