తన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ డిజిటల్ రైట్స్ విషయంలో అమీర్‌ఖాన్ తీసుకున్న నిర్ణయం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ను సందేహంలో పడేసింది. ‘సితారే జమీన్ పర్’ ఓటీటీ హక్కులను ఏ సంస్థకు ఇవ్వనని, యూట్యూబ్‌లో పే పర్ వ్యూవ్ విధానంలో రిలీజ్ చేస్తానని అమీర్‌ఖాన్ కొద్దిరోజుల క్రితం ప్రకటించాడు. దీనివల్ల నెలవారి సబ్స్క్రిప్షన్ బాధ లేకుండా తక్కువ ధరకే నచ్చిన సినిమాను చూడొచ్చన్నది అమీర్‌ఖాన్ ఆలోచన.
‘సితారే జమీన్ పర్’ సినిమాతో ఈ మోడల్‌ను అమలు చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ దిగొచ్చింది. ‘సితారే జమీన్ పర్’ చిత్రానికి తొలుత 60కోట్ల డిజిటల్ రైట్స్ ఆఫర్ చేయగా..ఇప్పుడు ఆ రేటును రెండితంలు చేసింది. 125కోట్లు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని నెట్‌ఫ్లిక్స్ బిజినెస్ టీమ్ అమీర్‌ఖాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నదట.
అయితే ఈ విషయంలో అమీర్‌ఖాన్ ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. ఒకవేళ అమీర్‌ఖాన్ చెబుతున్నట్లు నిర్మాతలందరూ యూట్యూబ్ పే పర్ వ్యూవ్ మోడల్‌ను ఫాలో అయితే డిజిటల్ బిజినెస్ మొత్తం పడిపోయే ప్రమాదం ఉందని ముంబయి ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నెల 20న ‘సితారే జమీన్ పర్’ ప్రేక్షకుల ముందుకురానుంది.