శుక్రవారం 27 నవంబర్ 2020
Cinema - Oct 21, 2020 , 01:35:38

వరద బాధితులకు సినీ ప్రముఖుల విరాళాలు

వరద బాధితులకు సినీ ప్రముఖుల విరాళాలు

జనకోటిని తన పొత్తిళ్లలో  భద్రంగా దాచుకొని అమ్మలా లాలించే భాగ్యనగరం వరుణుడి ప్రకోపానికి నిలువెల్లా వణికిపోయింది. లక్షలాది ఆశ్రితుల్ని అక్కున చేర్చుకొని వారి కలల్ని పండించిన మహానగరి అసాధారణ వర్షాల వల్ల శతాబ్దిలో చూడని విధ్వంసాన్ని చవిచూసింది. గతవారం రోజులుగా నిర్విరామంగా కురుస్తున్న వర్షాలతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అనేక కాలనీలు నీటమునిగాయి. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టిన సత్వర చర్యలతో పరిస్థితులు క్రమంగా సర్దుకుంటున్నాయి.  ఈ నేపథ్యంలో వర్షాలతో సతమతమవుతున్న భాగ్యనగర ప్రజల్ని ఆదుకోవడానికి సినీతారలు కదిలివచ్చారు. అనుకోని విపత్తు వేళ భారీ విరాళాలు ప్రకటిస్తూ ప్రజలకు మేమున్నామనే భరోసాను అందిస్తున్నారు.

వందేళ్లలో చూడని విధ్వంసం

‘గడచిన వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కుండపోతగా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్‌ అతలాకుతలం అయిపోయింది. అపారప్రాణనష్టంతో పాటు వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి బీభత్సంతో అల్లాడిపోతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు కోటి రూపాయల విరాళం ప్రకటిస్తున్నా. ఎవరికి వీలైనంత సాయం వాళ్లని చేయమని కోరుతున్నా’ 

-(చిరంజీవి)

ప్రభుత్వ సేవలు ప్రశంసనీయం

తెలంగాణలో అసాధారణంగా కురిసిన భారీ వర్షాలు ఊహకందని నష్టాల్ని మిగిల్చాయి. వరద బాధిత కుటుంబాల్ని, నిరాశ్రయుల్ని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రశంసనీయం.  ముఖ్యమంత్రి సహాయనిధికి నా వంతు సహాయంగా కోటి రూపాయల విరాళం అందిస్తున్నా. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకొచ్చి ప్రజల్ని ఆదుకోవాలని పిలుపునిస్తున్నా.                 

-మహేష్‌బాబు

భారీ వర్షాలతో హైదరాబాద్‌ నగరంలోని ఎన్నో ప్రాంతాలు నీట మునిగి లక్షలాదిమంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఏం రిలీఫ్‌ఫండ్‌కు తన వంతుగా అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ కోటి యాభై లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.        

ప్రభుత్వ సహాయం అభినందనీయం

‘భారీ వర్షాలు, వరదలు హైదరాబాద్‌ ప్రజా జీవితంలో విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ విపత్తును ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. వరద బాధితులకు సహాయంగా 550 కోట్ల రూపాయల్ని ప్రకటించింది. ప్రభుత్వ చర్యల్ని నేను అభినందిస్తున్నా. ఈ కష్టకాలంలో  నావంతు చేయూతగా ముఖ్యమంత్రి సహాయనిధికి 50లక్షల రూపాయల్ని విరాళంగా ప్రకటిస్తున్నా’.           - నాగార్జున

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో వరద తాకిడికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా తమ వంతు బాధ్యతగా స్పందిస్తూ ఉంటారు దర్శకుడు త్రివిక్రమ్‌, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ అధినేత ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు). ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయక చర్యల కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి చెరో రూ.10 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌,హారిక హాసిని క్రియేషన్స్‌ అధినేత ఎస్‌.రాధాకృష్ణ తెలిపారు. 

నగరానికి అండగా నిలుద్దాం

మనం కేరళ కోసం, చెన్నయ్‌ కోసం, సైనికుల కోసం అండగా నిలబడేందుకు ముందుకొచ్చాం. కరోనా టైమ్‌లో వేలాది మందికి సహాయాన్ని అందించాం. ఇప్పుడు మన నగరం కోసం అండగా నిలబడేందుకు ముందుకొద్దాం. నా వంతుగా 10 లక్షల విరాళాన్ని ఇస్తున్నా. మీకు తోచినంత సాయం చేయండి.                 - విజయ్‌ దేవరకొండ

పునర్నిర్మాణానికి తోడ్పడుదాం

భారీ వర్షాలు, వరదాలతో హైదరాబాద్‌లోని  ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. వరదబాధితుల సహాయార్థం నా వంతుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి యాభై లక్షల విరాళాన్ని అందజేస్తున్నా. అందరం కలిసి మన హైదరాబాద్‌ పునర్నిర్మాణానికి తోడ్పడుదాం.                          -ఎన్టీఆర్‌

కేటీఆర్‌ పనితీరు అద్భుతం

ఈ క్లిష్ట పరిస్థితుల్లో నా తెలంగాణ ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తున్నా. వరద సహాయక చర్యల్లో  మంత్రి కేటీఆర్‌గారు తొలిరోజు నుంచే చురుగ్గా పాల్గొంటూ అద్భుతంగా పనిచేస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో నా తరపున సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు 25లక్షల్ని విరాళంగా అందిస్తున్నా.             -రామ్‌.

హైదరాబాద్‌ అంటే నాకు ఇష్టం. వరదలతో ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్‌ వాసుల కోసం  ముఖ్యమంత్రి సహాయనిధికి నా వంతుగా ఐదు లక్షల్ని అందిస్తున్నా

- బండ్ల గణేష్‌

ఊహించని వర్షాలు, వరదలతో కళ్ల ముందే ఎంతో మంది ఇబ్బందులు పడుతుండటం చూస్తున్నా.  విపత్కర పరిస్థితుల్లో బాధితులకు ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ ధైర్యసాహసాలతో సహాయం అందిస్తున్నారు. వరద బాధితులకు సహాయంగా ముఖ్యమంత్రి సహాయనిధికి 5 లక్షలు విరాళంగా అందిస్తున్నా. 

-అనిల్‌ రావిపూడి. 

భారీ వర్షాలు అపారనష్టాన్ని మిగిల్చాయి. హైదరాబాద్‌ తీవ్రంగా నష్టపోయింది. ఈ విపత్తు నుంచి నగరం కోలుకోవాలని కోరుకుంటూ నా వంతు సహాయంగా 5లక్షల విరాళాన్ని ప్రకటిస్తున్నా.

-హరీష్‌శంకర్‌.

హైదరాబాద్‌ నన్ను అక్కున చేర్చుకుంది. నా వంతు విరాళంగా 50 వేలు ప్రకటిస్తున్నా. అందరూ తమ వంతుగా తోచినంత విరాళాన్ని అందించండి.   

- త్రినాథ్‌, ‘మేకసూరి’ చిత్ర దర్శకుడు.