మహారాష్ట్రలో ఇప్పుడు కరోనా వైరస్ పరుగులు తీస్తుంది. ఒక్క రాష్ట్రంలోనే ఏకంగా 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దాంతో మరోసారి మహారాష్ట్రలో లాక్డౌన్ విధించారు. అంటే శుక్రవారం సాయంత్రం నుంచి నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు అన్ని బంద్. మరోవైపు సినిమా థియేటర్లు కూడా 50 శాతం ఆక్యుపెన్సీ తగ్గించాలని ఆలోచిస్తుంది మహారాష్ట్ర ప్రభుత్వం. దాంతో సినిమా ఇండస్ట్రీకి మరోసారి వేల కోట్ల నష్టం తప్పేలా లేదు. అన్నింటికంటే ముందు భయం గుప్పిట్లో బతుకుతుంది బాలీవుడ్.
అక్కడ రోజు కనీసం 10 మంది స్టార్స్ కరోనా బారిన పడుతున్నారు. అలియా భట్, అక్షయ్ కుమార్, గోవిందా, భూమి పెడ్నేకర్, రణబీర్ కపూర్, అమీర్ ఖాన్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు రాసుకోవడానికి ఒకరోజు పడుతుంది. బాలీవుడ్లో అంతమంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. దానికి తోడు ఇప్పుడు లాక్డౌన్ కూడా విధించడంతో కొత్త సినిమాల విడుదలకు మరోసారి ఆటంకాలు ఎదురయ్యాయి. ఇప్పటికే ఈ వైరస్ ధాటికి ఇండియన్ సినిమా విలవిలలాడి పోయింది.
భారతీయ సినీ పరిశ్రమలో సింహభాగం బాలీవుడ్ నుంచి వస్తుంది. అక్కడి సినిమాలు వేల కోట్ల బిజినెస్ చేస్తుంటాయి. కానీ కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లుగా బాలీవుడ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. పదుల సంఖ్యలో భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరోలు నటించిన ఈ సినిమాల బిజినెస్ దాదాపు 1000 కోట్లకు పైగానే జరిగింది. కానీ కరోనా వైరస్ కారణంగా ఏడాదిగా బాక్స్‌లోనే ఉండిపోయాయి. భారత్‌లో కరోనా విలయతాండవం చేసే సరికి 8 నెలలు థియేటర్లను మూసి వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడైనా సినిమాలు విడుదల చేసుకుందామంటే వైరస్ రెండోదశ మొదలైపోయింది. ముఖ్యంగా మహారాష్ట్ర లో రోజుకు 50 వేల కేసులు వస్తున్నాయి. దీంతో మళ్లీ వీకెండ్లో మహారాష్ట్రలో లాక్డౌన్ విధించారు.
ఏప్రిల్ 30న రావాల్సిన అక్షయ్ కుమార్ సూర్య వంశీ అనుకున్న సమయానికి విడుదల అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అప్పటికి ఉన్న పరిస్థితులు చూసి తన సినిమా విడుదల తేది గురించి ఆలోచిద్దాం అంటున్నారు నిర్మాతలు. ఇప్పటికే కొన్ని భారీ సినిమాలు కొత్త విడుదల తేదీ కోసం చూసుకుంటున్నాయి. అందులో బంటీ ఔర్ బబ్లీ 2, 1983 లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. మొత్తానికి అటు కరోనా.. ఇటు లాక్డౌన్ ఈ రెండింటి మధ్య బాలీవుడ్ నలిగిపోతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి