US-China Trade | రష్యా చమురు కొనుగోలును కారణంగా చూపి భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీస్థాయిలో ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు.
ప్రస్తుతం 25 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చింది. ఆగస్టు 27 నుంచి మిగతా 25 శాతం టారిఫ్ అమలులోకి రానుంది. అయితే, రష్యా చమురు కొనుగోలు చేస్తున్న చైనా విషయంలో మాత్రం ట్రంప్ భిన్నవైఖరితో ముందుకెళ్తున్నారు. డ్రాగన్‌పై ఎలాంటి టారిఫ్‌లు బాదడం లేదు. తొలుత చైనాపై భారీగా టారిఫ్‌ల బాంబ్ పేల్చిన ట్రంప్.. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ఇప్పుడు చైనాతో వాణిజ్య ఒప్పందానికి మరో 90 రోజుల విరామం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. వాణిజ్య ఒప్పందం (Trade Truce) చర్చల గడువును పొడిగించినట్లు చైనా కూడా తన అధికారిక మీడియాలో పేర్కొంది.
రెండు దేశాలూ ఇటీవలే పోటాపోటీగా సుంకాలు విధించుకున్న విషయం తెలిసిందే. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 145 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు ట్రంప్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించారు. ఇక చైనా సైతం అమెరికాపై 125 శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ఏడాది మేలో అమెరికా, చైనా (US-China) మధ్య కీలక ట్రేడ్ డీల్ కుదిరింది. ఇరుదేశాలు సుంకాలను భారీగా తగ్గించేందుకు ఓ అంగీకారానికి వచ్చాయి.
ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికా దిగుమతులపై చైనా సుంకాలను 125 నుంచి 10 శాతానికి తగ్గించింది. మరోవైపు చైనా దిగుమతులపై అమెరికా సుంకాలను 145 నుంచి 30 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు 90 రోజులు మాత్రమే అమల్లో ఉండేలా ఇరు దేశాలూ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం మంగళవారం అర్ధరాత్రితో ముగియనుంది. దీంతో ట్రంప్ తాజాగా డ్రాగన్‌తో వాణిజ్య ఒప్పందానికి మరో 90 రోజుల విరామం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై ప్రతీకార సుంకాలు విధించాలా? వద్దా? అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఎందుకంటే, రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంతో సంబంధం లేని, అనేక అంశాలు అమెరికా-చైనా సంబంధాలను ప్రభావితం చేస్తాయని ఆయన అన్నారు.
Also Read..
Donald Trump | బంగారం దిగుమతులపై సుంకాలు ఉండవు.. ట్రంప్ కీలక ప్రకటన
Cargo Plane | కార్గో ఫ్లైట్ ఇంజిన్‌లో మంటలు