న్యూఢిల్లీ, మార్చి 10 : గత నెల ఫిబ్రవరిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్.. మదుపరులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయి. దీంతో రూ.25,978 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు నెల జనవరితో పోల్చితే ఇది 8 శాతం అధికం. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులున్నప్పటికీ.. ఇన్వెస్టర్లు పెట్టుబడులకే మొగ్గు చూపారు. దీంతో ఫిబ్రవరిలో మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.82 లక్షల కోట్లకు పెరిగిందని మంగళవారం ఇండస్ట్రీ సంఘం యాంఫీ తెలిపింది.
అమెరికాతో భారత్ ట్రేడ్ డీల్.. మదుపరులను ఉత్సాహపర్చిందని యాంఫీ సీఈవో వెంకట్ ఎన్ చలసాని అన్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల దెబ్బకు ఇన్నాళ్లూ పెట్టుబడులకు దూరంగా ఉంటూ వస్తున్న ఇన్వెస్టర్లు.. తిరిగి పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. అయితే ఈ నెలలో మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా ఒడిదుడుకులు తప్పకపోవచ్చన్న అభిప్రాయాన్ని కనబర్చారు. అయినప్పటికీ దీర్ఘకాలంలో వృద్ధికి వీలుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలావుంటే సిప్‌ల్లోకి పెట్టుబడులు గత నెలలో తగ్గుముఖం పట్టాయి. రూ.29,845 కోట్లకే పరిమితమయ్యాయి. జనవరిలో రూ.31,000 కోట్లుగా ఉన్నాయి. కాగా, ఈక్విటీ స్కీముల్లో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌కు గిరాకీ కనిపించింది. రూ.6,924.65 కోట్ల పెట్టుబడుల్ని అందుకున్నాయి. అలాగే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లోకి కూడా పెట్టుబడులు పోటెత్తాయి.