కొడకండ్ల, మార్చి 10 : నీళ్లు లేక ఎండుతున్న పొలాలను చూసి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రిజర్వాయర్‌లో నీరున్నా కాలువలకు విడుదల చేయకపోవడంతో వేలాది ఎకరాల వరి పొలాలు ఎండిపోతున్నాయి. పొట్ట దశలో ఉండగా నీరందక పోవడంతో పంట నష్టపోయే ప్రమాదం ఉన్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగపురం శివారులో ఎస్సారెస్పీ జలాల ఆధారంగా బయ్యన్నవాగు రిజర్వాయర్ 0.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. దీనిద్వారా జనగామ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో సుమారు 2.10 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. జనగామ జిల్లా కొడకండ్ల, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలాలతోపాటు సూర్యాపేట జిల్లాలోని 13 మండలాలకు ఈ రిజర్వాయర్ నుంచి సాగునీరుందుతుంది.
కాగా వారం రోజులుగా బయ్యన్నవాగు రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో కొడకండ్ల, పెద్దవంగర మండలాలతోపాటు సూర్యాపేట జిల్లాలోని వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే దశలో అర్ధంతరంగా నీటి విడుదలను ఆపేయడంతో దిగుబడులుపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నదని వాపోతున్నారు. మరో రెండు వారాలు నీటి విడుదల కొనసాగిస్తే పొలాలు పండుతాయని, లేకుంటే వేలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన వరి దెబ్బతిని తమ బతుకులు ఆగమవుతాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఇరిగేషన్ డీఈ పూర్ణను ‘నమస్తే’ వివరణ కోరగా వరంగల్ సమీపంలోని ఎస్సారెస్పీ కాలువలో ఇటీవల కారు బోల్తాపడటంతో రెండు రోజుల క్రితం నీటి విడుదలను ఆపేసినట్టు తెలిపారు. ఎస్సారెస్పీ కాలువకు పైనుంచి బుధవారం నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నదని, అవి వస్తే బయ్యారం రిజర్వాయర్ నుంచి కాలువలకు నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గుండె తరుక్కుపోతుంది
కాలువ గట్టున కూర్చుని ఎండిన వరి పంటను చూస్తుంటే గుండె చెరువైతుంది. ఎప్పుడోస్తుందో తెలియని నీటి కోసం ఎదురు చూసుడు అయితుంది. పొట్ట దశలో నీరు అందక పొలాలు ఎండిపోతున్నయి. బయ్యన్నవాగు రిజర్వాయర్ నుంచి ముందు నీళ్లు వదలాలి. లేకుంటే వరి మొత్తం దెబ్బతిని నష్టపోతాం.
– ములకపల్లి కొండయ్య, రైతు, కొడకండ్ల
వీర్నపల్లిలో ట్యాంకర్‌తో పొలానికి నీళ్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు టౌటు రాజు ఎకరం పది గుంటలో వేసిన వరి పంటను కాపాడేందుకు ట్యాంకర్‌తో నీళ్లు పారిస్తున్నాడు. ఉన్న ఒక బోరులో నీరు రాకపోవడంతో ఒకో ట్యాంకర్‌కు రూ.500 ఖర్చు చేస్తూ రోజుకు రెండు ట్యాంకర్ల నీటిని పారిస్తూ పంటను కాపాడుకుంటున్నాడు. రాయిని చెరువు ఎత్తిపోతల పథకం పైపులైన్ పనులను త్వరగా పూర్తి చేసి సాగునీటిని అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.– వీర్నపల్లి
ఎండిన పంట జీవాల పాలు

సాక్షాత్తూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంత గ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సాగునీరు లేక పొలాలు ఎండే పరిస్థితి వచ్చింది. గ్రామానికి చెందిన రైతు ఎక్కిలిపురం నర్సయ్య తనకున్న మూడున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. రూ.లక్ష వెచ్చించి బోర్ వేసినా చుక్క నీరు రాలేదు. సరిపడా నీరందక ఎకరన్నర పొలాన్ని మేత కోసం జీవాలకు వదిలేశాడు. ఎల్లంపల్లి నీటిని వదిలి కాలువల ద్వారా రుద్రంగిలోని అచ్చయ్యకుంట, నాగారం చెరువులను నింపితే భూగర్భ జలాలు పెరిగి బావుల్లోకి నీరు వస్తుందని, తద్వారా మిగిలిన పంటలనైనా కాపాడుకుంటామని నర్సయ్య ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. -రుద్రంగి
మోటర్లకు త్రీఫేస్ కరెంటియ్యాలి

విద్యుత్తు కోతలు ఎత్తివేయడంతోపాటు వ్యవసాయ మోటర్లకు త్రీఫేస్ కరెంట్ సరఫరా చేయాలని అఖిలపక్షం నాయకులు, రైతుల డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో మంగళవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడు, గుండాల సర్పంచ్ కోరం సీతారాములు మాట్లాడుతూ.. మండలంలో ప్రధాన పంటగా మక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు సరైన సమయంలో విద్యుత్తు అందకపోవడంతోపాటు లోవోల్టేజీ సమస్యలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. విద్యుత్తు కోతలతో మోటర్లు, ఇండ్లల్లోని ఫ్యాన్లు, కూలర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. -గుండాల