BLA | పాకిస్థాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ (Pak army chief) సయ్యద్ అసిం మునీర్ (Asim Munir) పర్యటన వేళ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌లో ప్రత్యేక దేశం కోసం పోరాడుతూ అక్కడి సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (Balochistan Liberation Army), దానికి చెందిన మజీద్ బ్రిగేడ్ (Majeed Brigade)ను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా (foreign terrorist organisation) గుర్తించింది. బీఎల్ఏని 2019లోనే.. ‘స్పెషల్లీ డెజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ (ఎస్డీజీటీ)’ జాబితాలో చేర్చిన అమెరికా.. తాజాగా మజీద్ బ్రిగేడ్‌ను కూడా బీఎల్ఏలో భాగంగానే భావిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు.
ఇటీవలే కాలంలో బీఎల్ఏకు చెందిన మజీద్ బ్రిగేడ్ పాక్‌లోని పలు ప్రాంతాల్లో వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. పాక్ సైన్యమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు నిర్వహిస్తోంది. 2024లో కరాచీ ఎయిర్పోర్ట్, గ్వాదర్ పోర్ట్ అథారిటీపై బీఎల్ఏ దాడులు చేపట్టింది. ఇక ఈ ఏడాది అంటే 2025లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ చేసి దాదాపు 300 మంది ప్యాసింజర్లను బందీలుగా చేసుకుంది. పాక్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి వారిని విడిపించింది. ఈ రైలు హైజాక్ ఘటనలో 31 మంది పౌరులు, పాక్ సైనికులు చనిపోయారు. ఇలా వరుస దాడులతో బలూచ్ ఆర్మీని ఉగ్రసంస్థగా గుర్తించాలని పాక్ కోరుతూ వస్తోంది.
అయితే, ప్రస్తుతం అధిక టారిఫ్‌ల నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో పాక్‌తో అగ్రరాజ్యం బంధం బలపడుతోంది. ఇప్పటికే దాయాదితో వ్యాపారం చేసేందుకు అమెరికా ఒప్పందం కూడా చేసుకుంది. ఇదే సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ సైతం రెండు నెలల్లో రెండోసారి యూఎస్ పర్యటనకు వెళ్లారు. ఆయన పర్యటన కొనసాగుతున్న వేళ అమెరికా నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీని అంతర్జాతీయ ఉగ్రసంస్థగా గుర్తించి మునీర్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద గిఫ్ట్ ఇచ్చారంటూ అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.
Also Read..
Asim Munir: ఆసిమ్ మునీర్.. సూట్ ధరించిన ఒసామా బిన్ లాడెన్
ఎల్వోసీ సమీపంలో చైనా రైల్ లింక్!
ఇజ్రాయెల్ దాడిలో ఐదుగురు అల్‌జజీరా జర్నలిస్టుల మృతి