Retail Inflation | న్యూఢిల్లీ, ఆగస్టు 14: ధరలు కొండెక్కికూర్చున్నాయని స్వయాన కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ధరల దెబ్బకు వినియోగదారు విలవిలలాడుతున్న తీరును రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం డాటాలు రెండూ కళ్లకు కట్టిచూపిస్తున్నాయి. ధరల పెరుగుదలను తక్కువ అంచనా వేసే రిజర్వ్‌బ్యాంక్ గానీ, ఆర్థిక విశ్లేషకులు గానీ అవాక్కయ్యే పరిస్థితి ఇది. ఆహారోత్పత్తుల ధరల విలయాన్ని ప్రతిబింబిస్తూ జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు 15 నెలల గరిష్ఠస్థాయి 7.44 శాతానికి ఎగిసినట్టు కేంద్ర గణాంకాల శాఖ నేతృత్వంలోని నేషనల్ స్టాటస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) తెలిపింది. 2022 ఏప్రిల్ నెల (7.79 శాతం) తర్వాత ఇదే అత్యంత గరిష్ఠస్థాయి.
ఈ ఏడాది జూన్‌లో ఇది 4.81 శాతం కాగా, 2022 జూలైలో 6.71 శాతం. ఇటీవల రాయిటర్స్ వార్తా సంస్థ సర్వేలో పాల్గొన్న 53మంది ఆర్థిక వేత్తలు ఆహారోత్పత్తుల ధరల కారణంగా జూలైలో కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) 6.4 శాతం పెరుగుతుందని అంచనావేయగా, దానిని మించి నమోదుకావడం గమనార్హం. ప్రస్తుత జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6.2 శాతం, మొత్తం ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతంగా ఉంటుందని గతవారం ఆర్బీఐ పాలసీ సమీక్షలో అంచనా వేయగా, ఏకంగా 7.44 శాతానికి చేరిపోయి విధాన నిర్ణేతల్లో తాజా ఆందోళన రేపింది. అలాగే ఇది ఆర్బీఐ నిర్దేశిత స్థాయి 6 శాతాన్ని మించడం గమనార్హం. వరుసగా నాలుగు నెలల పాటు నిర్ణీతస్థాయిలోపే కదలాడిన ద్రవ్యోల్బణం జూలైలో ఒక్కసారిగా భగ్గుమంది. రిజర్వ్‌బ్యాంక్ వడ్డీ రేట్ల బాటను నిర్ణయించడానికి ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణంపైనే ఆధారపడుతుందన్న సంగతి తెలిసిందే.
మరో రెండు నెలలు గరిష్ఠ స్థాయిలోనే
వచ్చే రెండు నెలలూ రిటైల్ ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతుందని, 2023 నాల్గవ త్రైమాసికంలో తగ్గుదల మొదలువుతుందని తాము అంచనా వేస్తున్నట్టు బార్‌లేస్ ఎకానమిస్ట్ రాహుల్ బజోరియా చెప్పారు. ఇప్పుడు ఆగస్టు తొలిరోజులే అయినప్పటికీ, ఈ నెలలో కూడా జూలైకంటే తగ్గుతుందన్న సంకేతాలు కన్పించడం లేదన్నారు. కిరాణా సరుకుల నుంచి కూరగాయల వరకూ ధరలు అధికస్థాయిలోనే ఉన్నాయని వివరించారు.
హోల్‌సేల్‌లో 62 శాతం
ఇక కేంద్ర వాణిజ్యశాఖ విడుదల చేసిన హోల్‌సేల్ ధరల పరిస్థితీ ఇంతే దారుణంగా ఉంది. జూలైలో హోల్‌సేల్ స్థాయిలో కూరగాయల ద్రవ్యోల్బణం అత్యంత భారీగా 62.12 శాతం పెరిగింది. 2022 జూలైలో ఈ పెరుగుదల 18.46 శాతం. మొత్తం హోల్‌సేల్ ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 7.75 శాతం పెరిగింది. ఈ ఏడాది జూన్‌లో ఇది 1.24 శాతం తగ్గుదల కనపర్చినప్పటికీ, మరుసటి నెలలోనే భగ్గుమనడం గమనార్హం. ప్రపంచమార్కెట్లో గత నెల క్రూడాయిల్ ధర తగ్గినందున, మొత్తంగా హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) మాత్రం జూలైలో 1.36 శాతం దిగింది. అయితే జూన్‌లో 4.12 శాతం పడిపోయిన డబ్ల్యూపీఐ సూచి, జూలైలో తక్కువ తగ్గుదలను కనపర్చడానికి కారణంగా అధిక కూరగాయల ధరలే.
Milk
నెలనెలా పెరగడమే
ఆర్థికవేత్తలైతే జూలైలో మొత్తంగా టోకు ధరలు 2.50 శాతం తగ్గుతాయని అంచనా వేశారు. ఖనిజ నూనెలు, లోహాలు, రసాయినాలు, రసాయిన ఉత్పత్తులు, జౌళి ఉత్పత్తుల ధరలు తగ్గినందున, టోకు ద్రవ్యోల్బణం రేటు క్షీణించిందని వాణిజ్య శాఖ తెలిపింది. టోకు ఆహారోత్పత్తుల ధరలైతే ఏ నెలకానెల పెరుగుతూ వస్తున్నాయి. ఈ సంవత్సరం మే నెలలో 0.63 శాతం మైనస్‌లో ఉన్న ఇది జూన్‌లో 1.33 శాతానికి, జూలైలో 7.13 శాతానికి చేరుకున్నది. డబ్ల్యూపీఐలో 22 శాతంపైగా వెయిటేజి ఉన్న ప్రాధమిక వస్తువుల ధరలు జూలైలో 7.57 శాతం పెరిగాయి. మరోవైపు ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 12.79 శాతం క్షీణించింది. తయారీ ఉత్పత్తుల ధరలు సైతం 2.51 శాతం తగ్గాయి.
కూరగాయలే కొంపముంచాయ్
ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే జూలైలో కూరగాయల ధరలు ముఖ్యంగా టమాటా కొండెక్కడమే రిటైల్ ద్రవ్యోల్బణం భారీ పెరుగుదలకు దారితీసింది. ముగిసిన నెలలో రిటైల్ ద్రవ్యోల్బణంలో సగం వెయిటేజి ఉన్న కూరగాయల ద్రవ్యోల్బణం భారీగా 37.34 శాతం పెరిగింది. వాస్తవానికి 2022 జూలైలో ఈ ద్రవ్యోల్బణం 0.93 శాతం తగ్గింది. ఆహారోత్పత్తులు, పానీయాల ద్రవ్యోల్బణం 4.63 శాతం నుంచి 10.57 శాతానికి చేరింది. అసమాన రుతుపవనాల కారణంగా దేశవ్యాప్తంగా రెండు నెలల నుంచి కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లోనైతే టమోటో ధర మూడు నెలల్లో ఏకంగా 1400 శాతం ఎగిసింది.