T-works | ఆలోచన.. బుర్రలో మెరిసే చిన్నపాటి మెరుపు. దానికి అక్షరరూపం ఇస్తే ప్రాజెక్ట్ రిపోర్ట్. ఆ అక్షరాలకు వాస్తవరూపం ప్రసాదిస్తే ఒక నమూనా. ఆ నమూనాకు మార్పుచేర్పులు చేసి, ఆధునిక సాంకేతికతను జోడిస్తే తుది ఉత్పత్తి. ఇన్ని దశల్లోనూ అన్నివిధాలా అండగా ఉంటూ ఆవిష్కర్తల దశ తిరిగేలా చేస్తున్నది.. హైదరాబాద్‌లోని టీవర్క్స్ . ఇదొక ఐడియాల మాతృగర్భం. ఆవిష్కర్తల కార్ఖానా. సృజనశీలుర చిరునామా. ‘ఆలోచనతో రండి.. ఆవిష్కరణతో బయటికి వెళ్లండి’
– టీవర్క్స్ నినాదం, విధానం.
నాగరిక మానవుడు ఆవిష్కరణల ‘చక్రం’ తిప్పాడు. అద్భుతాలు సాధించాడు. అగ్రి‘కల్చర్’తో మొదలై మే‘కింగ్’ కల్చర్ దాకా విస్తరించింది నాగరికత. ప్రగతిపథంలో సేవారంగం ఆకాశమెత్తు ఎదిగిపోయింది. తయారీ రంగం పాతాళానికి పడిపోయింది. దేశం దిగుమతులకు దాసోహమైంది. ‘ఫారిన్ బ్రాండ్, ఇంపోర్టెడ్, విదేశీ సాంకేతికతతో తయారైంది’ అని వ్యాపారులు అచ్చేసి అమ్ముకోవడం. అది కొని మనం గొప్పలు పోవడం. ఇదో బానిసగుణమని తెలియనంతగా వెనుకబడి ఉన్నాం! ‘ఇంకెంత కాలం ఈ భావ దారిద్య్రం?’ అని ప్రశ్నించే వాళ్లంతా..
‘పదండి తయారీకి..
వినబడలేదా ‘టీ వర్క్స్’ పిలుపు!’
సాఫ్ట్వేర్ రంగంలో భారతీయులదే ఆధిపత్యం. సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్), సుందర్ పిచాయ్ (ఆల్ఫాబెట్), శంతను నారాయణ్ (అడోబ్), అరవింద్ కృష్ణ (ఐబీఎం).. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు సారథులు మనవాళ్లే. సాఫ్ట్వేర్ ఆవిష్కరణల్లోనూ దూసుకుపోతున్నారు. కానీ, హార్డ్‌వేర్ ఆవిష్కరణలు మాత్రం ఏమంత ఘనంగా రావడం లేదు. కారణం సాఫ్ట్‌వేర్‌కు ఉన్నంత ప్రోత్సాహం హార్డ్‌వేర్‌కు లేదు. ఐటీ కంపెనీలకు ప్రభుత్వం పన్ను మినహాయింపు ప్రకటించింది. తక్కువ ధరలకు భూములు కేటాయించింది. మౌలిక వసతులు కల్పించింది. ఆ ప్రోత్సాహకాల వల్లే ఐటీ పరిశ్రమలు ఎదిగాయి. కానీ హార్డ్‌వేర్ పరిస్థితి హార్డ్‌గానే ఉంది. ఒక ప్రొటోటైప్‌ను సాఫ్ట్వేర్ రూపొందించడానికి నాలుగు ల్యాప్‌టాప్‌లు, వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్, ఫ్రీ టూల్స్ ఉంటే చాలు. నలుగురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఓపెన్ సోర్స్ టూల్స్‌తో కొత్త సాఫ్ట్వేర్ (ప్రొటోటైప్) తయారు చేయగలరు. ఓలా, ఉబెర్, ఫ్లిప్‌కార్ట్ ఇలా ప్రాణంపోసుకున్నవే. తొలిరోజుల్లో కారు గ్యారేజీలే కార్పొరేట్ ఆఫీసులు. కానీ కొత్త యంత్రాలు, పనిముట్లు, వస్తువుల తయారీ ఇంత తక్కువ ఖర్చుతో సాధ్యం కాదు. బడ్జెట్ ఒక్కటే కాదు, రిస్క్ కూడా ఎక్కువే. కాబట్టే, హార్డ్‌వేర్ రంగం చతికిలపడింది. ఇంజినీరింగ్ పట్టభద్రులు సాఫ్ట్వేర్ కొలువు, లేదంటే సాఫ్ట్వేర్ బేస్డ్ స్టార్టప్స్ మీదే ఆశలు పెట్టుకుంటారు. ‘హార్డ్‌వేర్ చాలా హార్డ్’ అనే భావన బలంగానే ఉంది. ఆ భయాన్ని తొలగించి, వస్తు తయారీకి అభయమిచ్చే కార్యశాల టీ వర్క్స్.
T Works1
గుహలు తొలచడంతో మొదలైన మనిషి మనుగడ పోరాటం మట్టిని పిసికి పాత్రగా మలిచేవరకూ వెళ్లింది. ఆ తర్వాత రాగి, ఇనుము, ఇత్తడి, వెండి, బంగారం.. ఇంకెన్నో లోహాలకు తనదైన సృజనతో మెరుగులద్దాడు. చెక్కపై చక్కని రూపాలు చెక్కాడు. అలంకారాలు, పాత్రలు మొదలుబొమ్మలు, పనిముట్లు, ఆభరణాలు, యంత్రాల వరకు.. అనేకం సృష్టించాడు. ఆధునిక మానవుడు దానికి ప్లాస్టిక్‌ను జోడించాడు. హార్డ్‌వేర్‌కు సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించి అద్భుతాలు చేశాడు. టీ వర్క్స్‌లో ఉన్న ఎక్స్, వై, జెడ్ లెవెల్స్ (అంతస్తుల్లో) ఈ పరిణామ క్రమం కళ్లకుకట్టినట్టు కనిపిస్తుంది. ఆటబొమ్మ నుంచి రోబో దాకా, చిట్టి పనిముట్టు నుంచి భారీ యంత్రం దాకా ఏదైనా సరే ఇక్కడ తయారు చేసుకోవచ్చు. పాతవాటిని మెరుగుపరుచుకోవచ్చు.
ఒక నమూనా (ప్రొటోటైప్) రూపొందించాలంటే.. మొదట ఒక ఊహ ఉండాలి. చిత్రమే దాని తొలి రూపం. ఆ చిత్రాన్ని ఆకారంగా మలిచేందుకు సెరామిక్ స్టూడియో ఉంది. ఇందులో సారె తిప్పితే చాలు.. డిజైన్‌కు తగ్గ రూపం వస్తుంది. ఆ నమూనా సాయంతో అచ్చులు తీయొచ్చు. మెటల్ షాప్‌లో లోహంతో నమూనా తయారు చేయొచ్చు. లేత్ మెషిన్ మీద చిన్నచిన్న మార్పులు చేసుకోవచ్చు. వెల్డింగ్ నుంచి మౌల్డింగ్ దాకా అన్నీ ఉపయోగించుకోవచ్చు. ప్లాస్టిక్ అచ్చులు చేసుకోవడానికి త్రీడీ ప్రింటింగ్ ల్యాబ్‌కు వెళ్లొచ్చు. ఎలక్ట్రానిక్స్ ల్యాబ్‌లో దాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. ఫినిషింగ్ షాప్‌లో రంగులు, హంగులు అద్దుకున్నాక ఎఫ్సీబీలో నాణ్యత తనిఖీలు పూర్తి చేసుకుంటే .. ఊహకు ఒక ప్రాథమిక రూపం వచ్చినట్టు. ఈ ప్రొటోటైప్‌కు కాపీరైట్ చేసుకుని మార్కెట్లోకి తీసుకుపోవచ్చు. కస్టమర్స్ నుంచి, నిపుణుల నుంచి అందే సలహాల ఆధారంగా మార్పులు చేర్పులు చేసుకొనే వెసులు బాటూ ఉంది. టీ వర్క్స్ తలుపులు తెరిచే ఉంటాయి. ఇవే కాకుండా లేజర్ కటింగ్, ర్యాపిడ్ ప్రొటోటైపింగ్ లాంటివాటిని వాడుకోవచ్చు. చిన్నచిన్న పనిముట్ల నుంచి కోట్ల రూపాయలు ఖరీదు చేసే మిల్లింగ్ సీఎన్సీ మెషిన్ దాకా అనేకం ఉన్నాయిక్కడ.
‘నాకు ఒక ఐడియా ఉంది. ఈ యంత్రం ఆపరేట్ చేయడమూ వచ్చు. అవకాశం ఇస్తే ఓ నాలుగు గంటలు వాడుకుంటాను’ అంటూ టీ వర్క్స్‌లో యంత్రాన్ని అద్దెకు తీసుకోవచ్చు. ‘మీ సూపర్వైజర్ సెట్టింగ్ చేసి, పనిలో సాయపడితే చాలు’ అని అడిగినా కాదనరు. కొంతమంది ప్రొటోటైప్ తయారు చేసుకుంటారు. కానీ, డిజైన్‌కు దగ్గరగా రాదు. అలాంటి సందర్భాల్లో డిజైన్‌ను లేదా మెషిన్‌ను సరిచేయమన్నా చేస్తారు. డిజైన్ చేతికిచ్చేసి.. ప్రొడక్ట్ రూపొందించి ఇవ్వమన్నా ఇస్తారు. ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. వాడకాన్ని బట్టి చార్జ్ చేస్తారు. అలా అని అందరికీ ఒకే బాదుడు ఉండదు. పెద్ద కంపెనీలకు పెద్ద రేటు, చిన్న కంపెనీలకు చిన్న రేటు. ఇన్నొవేటర్స్కు, స్టూడెంట్స్‌కు నామమాత్రపు రేటు ఉంటుంది. రూరల్ ఇన్నొవేటర్స్ దగ్గరైతే పైసా కూడా తీసుకోరు. అవసరమైతే ఎదురు పైసలిస్తారు! ఈ వేదికను ఏర్పాటు చేసిందే.. సరిలేని సృజనజీవుల కోసం, అచ్చమైన ఆవిష్కర్తల కోసం.
తెలంగాణ డెన్..నాలుగో పారిశ్రామిక విప్లవం మానవ జీవితాన్ని సుఖమయం చేసింది. ప్రతి పనినీ సులభతరం చేసింది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించే ఆవిష్కరణలకు ఇది స్వర్ణయుగం. ఇప్పుడు ఫిజికల్, డిజిటల్, బయోలాజికల్ ఆవిష్కరణలదే పైచేయి. స్మార్ట్ వాచ్‌లు, డిజిటల్ లాకర్, గుండెలో స్టంట్లు, క్షణాల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ చెప్పే గ్లూకోమీటర్, పల్స్ మీటర్.. ఇలా కొత్తకొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. పాతవి కూడా పూర్తిగా అటకెక్కకుండా.. డిజిటల్ టెక్నాలజీతో కొత్త హంగులు అద్దుకుంటున్నాయి. హార్డ్‌వేర్ మార్కెట్లో రాణించాలంటే ఏ కంపెనీ అయినా డిజిటల్‌గా అప్డేట్ కావాల్సిందే. చిన్న తయారీదారులకు ఇన్ని సౌకర్యాలు సమకూర్చుకోవడం కష్టమే. ఉదాహరణకు.. గ్లూకోమీటర్, థర్మామీటర్, పల్స్ రీడర్, ఆక్సీమీటర్లోనే ప్లాస్టిక్, లోహం, గ్లాస్ (డిస్ప్లే) సెన్సర్లు, ఎలక్ట్రానిక్స్, రిజిస్టర్స్, థర్మిస్టర్స్ ఉంటాయి. వీటన్నింటినీ అనుసంధానం చేయడంతోపాటు.. ప్రొటోటైప్‌కు అనుగుణంగా రూపొందించడానికి వివిధ వర్క్‌షాప్‌ల చుట్టూ తిరగడం కష్టం. అవన్నీ ఒకేచోట లభిస్తే.. కానిదేముంది? అందులోనూ టీ వర్క్స్ సువిశాలమైంది. ఏడువేల ఎనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. నూతన వస్తువుల ఆవిష్కరణ కోసం ఎన్నో ప్రయోగాలు, ప్రయత్నాలు జరుగుతున్నాయి. హార్డ్‌వేర్‌కు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, జెనెటిక్ ఇంజినీరింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్.. ఇలా ఏదైనా ఎంచుకోవచ్చు. ఫలానా వృత్తికి సంబంధించివే చేస్తారనే నిబంధనలు ఏమీలేవు.
ఔషధాలను డెలివరీ చేసే డ్రోన్ ఇది. ఒకసారి 100 ఔషధాలు తీసుకుపోతుంది. దీని లోపల 2 నుంచి 8 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది
కొత్త ఆవిష్కరణల విషయంలో టీ వర్క్స్ ఎన్నో అద్భుతాలు చేసింది. కొవిడ్ వేళ.. కరోనా డెల్టా వేరియంట్ దెబ్బకు ఊపిరాడక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అప్పటి అవసరానికి తగినట్టు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ను తయారు చేశారిక్కడ. ఊపిరి తీసుకోలేని స్థితిలో ఉన్న రోగులకు ప్రాణవాయువును కృత్రిమంగా అందించేందుకు ‘మెకానికల్ వెంటిలేటర్’నూ రూపొందించారు. ఈ ప్రొటోటైప్ ఇప్పుడు టెస్టింగ్ దశలో ఉంది. ఒకచోటు నుంచి మరోచోటుకు మందులు అందించేలా మెడికల్ పేలోడ్ (డ్రోన్), ఆటోమేటెడ్ మెషిన్లు, బొమ్మలు, వ్యవసాయ పనిముట్ల ప్రొటోటైప్‌లు టీ వర్క్స్‌లో తయారయ్యాయి. ఇప్పటికే 1100 ప్రోటోటైప్స్ రూపొం దించారు. స్టార్టప్స్ నుంచి 380 ఆర్డర్స్ వచ్చాయి.
హార్డ్‌వేర్ స్వాప్నికులకు చైనా, తైవాన్ పెట్టనికోటలు. ఇనుములో హృదయం మొలిపించక పోవచ్చేమో కానీ, రోబోకు పనులు నేర్పించడం సాధ్యమే. తెలివి ఏ ఒక్కరి సొత్తూ కాకున్నా.. తగిన వసతులు ఉండబట్టే వాళ్లు ఆవిష్కరణలు చేశారు. ఇప్పటికీ తయారీ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తునే ఉన్నారు. ఆలోచన (ఐడియా), ఆచరణ (డిజైన్), సాహసం (రిస్క్).. ఈ మూడింటినీ సమన్వయం చేస్తే తయారీ(హార్డ్‌వేర్)లో అద్భుతాలు చేయొచ్చు. అందుకు తిరుగులేని వేదిక.. టీ వర్క్స్! ఒక్క సమస్యకు వంద పరిష్కారాలు ఉంటాయి. అయినా ఏవో కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉంటాయి. వాటన్నిటికి ఎవరో పరిష్కారాలు కనిపెడతారనే ఆశతో.. ‘దిగుమతి’ కోసం ఎదురు చూడకుండా ‘మనమే కనిపెట్టేస్తే పోలే’ అనుకుంటూ టీ వర్స్ మెట్లెక్కిన ఇన్నొవేటర్స్ విజయాల చరిత్రలు సృష్టించారు. సమాజం ఎదుర్కొంటున్న అనేకానేక సవాళ్లకు పరిష్కారాలు చూపించారు. భారతీయులు ఎందులోనూ
ఇవి ఎండిన పూలతో తయారు చేసిన అగరబత్తీ, అగరబత్తీ స్టాండ్.. ఈ స్టాండ్ తయారీ కోసం హ్యాండ్ మెషిన్‌ను టీ వర్క్స్ డిజైన్ చేసింది. ఇంట్లోనే అగరబత్తీలు తయారు చేసే మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరం
వెనుకబడలేదని నిరూపించారు.
ఒకప్పుడు వ్యవసాయ పనిముట్లను చేతివృత్తుల వాళ్లే తయారు చేసుకునేవారు. వాళ్లు ఉపయోగించే పనిముట్లు కూడా ఊళ్లోనే సిద్ధం అయ్యేవి. ఇప్పుడు ఉత్పత్తి విధానాలు మారాయి. కాబట్టే, కోత యంత్రాలు, కలుపు యంత్రాలు మొదలైనవి ఐరోపావాళ్లు తయారుచేశారు. మనం దిగుమతి చేసుకుని దున్నేస్తున్నాం. వ్యవసాయ పనిముట్లే కాదు ఆట బొమ్మల నుంచి భారీ యంత్రాల దాకా విదేశీ దిగుమతులపై ఆధారపడ్డాం. వాటికే అలవాటు పడిపోయాం. అలా ఆవిష్కరణలకు దూరమైపోయాం.
తయారీ రంగంలో ముందున్న జర్మనీ, ఇంగ్లండ్, అమెరికా, కెనడా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఒళ్లొంచి పనిచేయడానికి ఎవరూ ఇబ్బందిపడరు. అక్కడ తయారీ ఓ కాలక్షేపం, సంతోషం, గౌరవం. ఆసక్తిని బట్టి ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉంటారు. పెద్దపెద్ద ఉద్యోగాలొచ్చినా.. చిన్నచిన్న ఆనందాల కోసం తయారీని వదిలిపెట్టరు. అదే పెద్ద విజయాలకు పునాది అవుతున్నది. అభివృద్ధికి థింకర్స్ (ఆలోచనాపరులు) ఎంత ముఖ్యమో టింకరర్స్ (తయారీ లేదా అమరికతో కాలక్షేపం చేస్తూ జీవితాన్ని సంతోషమయం చేసుకునేవాళ్లు) కూడా అంతే ముఖ్యం. ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థకు టెక్నాలజీ వెన్నెముక. ఆ రంగంలో అమెరికాను అంతెత్తుకు తీసుకుపోయింది టింకరర్సే! మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జుకెర్‌బర్గ్ చిన్నప్పటి నుంచి టింకరర్సే. తయారీ మీద ఆసక్తి మనిషిని ఆవిష్కరణల వైపు ప్రోత్సహిస్తుందని న్యూరాలజిస్టులు చెబుతున్నారు. మేకింగ్ కల్చరే అభివృద్ధి చెందిన దేశాల్ని ‘కింగ్ మేకర్స్’గా నిలబెట్టింది.
‘టీ వర్క్స్’ దేశంలోని అతిపెద్ద ప్రొటోటైపింగ్ సెంటర్. టీ హబ్ సాఫ్ట్వేర్ ఇన్నొవేషన్స్‌ను ప్రోత్సహిస్తున్నట్టే.. ప్రొడక్ట్ (హార్డ్‌వేర్) ఇన్నొవేషన్‌కు టీ వర్క్స్ వెన్నుదన్నుగా నిలవనుంది. విత్తనాలు నాటే పరికరం తయారు చేయాలనే ఒక రూరల్ ఇన్నొవేటర్ ఆలోచన ఇక్కడ కార్యరూపం దాల్చింది. ఓ పాఠశాల విద్యార్థి కొత్త ఆలోచనకు ఈ ఆవరణలోనే బీజం పడింది. ప్రపంచంలోనే మొదటి స్పేస్ టెక్ స్టార్టప్ అంతరిక్షంలోకి పంపిన రాకెట్ల ప్రొటోటైప్ ఇక్కడే సిద్ధమైంది. వ్యవసాయం నుంచి అంతరిక్ష పరిశోధనల దాకా.. అన్ని రకాలుగా రాష్ర్టానికి, దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలకు టీ-వర్క్స్ ఊతమిస్తున్నది. ఎలాంటి వస్తువును, పరికరాన్ని అయినా ఇక్కడ తయారు చేయవచ్చు. తయారీ రంగానికి అవసరమైన సమస్త యంత్రాలనూ సమకూర్చడం కోసం వంద కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశాం. అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తాం. త్వరలోనే ఇక్కడ టీ వర్క్స్ ఫేజ్ 2 (మెటీరియల్ వర్క్‌షాప్) కూడా నిర్మిస్తాం. దీని పక్కనే ఇమేజ్ టవర్ నిర్మిస్తాం. ఓటీటీ, సినిమా, యానిమేషన్, వినోదం, గేమింగ్ రంగాలకు సంబంధించిన ఇన్నొవేషన్స్‌ను ప్రోత్సహించేందుకు ఇమేజ్ టవర్ ఓ వేదిక కానున్నది. ఇప్పటికే సినిమా, వినోద రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉంది. రాయదుర్గంలోని ఈ ఇన్నొవేషన్ సెంటర్ టీ హబ్, టీ వర్క్స్, ఇమేజ్ టవర్స్ ద్వారా నగరం ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నొవేషన్ సెంటర్‌గా గుర్తింపు పొందుతుంది!
– కల్వకుంట్ల తారక రామారావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, తెలంగాణ ప్రభుత్వం
Sujay
‘తయారీ తలకుమించిన భారమని వదిలేయకండి. మనవల్ల కాదనో, డిజైన్ రాదనో, యంత్రాలు లేవనో వెనక్కి తగ్గొద్దు. ఐడియా ఉంటే చాలు. మిగతావన్నీ టీ వర్క్స్‌లో ఉన్నాయి. వాడుకున్న వాళ్లకు వాడుకున్నంత. ‘డిజైన్, రీసెర్చ్, డెవలప్ మెంట్, ప్రొటోటోప్.. దాకా అన్నీ మేం చూసుకుంటాం. కొత్త ఆలోచనతో రండి. మంచి ప్రొడక్ట్‌తో మార్కెట్లోకి వెళ్లండి.
ఇన్నొవేషన్స్కు కిరీటం పెడతాం. ఇన్నొ వేటర్ను సమున్నతంగా నిలబెడతాం. తయారీ వ్యాపకం కావొచ్చు, వృత్తి కావొచ్చు, ఆవిష్కరణ కావొచ్చు..
విఫలమవుతామనే భయం లేకుండా తయారీని వేడుకగా మలుస్తాం.
– సుజయ్ కారంపూడి, సీఈఓ టీ వర్క్స్
Are Shlok (2)
నేను ఆదిలాబాద్ కేంద్రీయ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్నా. వయోధికుల కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కేర్‌టేకర్ రోబోను తయారు చేస్తున్నాను. కానీ, వృద్ధుల్లో చాలామందికి టెక్నాలజీని ఉపయోగించడం రాదు. ఓ వయోధికుడి ప్రవర్తనని పదిహేను రోజులపాటు అధ్యయనం చేసి మరీ.. వాళ్ల స్వభావంలో ప్రమాదకరమైన మార్పులను పసిగట్టేలా నైపుణ్యాన్ని జోడిస్తున్నాను. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా.. వెంటనే సమీప బంధువులకు మెసేజ్ ఇస్తుంది. రోజువారీ పనులను గుర్తుచేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం టీ వర్క్స్‌లో పని చేస్తున్నాను. దీనికోసం కోడింగ్ నేర్చుకున్నాను. రోబో కోడింగ్ పార్ట్ 50 శాతం పూర్తయింది. దీనికి స్మార్ట్ ఫోన్ యాప్ కూడా ఉంటుంది. రోబో 3డీ ప్రింట్ చేయించి, కదలికలు పెట్టించాలి. టీ వర్క్స్ నాకు ఉచితంగా సపోర్ట్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బోరబండలో ఉంటున్నాను. అప్పుడప్పుడూ స్కూల్‌కు వెళ్లి వస్తాను. ఆన్లైన్లో క్లాస్‌లకు హాజరవుతున్నాను.
– ఆరె శ్లోక్, చాంద (టి.) (ఆదిలాబాద్ జిల్లా)
Shrija (1)
మా జిల్లాలో వేరుశనగ పండిస్తారు. శనగపొట్టులో (ఆగ్రోవేస్ట్) భూమిని సారవంతం చేసే పోషకాలు ఉంటాయి. దానిని పొడి చేసి, అందులో నేచురల్ బైండింగ్ ఏజెంట్స్ కలిపితే పల్ప్లా తయారవుతుంది. దానిని ఉపయోగించి బయోపాట్ తయారుచేశాను. చింతలకుంట జిల్లా పరిషత్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదివేటప్పుడు ఈ ఐడియా వచ్చింది. ‘ఇంటింటా ఇన్నొవేటర్’ పోటీలో ఈ కాన్సెప్ట్‌కి బహుమతి కూడా వచ్చింది. హైదరాబాద్ వచ్చి ఆరు నెలలపాటు (పదో తరగతి చదువుతూ) టీ వర్క్స్ టీంతో కలిసి పనిచేశాను. హైడ్రాలిక్ ప్రెజర్‌తో పనిచేసే బయోపాట్ మేకర్ రూపొందించాం. దీనితో చాలా తక్కువ సమయంలో బయోపాట్ తయారు చేయవచ్చు.
– శ్రీజ, చింతలకుంట (ఏటిదొడ్డి మండలం, జోగులాంబ గద్వాల జిల్లా )
Rajendar
పత్తిగింజలు నాటేవాళ్లను చూసి బాధ కలిగింది. వంగి విత్తనం నాటాలి. మళ్లీ లేచి రెండడుగులు ముందుకు నడిచి మళ్లీ వంగాలి. దీంతో నడుము నొప్పి వచ్చేస్తుంది. ఆ సమస్యకు పరిష్కారంగా ఆటోమేటిక్ సీడింగ్ టూల్ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. టీ వర్క్స్‌లో ఏప్రిల్ 2022లో రూరల్ ఇన్నొవేటర్గా చేరాను. నా ఆలోచనకు తగ్గట్టుగా ‘ఆటోమేటిక్ సీడింగ్ టూల్’ ప్రొటోటైప్ తయారు చేశాం. చేతికర్రను తలపించే ఆటోమేటెడ్ సీడింగ్ టూల్‌ను పట్టుకుని నడిస్తే చాలు. విత్తనాలను నేలలో నాటేయవచ్చు. త్వరలోనే పెద్దమొత్తంలో వీటిని మార్కెట్లోకి తెస్తాను.
– రాజేంద్ర, కోనాపురం (చెన్నారావుపేట మండలం వరంగల్ జిల్లా)
నాగవర్దన్ రాయల
Layoffs | కొనసాగుతున్న లేఆఫ్స్.. మీ ఉద్యోగం పోయేలోపే ఈ జాగ్రత్తలు తీసుకోండి