లండన్, నవంబర్ 24 : కింగ్ ఆఫ్ స్టీల్, బ్రిటన్ కుబేరుల్లో ఒకరైన లక్ష్మీ నివాస్ మిట్టల్.. ఆ దేశానికి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. పన్నులకు సంబంధించి లేబర్ పార్టీ నాయకత్వంలోని అక్కడి ప్రభుత్వం పెద్ద మార్పులనే తీసుకురావాలని ప్రయత్నిస్తున్నది. అయితే ఈ సవరణలు బ్రిటన్‌లోని సంపన్నులకు శరాఘాతంలా మారబోతున్నాయి. ఈ కారణంగానే ఇప్పటికే పలువురు సంపన్నులు బ్రిటన్ను వీడారు. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన మిట్టల్ సైతం వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్టు సమాచారం. బ్రిటిష్ సంపన్నుల జాబితాలో మిట్టల్ పేరు ఎప్పట్నుంచో వినిపిస్తున్నది. దాదాపు 3 దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్న మిట్టల్.. 1995లో లండన్‌కు వచ్చారు. ఇప్పుడు ఆర్సెలార్ మిట్టల్ కంపెనీకి అధినేత అన్న విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉక్కు తయారీదారుల కుటుంబంలో పుట్టి పెరిగిన మిట్టల్.. ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి, తన తరంలో గొప్ప గుర్తింపును తెచ్చుకున్నారు.
మిట్టల్ సంపద ప్రస్తుతం దాదాపు 15.4 బిలియన్ యూరోలుగా ఉన్నది. బ్రిటన్‌లోని సంపన్నులలో 8వ స్థానంలో ఈయన ఉన్నారు. భారతీయ కుబేరుల్లో 12వ స్థానం, ప్రపంచ స్థాయిలో 104వ ర్యాంకున్నది. కాగా, దేశంలో ఇప్పుడు అమలవుతున్న పన్ను విధానాలను కఠినతరం చేయాలని బ్రిటన్‌లో అధికారంలో ఉన్న లేబర్ పార్టీ నిర్ణయించింది. ఈ పన్ను సవరణలు ఆచరణలోకి వస్తే అక్కడి అపర కుబేరులపై పెను ప్రభావమే పడనున్నది. దీంతో దేశం విడిచి వెళ్లాలని మిట్టల్ కూడా ఆలోచిస్తున్నట్టు ‘ది సండే టైమ్స్’ చెప్తున్నది. నిజానికి ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం అక్కడి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (మూలధన లాభాల పన్ను)ను పెంచింది. దీంతో ఇన్నాళ్లూ స్థానిక ఆంత్రప్రెన్యూర్స్కున్న ఊరట దూరమైనైట్టెంది. అలాగే కుటుంబ వ్యాపారాల బదిలీపై కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. ఈ క్రమంలో మరిన్ని పన్ను సంబంధిత కఠిన నిర్ణయాలు రాబోతున్నాయన్న సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ పరిస్థితులు అక్కడి మిలియనీర్లు, బిలియనీర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
మిట్టల్‌కు ఇక్కడి వారసత్వ పన్ను పెద్ద దెబ్బగా మారిందన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. బ్రిటన్‌లో నివాసముంటున్న చాలామంది విదేశీ సంపన్నులు సైతం ఈ పన్నుపై ఆందోళనల్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అందుకే ఇటీవలికాలంలో బ్రిటన్ను వీడుతున్న ఇన్వెస్టర్లు, సంపన్నుల సంఖ్య క్రమేణా పెరిగిపోతున్నది. అసలు బ్రిటన్ వారసత్వ పన్ను కిందకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఆస్తులు ఎలా? ఎందుకు? వస్తాయన్నది అక్కడి శ్రీమంతులకు ఎంతకీ అర్థం కావడం లేదు మరి. దీంతో దేశ పౌరసత్వాన్నే వదులుకుని వెళ్తే పనైపోతుంది కదా? అన్న భావనకు వచ్చేస్తున్నారు. భారీ మూలధన లాభాల పన్నును తప్పించుకోవడానికి రివోల్ట్ సహ వ్యవస్థాపకుడు నిక్ స్టోరోన్స్కీ యూఏఈలోకి ఇప్పటికే తన మాకాంను మార్చేశారు. ఇక టెక్ ఆంత్రప్రెన్యూర్ హర్మన్ నరులా బ్రిటన్ ప్రభుత్వ పన్ను విధానాలను బాహాటంగానే విమర్శించారు. కాగా, బ్రిటన్ వాసులు, ఎప్పట్నుంచో ఇక్కడే నివాసం ఉంటున్నవారు.. విదేశాల్లో ఆస్తుల్ని కలిగి ఉంటే వాటికీ వారసత్వ పన్నును విధిస్తున్నది ఇక్కడి ప్రభుత్వం. ఇదే సంపన్నుల ఆగ్రహానికి దారి తీస్తున్నది.
దుబాయ్‌లో ఇప్పటికే మిట్టల్‌కు ఓ నివాస సముదాయం ఉన్నది. అలాగే యూఏఈలోని నా ఐస్లాండ్లో భూమిని కూడా కొన్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే బ్రిటన్ నుంచి దుబాయ్‌కి తన స్థిర నివాసాన్ని మార్చాలని మిట్టల్ అనుకుంటున్నారని చెప్తున్నారు. నిజానికి దుబాయ్, స్విట్జర్లాండ్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులకు ఆవాసాలుగా మారిపోతున్నాయి. ఇక్కడ ఎలాంటి వారసత్వ పన్నులు లేవు మరి. ఇక 2021లో ఆర్సెలార్ మిట్టల్ సీఈవోగా లక్ష్మీ మిట్టల్ తనయుడు ఆదిత్యా మిట్టల్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం సంస్థకు మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. కాగా, బ్రిటన్‌లోని అత్యంత ఖరీదైన నివాసాల్లో మిట్టల్‌కు చెందిన తాజ్ మిట్టల్ కూడా ఒకటి. ‘బిలియనీర్ల రో’గా పిలిచే కింగ్స్టన్ ప్యాలెస్ గార్డెన్స్‌లో 55వేల చదరపు అడుగుల్లో ఇది విస్తరించి ఉన్నది. 2004లో దీన్ని సుమారు రూ.593 కోట్లు పెట్టి మిట్టల్ కొన్నారు.