కాంగ్రెస్ మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడుతం. స్థానిక ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం కోటా, కాంట్రాక్టులు, వైన్ షాపుల్లో వాటా, బడ్జెట్లో 20 వేల కోట్ల నిధులు, బీసీ సబ్‌ప్లాన్ కోసం కొట్లాడుతం. రేవంత్ పాలనలో దగాపడిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలనూ కలుపుకొనిపోతం.
– కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తేతెలంగాణ): గద్దెనెక్కిన ఆరు నెలల్లోనే బీసీలకు విద్య, ఉద్యోగాలు, కాంట్రాక్టులు, ఎన్నికల్లో 42 శాతం కోటా ఇస్తామని ఊదర గొట్టిన కాంగ్రెస్ (Congress), ఇప్పుడు అడుగడుగునా ధోకా చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ధ్వజమెత్తారు. ఆ పార్టీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ (Kamareddy Declaration) పచ్చి బూటకమని, అభయ హస్తం మ్యానిఫెస్టో ఓ నాటకమని విరుచుకుపడ్డారు. హామీలను విస్మరించిన కాంగ్రెస్, బలహీనవర్గాల పేరు చెప్పుకుంటూ మోసం చేస్తున్న బీజేపీలను అటూ ఢిల్లీలో, ఇటూ ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. తెలంగాణలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని దేశమంతా ప్రచారం చేసుకుంటున్న రాహుల్‌గాంధీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తామని తేల్చిచెప్పారు. బీసీలంటే కాంగ్రెస్‌కు మొదటి నుంచీ చిన్నచూపేనని విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ ముఖ్యనేతల సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీపరంగా 42 శాతం కోటా ఇస్తామని ప్రభుత్వం జీవో 46ను జారీ చేసిన నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. లోకల్‌బాడీ ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం కోటా, కాంట్రాక్టులు, వైన్ షాపుల్లో వాటా, బడ్జెట్లో రూ. 20 వేల కోట్ల నిధులు, బీసీ సబ్‌ప్లాన్ కోసం కొట్లాడుదామని పిలుపునిచ్చారు. అవసరమైతే రేవంత్‌రెడ్డి పాలనలో దగాపడ్డ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను కలుపుకొని వెళ్లాలని సూచించారు.
రాహుల్, రేవంత్‌కు చిత్తశుద్ధిలేదు
బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఆ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కపటనాటకమాడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కోర్టు తీర్పును సాకుగా చూపి రేవంత్‌రెడ్డి తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని రాహుల్‌గాంధీ దగాకోరు మాటలు చెప్తున్నారని తూర్పారబట్టారు. ఆయనకు బలహీవర్గాలపై ఎంతమాత్రం చిత్తశుద్ధిలేదని మండిపడ్డారు. అందుకే ఏనాడూ పార్లమెంట్లో బీసీ బిల్లుల అంశాన్ని లేవనెత్తలేదని, ఏ రోజూ ప్రధానమంత్రి మోదీతో మాట్లాడలేదని గుర్తుచేశారు. ఆయనకు బీసీలపై ప్రేమ ఉంటే కనీసం ప్రైవేట్ మెంబర్ బిల్లయినా పెట్టేవారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఢిల్లీలో ధర్నాల పేరిట డ్రామాలు రక్తి కట్టించారని దెప్పిపొడిచారు. కానీ ఏనాడూ తెలంగాణ ఎంపీలు బీసీ బిల్లులను లోక్‌సభలో ప్రస్తావించలేదని చెప్పారు. ఇప్పుడు కోర్టు తీర్పును అడ్డంపెట్టుకొని దగా చేసేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. ‘కనీసం జీవోల ద్వారా చేయాల్సిన పనులను ఎందుకు చేయడంలేదు? కాంట్రాక్టుల్లో వాటా ఇస్తామంటే అడ్డుకుంటున్నదెవరు? మంత్రివర్గంలో 42 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తామంటే అడ్డుచెప్తున్నదెవరు? మద్యం దుకాణాల్లో 25 శాతం కోటా ఇవ్వకుండా ఆపుతున్నదెవరు?’ అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. మాటలు చెప్పడం, కోతలు కోయడం తప్ప బలహీనవర్గాలను ఉద్ధరించిందేంలేదని విమర్శించారు.
బీజేపీతో బీసీలకు ఒరిగిందేంది?
బీసీలపై బీజేపీ కపటప్రేమ నటిస్తున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ పార్టీకి రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నా బీసీలకు 42 శాతం కోటాపై పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏనాడూ పార్లమెంట్లో గళమెత్తలేదని ఆక్షేపించారు. బీసీగా చెప్పుకొంటున్న ప్రధాని మోదీ కనీసం బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. ఆ పార్టీకి చెందిన ఎంపీలు సైతం ప్రధానమంత్రిపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని ప్రశ్నించారు.
కేసీఆర్ వెంటే బలహీనవర్గాలు
తెలంగాణలోని బలహీవవర్గాలకు కేసీఆర్ పాలనలోనే మేలు జరిగిందని కేటీఆర్ స్పష్టంచేశారు. ఉచిత చేపపిల్లలు, రొయ్యలు పంపిణీ చేసి గంగపుత్రులు, ముదిరాజ్‌ల ఆర్థికాభివృద్ధికి పాటుపడ్డారని గుర్తుచేశారు. నేత, గీత కార్మికులకు రూ.5 లక్ష ప్రమాద బీమా ఇచ్చి ఆదుకున్నారని చెప్పారు. ఈ పరిస్థితిలో బీసీలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని స్పష్టంచేశారు.
ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి
కేసీఆర్ పాలనలో బీసీల అభ్యున్నతికి చేసిన కృషి, కేటాయించిన నిధులను ప్రజలకు విడమరిచి చెప్పాలని కేటీఆర్ సూచించారు. రేవంత్ సర్కారు రెండేండ్లుగా చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులు జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ దుర్మార్గాలను వివరించాలని చెప్పారు. మేధావులు, విద్యార్థులు, సాహితీవేత్తలు, కళాకారులతో చర్చాగోష్టిలు నిర్వహించాలని సూచించారు. ప్రెస్మీట్లు పెట్టి కాంగ్రెస్ మోసాలను విడమరిచి చెప్పాలని పేర్కొన్నారు. అవసరమైతే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టేందుకు బీఆర్ఎస్ రాజ్యసభ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర సిద్ధంకావాలని సూచించారు. ఒకవేళ కేంద్రం బీసీ బిల్లులు పెడితే పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు మద్దతిస్తారని స్పష్టంచేశారు.
రేవంత్ ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: హరీశ్‌రావు
రెండేండ్లలో రేవంత్ సర్కారు బీసీలకు చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీసీ నాయకులకు మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. కేసీఆర్ పాలనలో బీసీల అభ్యున్నతికి అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన మంచి పనులను వివరించాలని కోరారు. కేసీఆర్ హయాంలోనే బీసీల అభ్యున్నతికి బాటలు పడ్డాయని గుర్తుచేశారు. మార్కెట్ కమిటీల్లో బీసీలకు రిజర్వేషన్లు కేటాయించిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు. గొల్లకుర్మలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెపిల్లలు అందజేసి వారి బతుకుల్లో వెలుగులు నింపారని చెప్పారు. రజకులు, నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. కానీ బీసీలకు ఉద్దెర హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు హామీలను విస్మరించి, ఉన్న పథకాలను కూడా బంద్‌పెట్టి బీసీల నోట్లో మట్టికొడుతున్నారని మండిపడ్డారు. 42 శాతం కోటా ఇస్తామని చెప్పి నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. ఆయన పాలనలో బీసీలకు కాంట్రాక్టుల్లో వాటాలు రాలేదని, విద్య, ఉద్యోగాల్లో కోటా ఇవ్వలేదని దెప్పిపొడిచారు. కాంగ్రెస్ మోసాలు, బూటకపు నాటకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌తో చర్చించి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టంచేశారు.
బీసీల ఓట్ల కోసమే కాంగ్రెస్ అగ్రనేత
రాహుల్‌గాంధీ, ఆ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కపటనాటకమాడుతున్నరు. కోర్టు తీర్పును సాకుగా చూపి రేవంత్‌రెడ్డి తప్పించుకొనే ప్రయత్నం
చేస్తున్నడు. బలహీవర్గాలపై రాహుల్‌కు ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదు. అందుకే ఏనాడూ పార్లమెంట్లో బీసీ బిల్లుల అంశాన్ని లేవనెత్తలేదు. ఏ రోజూ ప్రధానమంత్రి మోదీతో మాట్లాడలేదు.
-కేటీఆర్