హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తేతెలంగాణ) : బీసీలను దగా చేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై ఉద్యమించేందుకు బీఆర్ఎస్ (BRS) సిద్ధమైంది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు (Local Body Elections) వెళ్తామని మాయమాటలు చెప్పి మొండిచెయ్యి చూపిన హస్తం పార్టీపై సమరానికి సన్నద్ధమైంది. కామారెడ్డి డిక్లరేషన్‌లోని హామీ మేరకు విద్య, ఉద్యోగ, కాంట్రాక్టులు, రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మాటతప్పిన రేవంత్ సర్కారుపై కదనభేరి మోగించనున్నది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కోటా సాధనకు సమరశంఖం పూరించింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, మేధావులు, విద్యార్థులు, కవులు, కళాకారులు, ప్రజాసంఘాల నేతలతో కలిసి పోరుబాట పట్టనున్నది. సోమవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బీసీ నాయకులు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, వీ శ్రీనివాస్‌గౌడ్, జోగురామన్న, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, వివేకానంద్‌గౌడ్, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్, శంభీర్‌పూర్ రాజు, మహిళా నేత తుల ఉమ, పార్టీ ముఖ్యులు పెద్దసంఖ్యలో సమావేశానికి హాజరయ్యారు. వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు మార్గనిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు పార్టీ పరంగా 42 శాతం కోటా ఇవ్వాలని నిర్ణయించి ప్రభుత్వం జీవో 46ను జారీ చేసిన నేపథ్యంలో సుమారు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత కేవలం పార్టీ కోటా అంటూ మోసం చేస్తున్న కాంగ్రెస్ వైఖరిని ముక్తకంఠంతో ఖండించారు. బీఆర్ఎస్తోనే బీసీలకు న్యాయం జరుగుతుందని, కేసీఆర్ నాయకత్వమే బలహీనవర్గాలకు శ్రీరామరక్ష అని కుండబద్దలుకొట్టారు.
తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు పెంచామని బీహార్ ఎన్నికల్లో రాహుల్ చెప్పుకుంటూ తిరిగాడు. కానీ పాత కోటాతోనే ఎన్నికలకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. బలహీన వర్గాలను వంచిస్తున్న కాంగ్రెస్‌కు రాజకీయ సమాధి తప్పదు.
– సిరికొండ మధుసూదనాచారి
బీఆర్ఎస్ బీసీ జెండా : మాజీ మంత్రి గంగుల
బీసీలంటే కాంగ్రెస్‌కు మొదటి నుంచీ చిన్నచూపేనని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగి బలహీనవర్గాలకు ఆ పార్టీ చేసిందేమీలేదని మండిపడ్డారు. కులగణన చేయకుండా, న్యాయమైన వాటా ఇవ్వకుండా ద్రోహం చేసిందని విరుచుకుపడ్డారు. తెలంగాణ సిద్ధించిన తర్వాతే కేసీఆర్ పాలనలోనే బీసీలకు మేలు జరిగిందని స్పష్టంచేశారు. కానీ రేవంత్ సర్కారు అడుగడుగునా బీసీలకు దగా చేస్తున్నదని నిప్పులు చెరిగారు. పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం కోటా ఇస్తామని చెప్పి కోర్టు తీర్పును సాకుగా చూపి ద్రోహం చేసిందని విమర్శించారు. ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ బీసీ జెండా ఎత్తుకొని న్యాయం కోసం పోరాటం చేస్తుందని ప్రకటించారు.
కాంగ్రెస్ మోసాన్ని వివరిస్తం: ఎల్ రమణ
బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని, ఈ మోసాన్ని ప్రజలకు వివరించి స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్తామని ఎమ్మెల్సీ ఎల్ రమణ హెచ్చరించారు. ఇందుకోసం అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టంచేశారు. కేసీఆర్ హయాంలోనే బలహీనవర్గాలకు మేలు జరిగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, ఇలాంటి ద్రోహపూరిత హస్తంపార్టీని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం: చెరుకు సుధాకర్
బలహీనవర్గాలకు అడుగడుగునా ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌పై పోరాటానికి కార్యాచరణ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత చెరుకు సుధాకర్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో బీసీలకు జరిగిన మేలును ప్రజలకు వివరించాలని కోరారు. తెలంగాణ సాధన స్ఫూర్తితో పోరాటం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. పార్టీ నిర్దేశించిన కార్యాచరణ ప్రకారం ముందుకెళ్తామని తేల్చిచెప్పారు.
జీవో 46పై గళమెత్తాలి : కర్నె ప్రభాకర్
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ చివరికి చేతులెత్తేసిందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ దుయ్యబట్టారు. జీవో 46 తెచ్చి తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. ఇలాంటి మోసపూరిత పార్టీ కండ్లు తెరిపించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. జీవో 46పై ఊరూరా గళమెత్తేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.
బీజేపీ వైఖరిని ఎండగట్టాలి: ఎమ్మెల్యే కాలేరు
బీసీలకు కాంగ్రెస్, బీజేపీ ద్రోహం చేస్తున్నాయని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ధ్వజమెత్తారు. రెండు పార్టీల నేతలు పరస్పరం నెట్టుకుంటూ బీసీలను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. ప్రజల్లోకి వెళ్లి రెండు పార్టీల మోసాలను వివరించాలని చెప్పారు. బీజేపీని ఎట్టిపరిస్థితిలోనూ వదిలిపెట్టవద్దని స్పష్టంచేశారు.
కేసీఆర్‌తో చర్చించి ఉద్యమ కార్యాచరణ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో చర్చించి త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టంచేశారు. జీవో 46కు వ్యతిరేకంగా గళమెత్తాలని నిర్ణయించామని పేర్కొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్, అభయాస్తం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు విద్య, ఉద్యోగాలు, కాంట్రాక్టులు, సబ్‌ప్లాన్, ఏటా బడ్జెట్లో రూ.20 వేల కోట్ల నిధుల కోసం కొట్లాడుతామని ప్రకటించారు. పల్లెపల్లెకూ వెళ్లి కాంగ్రెస్ ద్రోహాన్ని ఎండగడుతామని చెప్పారు. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలపై నెపంనెట్టి తప్పించుకుంటున్న బీజేపీని కూడా వదిలిపెట్టబోమని, ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్, బీజేపీ నాటకాలను బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి రెండు జాతీయ పార్టీల కుట్రలను బహిర్గతం చేస్తామని తేల్చిచెప్పారు. బీహార్ ఎన్నికల్లో తెలంగాణ మోడల్ పేరిట ప్రచారం చేసిన రాహుల్‌గాంధీ కండ్లు తెరిపిస్తామని ప్రకటించారు. రాష్ర్టానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలపై ఒత్తిడి తేవడంతో పాటు అవసరమైతే పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెడతామని కుండబద్దలు కొట్టారు.
పీపీటీ ఇచ్చిన దాసోజు
బీఆర్ఎస్ బీసీ నాయకుల సమావేశంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ఎండగట్టారు. కామారెడ్డి డిక్లరేషన్ మొదలు, ఎన్నికల హామీలు, బీసీ కమిషన్ ఏర్పాటు, బూసాని వెంకటేశ్వర్రావు నేతృత్వంలోని డెడికేషన్ కమిషన్ చేసిన తప్పిదాలను ఎత్తిచూపారు. కులగణనలో జరిగిన పొరపాట్లను తెలియజేశారు. ఇందుకు సంబంధించిన జీవోలను చూపుతూ కాంగ్రెస్ సర్కారు మోసాలను సోదాహరణంగా వివరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్, అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు దూది మెట్ల బాలరాజు యాదవ్, పల్లె రవికుమార్, శుభప్రద్ పటేల్, సుమిత్రా ఆనంద్, ఆంజనేయులుగౌడ్, రాజారాంయాదవ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కిశోర్‌గౌడ్, సుర్వి యాదయ్యగౌడ్ పాల్గొన్నారు.