న్యూఢిల్లీ, నవంబర్ 24 : బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలోపేతం కావడం, అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడం దేశీయంగా ధరలు దిగొచ్చాయి. వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి తులం ధర రూ.1.25 లక్షల స్థాయికి పడిపోయింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల గోల్డ్ ధర రూ.700 దిగొచ్చి రూ.1,25,400గా నమోదైంది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర అంతేస్థాయిలో తగ్గి రూ.1,24,800గా నమోదైంది. బంగారంతోపాటు వెండి ధరలు కూడా దిగొచ్చాయి.
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో రూ.1,000 తగ్గిన కిలో వెండి రూ.1.55 లక్షలకు దిగొచ్చింది. గతవారంలో రికార్డు స్థాయిలో పతనమైన రూపాయి విలువ సోమవారం ఏకంగా 50 పైసలు ఎగబాకి రూ.89.16కి చేరుకోవడం వల్లనే గోల్డ్ ధరలు పడిపోయాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. రూపాయి వల్ల పసిడి ధరలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనవుతున్నాయని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,064 డాలర్లు పలుకగా, వెండి 50.09 డాలర్లు పలికింది. మరోవైపు, అంతర్జాతీయ బ్యాంకులు పసిడిని ఎగబడి కొనుగోళ్లు చేస్తున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో)లో 220 మెట్రిక్ టన్నుల గోల్డ్‌ను కొనుగోలు చేశాయి.