Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్లో లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను పెంచగా.. అమెరికా ఫెడ్ నిర్ణయాలు నేటి రాత్రి వెలువడనున్న విషయం తెలిసిందే. పలురంగాల్లోని షేర్ల కొనుగోళ్ల మద్దతు మార్కెట్లు లాభాల బాటలో నడిచాయి. అలాగే, తొలిసారిగా మార్కెట్లు రికార్డు స్థాయి గరిష్ఠాల వద్ద ముగియడం విశేషం. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,655.90 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత అదే ఊపును కొనసాగిస్తూ చివరలో సెన్సెక్స్ 81,828.04 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.
చివరగా 285.95 పాయింట్ల లాభంతో 81,741.34 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం ట్రేడింగ్‌లో పాయింట్ల 24,984.60 గరిష్ఠాన్ని నమోదు చేసింది. ముగింపులో 93.85 లాభంతో 24,951.15 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 1828 షేర్లు పురోగమించగా.. 1,613 షేర్లు పతనమయ్యాయి. మరో 78 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్ లాభాల్లో ముగిశాయి. బ్రిటానియా ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నష్టాల్లో ముగిశాయి. రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ మినహా మీడియా, పవర్, హెల్త్‌కేర్, మెటల్, ఫార్మా ఒక్కొక్కటి ఒక్కోశాతం పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు 0.63శాతం పెరగ్గా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా పతనమైంది.