GOLD | ముంబై, జూలై 30: బంగారానికి ధరల సెగ తగిలింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయంగా గోల్డ్ డిమాండ్ 149.7 టన్నులకే పరిమితమైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 5 శాతం తగ్గింది. అధిక ధరలే ఇందుకు కారణమని మంగళవారం విడుదలైన ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక తెలియజేసింది. ఈ క్రమంలోనే నిరుడు ఏప్రిల్-జూన్‌లో 158.1 టన్నులుగా పసిడికి గిరాకీ ఉన్నట్టు ‘క్యూ2 2024 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ రిపోర్ట్‌లో పేర్కొన్నది. కాగా, పరిమాణంపరంగా డిమాండ్ తగ్గినప్పటికీ దాని విలువ మాత్రం 17 శాతం పెరిగింది. నిరుడు ఏప్రిల్-జూన్‌లో అమ్ముడైన పుత్తడి విలువ రూ.82,530 కోట్లుగా ఉంటే.. ఈసారి అది రూ.93,850 కోట్లుగా ఉన్నది.
గడిచిన ఏప్రిల్-జూన్ వ్యవధిలో 24 క్యారెట్ తులం బంగారం ధర ఏకంగా రూ.74,000 దాటేసింది. దీంతో ఈ 3 నెలల్లో సగటు ధర వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), దిగుమతి సుంకం లేకుండా రూ.62,700.5గా నమోదైంది. పోయిన ఏడాది ఏప్రిల్-జూన్‌లో రూ.52,191.6గానే ఉండటం గమనార్హం. ఇక డాలర్ల లెక్కన చూసినా 1,975.9 డాలర్ల నుంచి 2,338.2 డాలర్లకు పెరిగింది. గుడి పాడ్వా, అక్షయ తృతీయ వంటివి కూడా కొనుగోళ్లను పెంచలేకపోయాయని డబ్ల్యూజీసీ ఇండియా ప్రాంతీయ సీఈవో సచిన్ అభిప్రాయపడ్డారు.