ITR | 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయం కోసం దాదాపు ఆరుకోట్ల ఆదాయపు పన్ను రిటర్న్లు (ITRs) దాఖలయ్యాయి. ఇందులో 70శాతం కొత్త పన్ను విధానంలోనే నమోదైనట్లుగా రెవెన్యూశాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పన్ను చెల్లింపుదారులు కొత్త విధానంపైనే మొగ్గు చూపినట్లుగా తెలిపారు. సరళీకృత కొత్త పన్ను విధానాన్ని ప్రజలు అవలంబిస్తారా? లేదా? అనే భయాలు ఉన్నాయని.. ఇప్పుడు దీనికి ఎలాంటి ఆందోళన లేదన్నారు. బడ్జెట్లో ప్రకటించిన సమగ్ర ఆదాయపు పన్ను సమీక్ష వెనుక ఉన్న ఆలోచన పన్ను చట్టాన్ని సరళతరం చేయడమేనని ఆయన అన్నారు.
ముసాయిదాను తయారు చేసి సలహాలు తీసుకుంటామన్నారు. సరళీకరణ దిశగా అడుగు వేశామని పేర్కొన్నారు. దీని అంతిమ లక్ష్యం పన్ను సమ్మతి భారాన్ని తగ్గించడమేనన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.61 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం దేశంలో రెండు వ్యక్తిగత ఆదాయ పన్ను విధానాలు అమలులో ఉన్నాయి. పాత ఆదాయపు పన్ను విధానంలో.. పన్ను రేట్లు ఎక్కువగానే ఉంటాయి. కానీ, పన్ను చెల్లింపుదారులు అనేక మినహాయింపులను, తగ్గింపులను క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది. అయితే, కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉంటాయి. ఇందులో తగ్గింపులు కూడా తక్కువగా ఉంటాయి.