Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఆ తర్వాత మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు ఒక్కసారిగా అస్థిరతకు గురయ్యాయి. ఈ క్రమంలో చివరకు స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ ఉదయం 81,679.65 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. దాదాపు 300 పాయింట్లకుపైగా లాభపడింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 81,908.43 పాయింట్లకు చేరుకొని సరికొత్త జీవనకాల గరిష్ఠానికి చేరుకున్నది. నిఫ్టీ సైతం 24,943.30 పాయింట్ల వద్ద లాభాల్లో ట్రేడింగ్ మొదలైంది. ఈ క్రమంలోనే 24,999.75 పాయింట్లకు చేరువై ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకున్నది. అదే జోరును కొనసాగిస్తూ తొలిసారిగా 25వేల మార్క్‌ను, సెన్సెక్స్ 82వేల మార్క్‌ను అధిగమిస్తుందని నిపుణులు అంచనా వేశారు.
సూచీలు ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకున్న నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో ఒక్కసారిగా ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 81,908.43 పాయింట్ల గరిష్ఠానికి చేరగా.. అత్యల్పంగా 81,135.91 పాయింట్లకు పతనమైంది. చివరకు 23.12 పాయింట్ల లాభంతో 81,355.84 వద్ద ముగిసింది. నిఫ్టీ 1.25 పాయింట్ల స్వల్ప లాభంతో 24,836.10 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీలో దివీస్ ల్యాబ్స్, ఎల్అండ్టీ, బీపీసీఎల్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. టైటాన్ కంపెనీ, భారతీ ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే ఐటీ, ఎఫ్ఎంసీజీ, టెలికాం 0.4 శాతం చొప్పున పతనమయ్యాయి. ఆటో, బ్యాంక్, మీడియా, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, రియల్టీ 0.5-2.5 శాతం చొప్పున పెరిగాయి. బీబిఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు ఒకశాతం వరకు పెరగ్గా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.2శాతం పెరిగింది.