Gold Investment | బంగారం.. తరాలు మారినా వన్నె తగ్గని సంపద. అందుకే అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ కూడా పుత్తడిపై అందరికీ అంత మక్కువ. అయితే ఒకప్పటితో పోల్చితే నేడు పసిడిని చూసే వైఖరి మారింది. ముఖ్యంగా నేటి తరం దాన్ని కేవలం ఆభరణంగా మాత్రమేగాక, ఓ తెలివైన పెట్టుబడి సాధనంగా చూస్తున్నది.
ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. బంగారంపై కనీస కస్టమ్స్ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. 10 శాతం నుంచి 6 శాతానికి తెచ్చారు. ఈ నేపథ్యంలో గోల్డ్ రేట్లు క్రమేణా దిగొస్తున్నాయి. బడ్జెట్‌కు ముందు రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన పుత్తడి ధరలు.. ఇప్పుడు రివర్స్‌గేర్‌లో నడుస్తున్నాయి. గడిచిన నాలుగైదు రోజుల్లో తులం రూ.5-6 వేలు తగ్గింది మరి. ఇప్పటికే 24 క్యారెట్ ధర రూ.70 వేల దిగువకు, 22 క్యారెట్ రేటు రూ.63 వేల దరిదాపుల్లోకి వచ్చింది. అయితే ధరలు ఇంకా తగ్గుతాయన్న అంచనాల నడుమ ఇన్వెస్టర్లు అతిగా వేచిచూసే ధోరణిని అవలంభించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వీలున్నంత మేర కొనుగోళ్లకు దిగడమే ఉత్తమమన్న అభిప్రాయాలనూ కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ రకాల పెట్టుబడి సాధనాలను పరిశీలించాలని సలహా ఇస్తున్నారు. నిజానికి బంగారం.. భౌతిక రూపం నుంచి కాగితం, వర్చువల్ రూపానికీ మారిందిప్పుడు. అసలు బంగారంపై పెట్టుబడికున్న మార్గాలను ఒక్కసారి పరిశీలిస్తే..
ఎప్పట్నుంచో పుత్తడి అంటే గుర్తొచ్చేది నగలే. కాబట్టి బంగారంపై పెట్టుబడి పెట్టాలనే కోరిక ఉన్నవారు ఆభరణాల కొనుగోళ్లతోనూ ముందుకెళ్లవచ్చు. అయితే హాల్మార్క్తోపాటు తయారీ, తరుగు, ఇతరత్రా ఖర్చులన్నింటినీ చూసుకొని కొనడం వల్ల లాభాలను పెంచుకోవచ్చు. కానీ నగ డిజైన్‌నుబట్టి కూడా దాని ధర మారుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.
గోల్డ్ కాయిన్స్ కూడా పెట్టుబడికి అనువైనవే. నగల వర్తకులు, బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు, చివరకు ఈ-కామర్స్ సంస్థలూ అమ్ముతున్నాయి. గోల్డ్ కాయిన్లు, కడ్డీలు 24 క్యారెట్, 99.9 స్వచ్ఛతతో ఉంటాయి. అన్ని నాణేలు, కడ్డీలపై బీఐఎస్ ప్రమాణాలతో కూడిన హాల్‌మార్క్ ఉంటుంది. నకిలీ, మోసం, డ్యామేజీకి తావు లేకుండా ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్‌తో ఉన్న నాణేలను కొనాలి. అర గ్రాము నుంచి 5 తులాలదాకా బరువున్న నాణేలు దొరుకుతాయి. మీ వీలునుబట్టి కొనవచ్చు.
గత కొన్నేండ్లుగా చాలామంది జ్యుయెల్లర్స్ గోల్డ్ సేవింగ్స్ స్కీములను తెస్తున్నారు. ప్రతీ నెలా కొంత మేర నగదును మీరు సదరు వ్యాపారి వద్ద డిపాజిట్ చేస్తే.. నిర్ణీత కాలపరిమితి తర్వాత దానికి సమాన విలువైన బంగారాన్ని తీసుకోవచ్చు. నగదు ప్రోత్సాహకాలు, బహుమతుల రూపేణా కూడా వ్యాపారులు ఇస్తున్నారు. పేరున్న సంస్థల్లో ఈ స్కీములను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవచ్చు.
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌నే గోల్డ్ ఈటీఎఫ్‌లుగా పిలుస్తున్నారు. ఈ లావాదేవీలు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)ల్లో ప్రధానంగా జరుగుతాయి. సిప్‌లు, స్టాక్ బ్రోకర్లు, డీమ్యాట్ ఖాతాల ద్వారా ట్రేడింగ్‌కు, పెట్టుబడులకు దిగవచ్చు. కనీసం 1 గ్రాము పెట్టుబడిగా పెట్టాలి.
సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)ను ప్రభుత్వం జారీ చేస్తుంది. కాబట్టి వీటిని సురక్షిత పెట్టుబడులుగానే పరిగణించవచ్చు.
ఇన్వెస్టర్లు డిజిటల్ గోల్డ్నూ పరిశీలించవచ్చు. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యాప్‌ల ద్వారా కొనవచ్చు. ఎంఎంటీసీ, పీఏఎంపీలతో ఇవి టైఅప్ అయ్యి ఉంటాయి.