MSSC | మహిళా మదుపరుల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చిన్నమొత్తాల పొదుపు పథకం.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ స్కీం.. వచ్చే ఏడాది మార్చి 31తో దూరం కానున్నది. ఇటీవలి కేంద్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దీని గడువును పెంచుతారని భావించినా అదేమీ జరుగలేదు. దాంతో ఆకర్షణీయ వడ్డీరేటును అందించే ఈ సర్టిఫికెట్.. మరెంతో కాలం కొనసాగని పరిస్థితి. అందుకే ఇప్పటికైనా ఇందులో పెట్టుబడులు పెట్టకపోతే ఆ దిశగా అడుగులు వేయాలని మెజారిటీ ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారిప్పుడు.
భారతీయ మహిళల్లో పొదుపు అలవాటును పెంపొందించేందుకు ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌ను పరిచయం చేశారు. తపాలా శాఖ ఈ స్కీంలో పెట్టుబడులకు అవకాశాన్ని కల్పిస్తున్నది. అలాగే ఈ పథకాన్ని వీలైనంత ఎక్కువ మహిళలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిరుడు సూచనలు చేసింది. ఈ క్రమంలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులూ ఈ స్కీంను అమలు చేస్తున్నాయి.
దేశంలోని మహిళలందరికీ ఇందులో పెట్టుబడి పెట్టేందుకు వీలున్నది. అలాగే మైనారిటీ తీరని తమ ఆడపిల్లల కోసం తల్లిదండ్రులు, వారి సంరక్షకులు కూడా ఈ స్కీంను తీసుకోవచ్చు. దీని కాలపరిమితి రెండేండ్లు. గరిష్ఠంగా రూ.2 లక్షలదాకా పెట్టుబడిగా పెట్టవచ్చు. దీనిపై వార్షిక వడ్డీరేటు 7.5 శాతంగా ఉన్నది. ఇది మారదు. ప్రతీ 3 నెలలకోసారి లెక్కించి ఖాతాలో జమ చేస్తారు. ఖాతా కాలపరిమితి తీరినప్పుడు చెల్లిస్తారు. అయితే ఖాతా తెరిచిన ఏడాది తర్వాత అవసరాలనుబట్టి పెట్టుబడిగా పెట్టిన దాంట్లో 40 శాతం వరకు ఉపసంహరించుకోవడానికి వెసులుబాటు కూడా ఉన్నది.
ఖాతాను తెరిస్తే రెండేండ్లపాటు కొనసాగించాల్సిందే. అయితే ఖాతాదారు చనిపోతే లేదా ఖాతాదారు, మైనర్ల సంరక్షకుడు ప్రాణాంతక వ్యాధి బారినపడితే మూసేందుకు అవకాశాన్నిస్తారు. అలాగే నిబంధనలకు లోబడి వడ్డీరేట్లను చెల్లిస్తారు. ఇక కాలపరిమితి తీరిన ఖాతాల నుంచి నగదు ఉపసంహరణకు ఫామ్-2ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఖాతాను తెరిచేందుకు బ్యాంక్ ఫారం, ఆధార్, పాన్ తదితర కేవైసీ ధ్రువపత్రాలు మొదలగునవి అవసరం. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని బ్యాంక్ శాఖ లేదా పోస్టాఫీస్‌ను సంప్రదించవచ్చు.
ఇటీవలి కేంద్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో భాగంగా ‘వాత్సల్య’ పేరుతో ఓ కొత్త పథకాన్ని పరిచయం చేశారు. చిన్నారుల కోసం తెచ్చిన దీర్ఘకాలిక సేవింగ్స్ స్కీం ఇది. ఈ మైనర్ పెన్షన్ స్కీంలో తమ పిల్లల కోసం తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు చేరవచ్చు. దీంతో భవిష్యత్తులో పిల్లలకు ఆర్థిక భద్రతను కల్పించినట్టవుతుంది. పిల్లలకు 18 ఏండ్లు వచ్చాక, ఈ వాత్సల్య పథకాన్ని రెగ్యులర్ ఎన్పీఎస్ ఖాతాగా కూడా మార్చుకోవచ్చు. భారతీయులతోపాటు ప్రవాస భారతీ యులు తమ పిల్లల కోసం ఈ స్కీంను తీసుకోవచ్చు. అధికారిక ఈఎన్పీఎస్ వెబ్సైట్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది. దీనికి ప్రీమియంలు ఆయా బ్యాంకుల ద్వారా చేసుకునే సౌలభ్యం ఉంటుందంటున్నారు.