శుక్రవారం 05 మార్చి 2021
Business - Feb 06, 2021 , 02:00:43

ఆన్‌లైన్‌ నగదు బదిలీ కుదరదు

ఆన్‌లైన్‌ నగదు బదిలీ కుదరదు

  • మార్చి 1 నుంచి మారుతున్న విజయా, దేనా బ్యాంక్‌ల ఐఎఫ్‌ఎస్‌సీలు
  • కొత్త కోడ్‌లను పొందాలంటున్న బీవోబీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఈ-విజయా, ఈ-దేనా ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు వచ్చే నెల 1 నుంచి మారబోతున్నాయి. దీంతో కొత్త కోడ్‌లు పొందాలని తమ కస్టమర్ల (ఆయా బ్యాంక్‌ల పాత కస్టమర్లు)ను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) కోరుతున్నది. లేదంటే ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌కు వీలుండదని బ్యాంక్‌ ట్వీట్‌ చేసింది. 2019లో బీవోబీలో విజయా, దేనా బ్యాంక్‌లు విలీనమైన విషయం తెలిసిందే. ఫలితంగా 5 కోట్లకుపైగా కొత్త ఖాతాదారులు బీవోబీలోకి వచ్చారు. వీరంతా ఇప్పుడు కొత్త ఐఎఫ్‌ఎస్‌సీలను పొందాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే విజయా, దేనా బ్యాంక్‌ల 3,898 శాఖలతోపాటు వాటి ఏటీఎంలు, పీవోఎస్‌ మెషీన్లు, క్రెడిట్‌ కార్డులు బీవోబీ బ్రాండ్‌లోకి మారిపోయాయి. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు కూడా మారిపోతున్నాయి. 

కొత్త ఐఎఫ్‌ఎస్‌సీని ఎలా పొందాలి?

ఈ-విజయా, దేనా శాఖల కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను ఖాతాదారులు సులువుగానే పొందవచ్చని బీవోబీ చెప్తున్నది. తమ వెబ్‌సైట్‌ను లేదా ఖాతా ఉన్న శాఖనుగానీ సంప్రదించాలని సూచిస్తున్నది. అలాగే 18002581700 హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు కాల్‌ చేయవచ్చని, లేదంటే మీ ఖాతాకు అనుసంధానమైన మొబైల్‌ నెంబర్‌ నుంచి MIGR <SPACE> పాత ఖాతా నెంబర్‌లోని చివరి 4 అంకెలను టైప్‌ చేసి 8422009988 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపవచ్చని తెలిపింది. 

VIDEOS

logo