కందుకూరు/బడంగ్‌పేట, మే 8 : ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎందుకు నీకు చేవెళ్ల ప్రజలు ఓటు వేయాలని ప్రశ్నించారు. బీసీలు అంతా ఏకమై బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి కందుకూరులో హైదరాబాద్, శ్రీశైలం రహదారితో పాటు మహేశ్వరం మండల కేంద్రంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌లతో కలిసి రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ మెట్రో, ఫార్మాసిటీలను ఎందుకు రద్దుచేశారని ప్రశ్నించారు. ఆడబిడ్డల పట్ల చులకనగా మాట్లాడుతున్నారని, తన పట్ల ఇష్టాను సారంగా మాట్లాడడం తగదని మండిపడ్డారు. తాను రాత్రి సమయంలో బీజేపీకి, ఉదయం సమయంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారని.. బీజేపీకి ప్రచారం చేయాల్సిన గతి పట్టలేదని తెలిపారు. రైతుల రుణమాఫీ, రూ.500లకు గ్యాస్, రూ.4వేల పింఛన్, ప్రతి ఇంట్లో మహిళకు రూ.2500, 24 గంటల విద్యుత్ ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్‌కు ఓటేయాలా.. అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన అభివృద్ధి ప్రజల ముందు కదలాడుతుందన్నారు. తుక్కుగూడకు అనేక కంపెనీలు తీసుకువచ్చినట్లు తెలిపారు. కరెంటు ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి చేవెళ్లకు చేసింది గుండు సున్న అని విమర్శించారు. మతం, కులం పేరు మీద ఓట్లు అడుగుతున్న బీజేపీకి, హామీలను ఎగ్గొట్టిన కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ మాజీ మెంబర్ నర్సింహ, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జయేందర్ ముదిరాజ్, మార్కెట్ మాజీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, మేఘనాథ్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్‌రెడ్డి, సీనియర్ నేతలు లక్ష్మీనర్సింహరెడ్డి, దశరథ, అంజయ్యగౌడ్, బాల్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.