అత్తాపూర్ డివిజన్ పరిధిలోని రాంబాగ్ చిన్న అనంతగిరి శివాలయం మధ్యన ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలంటూ బుధవారం స్థానికులు ధర్నా నిర్వహించారు. హైదర్గూడ, ఉప్పర్పల్లి, అత్తాపూర్ ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీల నాయకులతో పాటు యువకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరించారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేరుకొని భూమిలో కొనసాగుతున్న కబ్జాల తీరును పరిశీలించారు. దస్తావేజులన్నింటినీ పరిశీలించి.. పూర్తి నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూమి అని తేలితే స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు తహసీల్దార్ రాములు, రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
-మైలార్దేవ్పల్లి, మార్చి 11